ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
గరుడం డమృతహరణార్థం బెగయుట - (సం. 1-26-37)
క. ఘనపక్షానిలచలితా | వనిరుహములవలనఁ దొరఁగు వరపుష్పచయం
బనిమిషజయార్థ మరిగెడు | వినతాసుతుమీఁదఁ బుష్పవృష్టియ పోలెన్‌.
79
వ. ఇట్లమృతహరణార్థంబు గరుడండు గగనంబున కెగసిన, నట దేవలోకంబునందు. 80
మాలిని. సురపతిసభఁ జూడం జూడ నంగారవృష్టుల్‌
గురిసెఁ గులిశధారల్‌ గుంఠితం బయ్యె, దిక్కుం
జరమదము లడంగెన్‌, సర్వదిక్పాలకాంతః
కరణములు భయోద్వేగంబునన్‌ సంచలించెన్‌.
81
వ. ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన, సురపతి బృహస్పతిం జూచి, ‘యిది యేమి నిమిత్తం?’ బని యడిగిన, దాని నంతయు నెఱింగి బృహస్పతి సురపతి కి ట్లనియె. 82
సీ. బ్రహ్మణ్యుఁ డగు కశ్యపబ్రహ్మవరమున | వినతకుఁ బుట్టిన యనఘమూర్తి
వాలఖిల్యులదయ వరపక్షికులమున | క్రిందుఁ డై పరఁగిన యిద్ధతేజుఁ,
డుదధిలో నున్న యత్యుగ్రనిషాదుల | నారంగ మ్రింగిన ఘోరవీరుఁ,
డిభకచ్ఛపముల రోహిణశాఖతో నెత్తి | కొని దివిఁ బఱచిన యనిలవేగి.
 
తే. వీఁగి తనతల్లిదాస్యంబు నీఁగఁబూని | తడయ కమృతంబు గొనిపోవఁ గడఁగి వచ్చెఁ;
గామరూపసంపన్నుండు, గామగమనుఁ | డతఁడు నీకు నసాధ్యుండు శతమఖుండ!
83
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )