ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
వాలఖిల్యుల వృత్తాంతము (సం. 1-27-4)
వ. అగ్గరుడని మాహాత్మ్యంబు నీవు నెఱుంగుదు; వది యెట్లనినఁ దొల్లి కశ్యపప్రజాపతి పుత్త్రార్థి యై భవత్ప్రభృతులైన దేవగణంబులను, వాలఖిల్యప్రముఖు లైన మహామునిగణంబులను దనకు సహాయులనుగాఁ బడసి పుత్త్రకామేష్టి సేయునాఁడు నీవు నీబలంబునకుం దగినయిద్మభారంబు మోచికొని యశ్రమంబున వచ్చువాఁడ వై, యల్పకుశపలాశేధ్మభారంబులు మోచికొని వడవడ వడంకుచు వచ్చువారి, నల్పసత్త్వుల, నంగుష్ఠప్రమాణ దేహుల; ననవరతోపవాస కృశీభూత శరీరుల, వాలఖిల్యమహామునులం జూచి నగిన, నమ్మునులు సిగ్గుపడి కడు నలిగి. 84
క. రణవిజయుఁ డనల తేజుం | డణిమాదిగుణాఢ్యుఁ డుదితుఁ డయ్యెడు వీరా
గ్రణి శతమఖుకంటెను శత | గుణవీర్యుం డైన పుత్త్రకుం డజితుం డై.
85
వ. వాఁడు రెండవయింద్రుం డయ్యెడు మని మహావీర్యవంతంబు లైన మంత్రంబుల వేల్చుచున్నంత, నంతయు నెఱింగి నీవు కశ్యపుపాలికిం బోయి నాకుం గరుణింపుండని వారిం బ్రార్థించినఁ గశ్యపప్రజాపతి యమ్మునుల కి ట్లనియె. 86
ఉ. ఉండు నితండు పద్మజు నియోగమునం ద్రిజగంబులందు నిం
ద్రుం డయి భూతరాశిఁ దన దోర్బలశక్తిఁ గడంగి కాచుచున్‌;
రెండవయింద్రుఁ డైన విపరీత మగున్‌ భువనప్రవృత్తి; మీ
రొండువిధంబు సేయు టిది యుక్తమె బ్రహ్మనియుక్తి యుండఁగన్‌.
87
వ. ‘మీవచనం బమోఘంబు గావున నింక నాకు నుద్భవిల్లెడు పుత్త్రుండు పక్షికులంబున కెల్ల నింద్రుం డయ్యెడు’ మనికశ్యపుండు వారల నొడంబఱిచి నీయింద్రత్వంబేకాధిష్ఠితంబు సేసె; నట్టి కశ్యపప్రజాపతి యజ్ఞమహిమను, వాలఖిల్యులతపోమహిమను వినతకుం బుట్టి విహగేంద్రుం డయిన యా గరుడం డిప్పు డమృతహరణార్థం బరుగుదెంచుటంజేసి స్వర్గలోకంబున మహోత్పాతంబులు పుట్టె’ నని సురపతికి బృహస్పతి చెప్పిన విని, యింద్రుం డమృతరక్షకుల నెల్ల రావించి, ‘మీర లతిప్రయత్నంబున నమృతంబు రక్షించుకొని యుండుం’ డని పంచిన ‘వల్లె’ యని. 88
క. వారలు బహుప్రకారా | కారులు, వీరులు, నిశాతఖడ్గాదిమహా
దారుణ శస్త్రధరులు, కృ | ష్ణారుణ సితపీతఘనతరాంగత్రాణుల్‌.
89
క. సమకట్టి యొక్కమొగి న | ప్రమాదు లై నిలిచి రేయుఁబవలును రక్షా
క్షము లై యమృతము చుట్టును | నమేయబలు లుండి రంత నతిరభసమునన్‌.
90
మ. వితతోల్కాశనిపుంజమొక్కొ యనఁగా విన్వీథివిక్షిప్తప
క్షతివాతాహతిఁ దూలి తూలశకలాకారంబు లై వారిద
ప్రతతుల్‌ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాఱెన్‌ మనోవేగుఁ డై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్‌ భయం బందఁగన్‌.
91
వ. అంత. 92
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )