ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
కద్రూవినత లుచ్చైశ్శ్రవమును జూచి పందెములు సఱచుట (సం. 1-18-1)
క. అమృతముతో నుద్భవ మై | యమరేశ్వరయోగ్య మైన హయరత్నము త
ద్విమలోదధితీరంబునఁ | గొమరుగ నేకతమ యిచ్చఁ గ్రుమ్మరుచున్నన్‌.
26
వ. కద్రువయు, వినతయు వినోదార్థంబు విహరించువారు కరిమకరనికరాఘాతజాత వాతోద్ధూత తుంగతరంగాగ్రసముచ్చలజ్జలకణాసారచ్ఛటాచ్ఛాదిత గగనతలం బైనదాని, నుద్యానవనంబునుంబోలె బహువిద్రుమలతాలంకృతం బైనదాని, నాటకప్రయోగంబునుంబోలె ఘనరసపాత్రశోభితరంగరమ్యం బైనదాని, దివంబునుం బోలె నహిమకరభరితం బైనదాని మఱియు. 27
చ. అలఘుఫణీంద్రలోకకుహరాంతరదీప్తమణిస్ఫురత్ప్రభా
వలి గలదాని, శశ్వదుదవాసమహావ్రతశీతపీడితా
చలమునిసౌఖ్యహేతువిలసద్బడబాగ్ని శిఖాచయంబులన్‌
వెలిఁగెడిదానిఁ గాంచి రరవిందనిభానన లమ్మహోదధిన్‌.
28
మ. వివిధోత్తుంగ తరంగ ఘట్టన చలద్వేలావనైలావలీ
లవలీలుంగలవంగ సంగతలతాలాస్యంబు లీక్షించుచున్‌
ధవళాక్షుల్‌ సని కాంచి రంత నెదురం దత్తీరదేశంబునం
దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్వోత్తముం దవ్వులన్‌.
29
వ. కని, కద్రువ వినతం జూచి ‘చూడవె యల్ల యతిధవళంబైన యశ్వంబునందు సంపూర్ణచంద్రునందు నల్లయుంబోలె వాలప్రదేశంబునందు నల్ల యై యున్నది’ యనిన విని వినతనగి ‘నీ వే కన్నులం జూచితే యక్క! యెక్కడిది నల్ల? యీయశ్వరాజుమూర్తి మహాపురుషకీర్తియుంబోలె నతినిర్మలం బై యొప్పుచున్నయది’ యనిన విని నవ్వి వినతకుఁ గద్రువ యి ట్లనియె. 30
తే. ‘అమ్మహాశ్వంబుధవళదేహంబునందు | నల్ల గలిగిన నీ విపు నాకు దాసి
వగుము; మఱి యందు నల్లలే దయ్యె నేని | నీకు నే దాసి నగుదుఁ; బన్నిదము సఱుము.’
31
వ. అని యి ట్లిద్దఱు నొండొరులకు దాసీత్వంబు పణంబుగా నొడివి పన్నిదంబు సఱచిన, వినత ‘యయ్యశ్వంబు డాసి చూతము ర’ మ్మనినఁ గద్రువయు ‘నిపుడు ప్రొద్దు లేదు, పతిపరిచర్యాకాలంబు నయ్యె; ఱేపకడయ చూత’ మని యిద్దఱు మగుడివచ్చి తమ నివాసంబులకుం బోయి యున్న యప్పుడు. 32
సీ. కద్రువ కొడుకులకడ కేఁగి ‘యేను మి | మ్మందఱ వేఁడెద నన్నలార!
నాపంపు సేయుండు, నన్ను రక్షింపుఁడు | కామచారులకు దుష్కరము కలదె!
యుల్ల తెల్లని తురగోత్తము వాలంబు | నల్ల సేసితిరేని నాకు దాసి
యగు మన వినత, మీ రట్లు సేయనినాఁడు | దానికి మఱి యేను దాసి నగుదు;
 
ఆ. జంట పన్నిదంబు సఱచితి మిట్లుగా’ | ననినఁ బాములెల్ల ‘ననయ మిదియుఁ
దల్లి పనిచె నని యధర్మువు సేయంగ | నగునె? యెఱుక గలరె మగువ లెందు’!
33
వ. అని యందఱుఁ దమలో విచారించి యధర్మారంభంబునకు సుముఖులు గాకయున్నఁ, గద్రువ కోపోద్దీపితముఖి యై. 34
క. ‘అనుపమముగ జనమేజయుఁ | డను జనపతి సేయు సర్పయాగ నిమిత్తం
బునఁ బాములు పంచత్వము | సనియెడు’ మని యురగములకు శాపం బిచ్చెన్‌.
35
వ. అందు శాపానుభవభీతచిత్తుం డై కర్కోటకుం డనువాఁడు తల్లి పంచినరూపంబున నుచ్చైశ్శ్రవంబువాలంబు నీలంబుగాఁ బట్టి వ్రేలుచున్న, మఱునాఁడు ఱేపకడయ కద్రువయు వినతయుం జని, యత్తురంగంబుఁ జూచి వినత యోటువడి, కద్రువకు దాసి యై, నోసి పనులు సేయుచున్నంతఁ, బంచశత వర్షంబులు నిండి రెండవయండం బవిసిన నందు. 36
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )