ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
దేవాసురు లమృతమును బడయఁగోరి సముద్రమును మథించుట (సం. 1-15-5)
క. అమరాసురవీరులు ము | న్నమల పయోరాశిఁ ద్రచ్చి, యమృతము వడయన్‌
సమకట్టి, సురేంద్రపురో | గము లై హరిహరహిరణ్యగర్భులతోడన్‌.
8
ఉ. మేరుమహామహీధరముమీఁదికి నందఱుఁ బోయి, ‘యేక్రియన్‌
వారిధిఁ ద్రచ్చువారము? ధ్రువంబుగ దానికిఁ గవ్వ మెద్ది? యా
ధారము దాని కెద్ది?’ యని తద్దయు వెన్బడియున్న, నచ్యుతాం
భోరుహగర్భులిద్దఱును బూనిరి సర్వము నిర్వహింపఁగన్‌.
9
చ. అరుదుగ సర్వశైలములయంత తనర్పును నార్జవంబు సు
స్థిరతయు నోషధీరసవిశేషతయుం గల దుత్తమంబు మం
థరకుధరంబు గవ్వ మగు దానికి నంచును నిశ్చయించి, య
య్యిరువురుఁ బంపఁగాఁ బెఱికి యెత్తె ననంతుఁడు తద్గిరీంద్రమున్‌.
10
వ. ఇట్లు పదునొకండువేలయోజనంబులతనర్పును, నంతియపాఁతునుం గల మంథరనగం బనంతుం డనంత శక్తిం బెఱికి యెత్తిన, నందఱును నప్పర్వతంబు దెచ్చి, సముద్రంబులో వైచి, దానిక్రింద నాధారంబుగాఁ గూర్మరాజు నియమించి, యోక్త్రంబుగా వాసుకి నమర్చి. 11
శా. క్షోణీచక్రభరంబు గ్రక్కదల దిక్కుల్‌ మ్రోయఁగా నార్చి, య
క్షీణోత్సాహసమేతు లై రయమునన్‌ గీర్వాణులుం, బూర్వగీ
ర్వాణవ్రాతము నభ్ధిఁ ద్రచ్చునెడఁ దద్వ్యాకృష్టనాగానన
శ్రేణీప్రోత్థవిషాగ్నిధూమవితతుల్‌ సేసెం బయోదావలిన్‌.
12
క. ఉరగపతితలలవల నురు | తరజవమున నసురు లూఁది, తత్పుచ్ఛము ని
ర్జరవరు లూఁది మహామ | త్సరమున వడిఁ ద్రచ్చి త్రచ్చి జవమఱియున్నన్‌.
13
క. నారాయణుండు వారి క | వారితజవసత్త్వములు ధ్రువంబుగ నిచ్చెన్‌;
వారును దొల్లిటికంటె న | పారప్రారంభు లై రపరిమితశక్తిన్‌.
14
చ. ఉడుగక యొండొరుం జఱచి యొక్కబలంబున దేవదానవుల్‌
వడిగొని వార్ధి నిట్లు దరువం దరువన్‌ విష ముద్భవిల్లి నల్‌
గడలను విస్ఫులింగములు గప్పఁగఁ బర్విన, దానిఁ జెచ్చెరన్‌
మృడుఁడు గడంగి పట్టుకొని మ్రింగి గళంబున నిల్పెఁ బొల్పుగన్‌.
15
వ. మఱియు జ్యేష్ఠయుఁ జంద్రుండును శ్రీయును నుచ్చైశ్శ్రవంబును గౌస్తుభంబును నైరావణగజంబును నమృతపూర్ణశ్వేతకమండలు ధరుండైన ధన్వంతరియు నాదిగా ననేకంబు లుద్భవిల్లిన, నందుఁ ద్రిభువనవంద్య యయిన శ్రీదేవియు నిజప్రభాపటలపర్యుదస్త ప్రభాకరగభస్తివిస్తరం బయిన కౌస్తుభంబును నారాయణు వక్షఃస్థలంబున విలసిల్లె; నుచ్చైశ్శ్రవం బను యుగ్యంబు నైరావణగజంబును సురరాజయోగ్యంబు లయ్యె; నంత నయ్యమృతంబు నసురులు చేకొనిన. 16
క. నారాయణుండు కృత్రిమ | నారీరూపమునఁ దన్మనంబుల కతి మో
హారంభకారుఁ డై, యమ | రారులచేఁ గ్రమ్మఱంగ నమృతము గొనియెన్‌.
17
వ. ఇ ట్లుపాయంబున నసురుల వంచించి యమృతంబు గొని విష్ణుదేవుండు దేవతల కిచ్చిన, నయ్యమృతంబు దేవత లుపయోగించుచోదేవరూపంబు దాల్చి రాహువు వేల్పులబంతి నయ్యమృతం బుపయోగించుచున్నఁ దత్సమీపంబున నున్న చంద్రాదిత్యులు వాని నెఱింగి నారాయణునకుం జెప్పిన, నయ్యమృతంబు వాని కంఠబిలంబు సొరకముందఱ. 18
క. అమరారిమర్దనుఁడు చ | క్రము గ్రక్కున నేయ, రాహుకంఠము దెగి దే
హము ధరణిఁ బడియెఁ, దన్ముఖ | మమృతస్పర్శమున నక్షయం బై నిలిచెన్‌.
19
వ. నాఁటంగోలె రాహువునకుఁ జంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతం బై ప్రవర్తిల్లుచుండె. 20
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )