ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
గరుత్మంతుఁ డమృతంబుఁ దెచ్చుటకుఁ దల్లియనుమతిఁ గొనుట (సం. 1-24-1)
వ. ‘అట్ల చేయుదు; నమృతంబు దెచ్చి మీ కిచ్చి, యేనునుం దల్లియు దాస్యంబువలన విముక్తుల మగువార’ మని నొడివి, తద్వృత్తాంతం బంతయుం దల్లికింజెప్పి ‘యమృత హరణార్థం బరిగెద’ నని మ్రొక్కిన, వినత సంతసిల్లి కొడుకుం గౌఁగిలించుకొని. 55
చ. ‘అనిలుఁడు పక్షయుగ్మ, మమృతాంశుఁడు వీఁపనలుండు మస్తకం,
బినుఁడు సమస్తదేహమును నెప్పుడుఁ గాచుచు నీ కభీష్టముల్‌
ఘనముగఁ జేయుచుండెడు జగన్నుత! యున్నతియున్‌ జయంబుఁ జే
కొను’ మని యిచ్చె దీవనలు గోరి ఖగేంద్రునకుం బ్రియంబునన్‌.
56
వ. గరుడండును దల్లిదీవనలు గైకొని గమనోన్ముఖుం డై ‘యమృతంబు దెచ్చునపుడు లావు గలుగవలయు, నా కాహారంబు ప్రసాదింపు’ మనిన వినత యి ట్లనియె. 57
క. విషనిధికుక్షి నసంఖ్యము | నిషాదగణ ముండి ధారుణీప్రజకుఁ గడున్‌
విషమమును జేయు, దాని ని | మిషమున భక్షించి చను మమిత్రవిఘాతీ!
58
వ. ‘భక్షణవిషయంబున బ్రాహ్మణునిం బరిహరించునది’ యనిన గరుడండు ‘నాకు బ్రాహ్మణు నెఱుంగు తెఱంగెఱింగింపు’ మనిన వినత యి ట్లనియె. 59
క. రయమున మ్రింగుడు గాలము | క్రియ నెవ్వఁడు కంఠబిలముక్రిందికిఁ జన క
గ్నియపోలె నేర్చుచుండును | భయరహితా! వాని నెఱుఁగు బ్రాహ్మణుఁ గాఁగన్‌.
60
తే. కోపితుం డైన విప్రుండు ఘోరశస్త్ర | మగు, మహావిష మగు, నగ్ని యగు; నతండ
యర్చితుం డైన జనులకు నభిమతార్థ | సిద్ధికరుఁ డగు, గురుఁడగుఁ, జేయుఁ బ్రీతి.
61
వ. అని బ్రాహ్మణస్వరూపంబుఁ జెప్పిన నెఱింగి, వినతకు మ్రొక్కి వీడ్కొని, గరుడం డతిత్వరితగతిం బఱచి, సముద్రోదరంబున నున్న నిషాదు లనేక శతసహస్రసంఖ్యలవారిం బాతాళవివరంబునుంబోని తనకంఠబిలంబుఁ దెఱచి యందఱ నొక్కపెట్ట మ్రింగిన, నం దొక్క విప్రుం డుండి కుత్తుకకు డిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి, ‘నాకంఠబిలంబున విప్రుం డున్నవాఁడేని వెలువడి వచ్చునది’ యనిన గరుడని క వ్విప్రుం డి ట్లనియె. 62
ఉ. ‘విప్రుఁడ నున్నవాఁడ, నపవిత్రనిషాది మదీయభార్య, కీ
ర్తిప్రియ! దీనిఁ బెట్టి చనుదెంచుట ధర్మువె నాకు?’ నావుడున్‌
‘విప్రులఁ బొంది యున్న యపవిత్రులుఁ బూజ్యులు గారె; కావునన్‌
విప్రకులుండ! వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్‌.’
63
వ. అనిన నాగరుడని యనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీసహితుం డై వెలువడి వచ్చి, గరుడని దీవించి, యథేచ్ఛం జనియె; గరుడండును గగనపథంబునం బఱచి, కశ్యపుం గని నమస్కరించి, ‘యస్మజ్జననీ దాస్యనిరాసార్థం బురగుల కమృతంబుఁ దేర నరిగెద, నిషాదఖాదనంబున నాఁకలి వోవకున్నయది, నా కాహారంబు ప్రసాదింపు’ మనిన కొడుకుకడంకకు మెచ్చి కశ్యపప్రజాపతి యి ట్లనియె. 64
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )