ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
గరుడోపాఖ్యానము
కద్రూవినతలు పుత్రులం గోరి పడయుట (సం. 1-14-5)
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుంజెప్పె: నాదియుగంబునం గశ్యపప్రజాపతిభార్యలయిన కద్రువయు వినతయు ననువారలు పుత్త్రార్థినులైయనేక సహస్రవర్షంబులు కశ్యపు నారాధించినం, గశ్యపుండు ప్రసన్నుం డై ‘మీకోరినవరంబు లిచ్చెద వేఁడుం’ డనిన. 2
తరలము. అనలతేజులు, దీర్ఘదేహులు నైనయట్టి తనూజులన్‌
వినుతసత్త్వులఁ గోరెఁ గద్రువ వేవురం గడువేడ్కతో;
వినత గోరె సుపుత్త్రులన్‌ భుజవీర్యవంతుల, వారికం
టెను బలాధికు లైన వారిఁ, గడిందివీరుల, నిద్దఱన్‌.
3
వ. కశ్యపప్రజాపతి తొల్లి పెద్దకాలంబు తపంబు సేసి, పుత్త్రకామేష్టిఁ జేసెఁ గావునఁ గద్రువకు వేవురుకొడుకులను, వినతకు నిద్దఱుకొడుకులను వారికోరినయట్ల యిచ్చి, గర్భంబు లిమ్ముగా రక్షింపంబనిచిన నయ్యిద్దఱును దద్దయు సంతసిల్లి యున్నంత, గర్భంబులు గొండొకకాలంబునకు నండంబు లైన, నయ్యండంబులు ఘృతకుండంబులం బెట్టి రక్షించుచున్నంత, నేనూఱేండ్లకుఁ గద్రూగర్భాండంబులు తరతరంబ యవిసిన నందు శేష వాసుక్యైరావత తక్షక కర్కోటక ధనంజయ కాళియ మణినాగాపూరణ పింజర కైలాపుత్త్ర వామన నీలానీల కల్మాష శబలార్య కోగ్రక కలశపోతక సురాముఖ దధిముఖ విమలపిండ కాప్త కర్కోటక శంఖవాలి శిఖ నిష్ఠానక హేమగుహ నహుష పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గర పిండక కంబలాశ్వతర కాళీయక వృత్త సంవర్తక పద్మశంఖముఖ కూష్మాండక క్షేమక పిండారక కరవీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వపాండర మూషకాద శంఖశిరః పూర్ణభద్రహరిద్రకాపరాజిత జ్యోతిక శ్రీవహ కౌరవ్య ధృతరాష్ట్ర శంఖపిండ వీర్యవ ద్విరజస్సుబాహు శాలిపిండ హస్తిపిండ పిఠరక సుముఖ కౌణపాశన కుఠర కుంజర ప్రభాకర కుముద కుముదాక్ష తిత్తిరి హలిక కర్దమ బహుమూలక కర్కరాకర్కర కుండోదర మహోదరు లాదిగాఁగల వేవురు నాగముఖ్యులు పుట్టిన. 4
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )