ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
గజకచ్ఛపముల వృత్తాంతము (సం. 1-25-10)
క. అనలనిభుండు విభావసుఁ | డను విప్రుఁడు నియమవంతుఁ డర్థాఢ్యుం డై
తనరి సుఖ మున్న, నాతని | యనుజన్ముఁడు సుప్రతీకుఁ డనువాఁ డతనిన్‌.
65
క. ‘మనపితృవర్గము వడసిన | ధనము విభాగించి యిమ్ము ధర్మస్థితి నా’
కని యడుగంబోయిన య | య్యనుజునకు విభావసుం డహంకారమునన్‌.
66
క. తా నలిగి యిచ్చె శాపం | ‘బేనుఁగ వై యుండు’ మని, సహింపక వాఁడున్‌
మానుగఁ ‘గూర్మమ వగు’ మని | వానికిఁ బ్రతిశాప మిచ్చె వసులోభమునన్‌.
67
వ. ‘ఇ ట్లన్నయుం దమ్ముండును నన్యోన్యశాపంబులం జేసి యోజనత్రయోత్సేధంబు గలిగి దశయోజనవృత్తం బైన కూర్మంబును, షడ్యోజనోత్సేధంబు గలిగి ద్వాదశ యోజన విస్తృతం బైన గజంబును నై సరోవర విపినంబుల నుండి యర్థనిమిత్తం బైన పూర్వవైరంబునఁ దమలో నిత్యంబు నొండొంటితోడం బెనంగి పోరుచుండు; నవి నీకాహారంబు సు; మ్మరుగుము, కార్యసిద్ధి యయ్యెడు’ మనిన గరుడండును మనోవేగంబునం బఱచి యారెంటినిం గాంచి. 68
క. చఱచి యొకచేతఁ గూర్మముఁ | బెఱచేత గజంబుఁ బట్టి పెనఁచి ఖగేంద్రుం
డిఱికికొని గగనవీథిం | బఱచె వియచ్చరవిమానపంక్తులు దూలన్‌.
69
క. కనకవ్రతతీవితతులఁ | బెనఁగిన సురభూరుహములఁ బెద్దయు బెడఁగై
తనరిన యలంబతీర్థం | బున కరిగె నగంబు లొక్కమొగి గ్రక్కదలన్‌.
70
వ. అందు రోహిణంబను పాదపోత్తమంబు గరుడనిం గని సంభావించి ‘శతయోజనాయతంబైనమదీయ శాఖపై నుండి యిగ్గజకచ్ఛపంబుల భక్షించి పొ’ మ్మనిన గరుడండు ‘నట్ల చేయుదు’ నని యమ్మహాశాఖపై నూఁద సమకట్టి, యందు. 71
క. పాదంబులు పెట్టుడుఁ ద | త్పాదపఘనశాఖ విఱిఁగి బల్లన నుచ్చై
ర్నాదమున దిక్కు లద్రువఁగ | భేదిల్లె విహంగతతులు భీతిం బఱవన్‌.
72
వ. అమ్మహాశాఖ నవలంబించి తలక్రిం దై యాదిత్యకిరణంబులు తమ కాహారంబుగాఁ దపంబు సేయుచున్న వాలఖిల్యమహామునిగణంబులం జూచి, యిది భూమిపయింబడిన నిమ్మునులకు బాధయగు నని దానిం గఱచికొని, గజకచ్ఛపంబులం గరంబుల నిఱికికొని, గరుడండు గగనంబునం బఱచి, తనకు నూఁద నిమ్మగు ప్రదేశం బెందునుం గానక గంధమాదనంబునకుం జని, యందుఁ దపంబు సేయుచున్న కశ్యపుం గనుంగొని మ్రొక్కిన. 73
చ. కనకమహీధరప్రతిమకాయు, మహాజవనిర్జితప్రభం
జను, నవిచింత్య భూరిబలసత్త్వసమన్వితు, దీప్తహవ్యవా
హనసము, వైనతేయునిఁద దాస్యగతద్రుమశాఖ నున్న య
త్యనఘుల వాలఖిల్యులను, నమ్మునినాథుఁడు చూచి నెమ్మితోన్‌.
74
వ. ‘ఇగ్గరుడండు భువనహితమహారంభుండు బలసమన్వితుండు, మీకు బాధయగునని యిత్తరుశాఖ విడువనేరకున్న వాఁడు; వీనిం గరుణించి మీరొండుకడ కరుగుం’ డనిన వాలఖిల్యులు కశ్యపుప్రార్థనం జేసి దాని విడిచి హిమవంతంబునకుం జనిరి; గరుడండును ముఖనిక్షిప్తశాఖాస్ఖలితవచనుం డగుచుఁ దండ్రి కిట్లనియె. 75
క. ధరణీసురవిరహిత మగు | నరణ్యదేశంబు నాకు నానతియిం డి
త్తరుశాఖ విడువవలయును | కరము నిరోధ మిది యనినఁ గశ్యపుఁ డనియెన్‌.
76
క. హిమశైలకందరాభా | గముకడ నిష్పురుషనగము కల దచ్చో నీ
ద్రుమశాఖ విడువు మది దా | నమానుష మగమ్య మీశ్వరాదుల కైనన్‌.
77
వ. ‘అది యిచ్చటికి లక్షయోజనంబులు గల దరుగు’ మనిన గరుడండును మనోవేగంబునం బఱచి యా నిష్పురుషనగంబునం దత్తరుశాఖ విడిచి హిమవంతంబుమీఁదికిం బోయి గజకచ్ఛపంబుల భక్షించి, మహాసత్త్వసంపన్నుం డై నాకలోకంబున కెగయ సమకట్టి పక్షవిక్షేపంబుఁ జేసిన. 78
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )