ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
దేవదానవుల యుద్ధము (సం. 1-11-10)
సీ. అంత దేవాహితు లమృతంబు గానక | యెంతయు నలిగి బలీంద్రుఁ గూడి
మంతనం బుండి ‘యమర్త్యులతోడి పొ | త్తింతియ చాలు, నింకేల?’ యనుచు
సంతనకట్టి, యుత్సాహసమేతులై | యంతంబులేని రథాశ్వములను
దంతుల నమితపదాతుల నొడఁగూర్చి!| యంతకాకారు లై యార్చి, యమర
 
ఆ. వరులఁ దాఁకి యేసి రురుతరశరపక్ష | జాతవాతరయవిధూత మగుచుఁ
జెదర జలదపంక్తి, బెదర వజ్రాయుధు | హృదయ, ముదిలకొనఁగఁ ద్రిదశగణము.
21
మహాస్రగ్ధర. అమరేంద్రారాతు లిట్లాహవముఖమున నేయంగఁ దత్తీక్ష్‌ణబాణౌ
ఘము ఘోరం బై సురానీకముపయిఁ బెలుచం గప్పినం జూచి, దైత్యో
త్తములం గోదండచక్రోద్యతభుజులు మహాదారుణుల్‌ వీరలక్ష్మీ
రమణుల్‌ దుర్వారవాత్యారయమున నరనారాయణుల్‌ దాఁకి రల్కన్‌.
22
మ. నరచాపప్రవిముక్తదారుణబృహన్నారాచధారల్‌ భయం
కరదైతేయనికాయకాయములపైఁ గప్పెన్‌ దిశల్‌ నిండ బం
ధురధాత్రీధరతుంగశృంగతటసందోహంబుపైఁ గప్పు దు
ర్ధర ధారాధర ముక్తసంతతపయోధారావళిం బోలుచున్‌.
23
మ. పతదుర్వీధరధాతునిర్ఝరజలాభం బై మహాదేహని
ర్గత సాంద్రారుణపూర మొక్కమొగి నొల్కం ద్రెస్సి, నారాయణో
న్నతదోర్దండవిముక్తచక్రనిహతిన్‌ నాకద్విషన్మస్తక
ప్రతతుల్‌ ఘోరరణంబునం బడియె భూభాగంబు కంపింపఁగన్‌.
24
వ. ఇట్లు సముద్రతీరంబున నమరాసురులకు నతిఘోరయుద్ధం బయ్యె; నందు నరనారాయణు లపారపరాక్రము లై యసురవీరులఁ బెక్కండ్రం జంపిన నుక్కడంగి, దెసచెడి, యసురులు సముద్రంబు సొచ్చిన, నమరులు సమరలబ్ధవిజయు లై యమరపతి నమృతరక్షణార్థంబు ప్రార్థించి, యథాస్థానంబున మంథరనగంబు ప్రతిష్ఠాపించి, తమతమనివాసంబులకుం జని సుఖంబుండి రంత. 25
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )