ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
వినతకు గరుడుండు జనియించుట (సం. 1-20-4)
ఉ. ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల
వ్రాత మహార్ణవుండు, బలవన్నిజదేహసముజ్జ్వల ప్రభా
ధూత పతంగతేజుఁ డుదితుం డయి తార్‌క్ష్యుఁడు తల్లికిన్‌ మనః
ప్రీతి యొనర్చుచున్‌ నెగసె భీమజవంబున నభ్రవీథికిన్‌.
37
క. దారుణకల్పాంతమరుత్‌ | ప్రేరిత హవ్యవహశిఖల పెల్లిది యని బృం
దారకమునిబృందస్తుతి | బోరనఁ దా నగ్నిసూక్తములతో నెసఁగెన్‌.
38
వ. అంత. 39
క. హరికులిశక్షతి యెఱుఁగని | గురుతరపక్షములతోడి కులగిరివోలెన్‌
గరుడండు గగనగతి నురు | తరజవమున నరుగుదెంచి తల్లికి మ్రొక్కెన్‌.
40
వ. ఇట్లు నిజజననికి మ్రొక్కి కద్రువపాలికిం బోయి. 41
చ. తడయక మ్రొక్కియున్న వినతాసుతు నప్పుడు సూచి, యాత్మలో
నిడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ వానిఁ బిల్చి ‘నా
కొడుకుల నెల్ల నెత్తికొని క్రుమ్మరుచుండుమ, యేమి పంచినన్‌
మడవక చేయు మీ’ వని సమర్పణ సేసెఁ బ్రభుత్వ మేర్పడన్‌.
42
వ. గరుడండును గద్రువ పంచిన పనులెల్లను వినత యనుమతంబున నతివినయపరుం డై చేయుచు. 43
క. ఆ పన్నగముఖ్యులఁ దన | వీఁపునఁ బెట్టికొని పఱచి, విపినములు, మహా
ద్వీపములు, గిరులు, నఖిల ది | శాపాలపురములుఁ జూపెఁ జన వారలకున్‌.
44
వ. ఒక్కనాఁడు సప్తమారుతజవంబున సప్తాశ్వమండలంబుదాఁక నెగసిన, నమ్మార్తాండు చండకిరణంబుల వేఁడిమిఁ దాఁకి, మాఁడి, గరుడని వీఁపున నున్నయురగులు దొరఁగి నేలంబడి మూర్ఛవోయినంజూచి, కద్రువ కడునలిగి, గరుడనిం బదరి, యతిభక్తి నింద్రు నారాధించి. 45
చ. నరసురసిద్ధకింపురుషనాగనభశ్చరముఖ్యు లెల్ల నీ
కరుణయ వేచి మండ్రు, త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ
స్ఫురణన చేసి సుస్థిరతఁ బొందుఁ బురందర! సర్వలోకసుం
దర! శరణంబు నా కగుము దానవసూదన! పాకశాసనా!
46
వ. అని స్తుతియించి పర్జన్యప్రసాదంబున మహావృష్టి గొడుకులపయిం గురియించి, యయ్యురగుల విగత పరితాపులంజేసి కద్రువ గర్వంబున నుఱక గరుడని వినతనుం బనులుగొనుచున్నంత, నొక్కనాఁడు గరుడండు తల్లి కి ట్లనియె. 47
ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁ బాముల మోవను, వారికిం బనుల్‌
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
48
వ. అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన దాసీత్వంబును, తత్కారణం బైన యనూరుశాపంబును గొడుకున కేర్పడం జెప్పి యి ట్లనియె. 49
క. నీ కతమున నా దాస్యము | ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం
జేకొని, యూఱడి నిర్గత | శోకస్థితి నున్నదానఁ జూవె ఖగేంద్రా!
50
వ. ‘కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రులయిడుమలు వాయుట యెందునుంగలయది, గావున నీయట్టిసత్పుత్త్రుం బడసియు దాసి నై యుండుదాననే’ యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుం డై, యొక్కనాఁడు కాద్రవేయుల కి ట్లనియె. 51
క. మా యీ దాస్యము వాయు ను | పాయము సేయుండు, నన్నుఁ బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తు న | జేయుఁడ నై యమరవరులఁ జేకొని యైనన్‌.
52
వ. అనిన నయ్యురగులు కరుణించి గరుడని కి ట్లనిరి. 53
చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయినదాస్యముఁ బాచికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్‌.
54
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )