ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
గరుడఁ డమృతరక్షకులతో యుద్ధము సేయుట (సం. 1-28-1)
క. కల్పాంతానలకీలా | కల్పాయతపక్షుఁ, బక్షిగణవిభు, శౌర్యా
కల్పుఁ గని, యమృతరక్షు ల | నల్పక్రోధు లయి తాఁకి రార్చి కడంకన్‌.
93
క. తడఁబడ నేసియు వైచియుఁ | బొడిచియు వివిధాస్త్రశస్త్రముల నుద్ధతు లై
కడుకొని యుద్ధము సేసిరి | కడిమిమెయిన్‌ విబుధవరులు గరుఁడనితోడన్‌.
94
వ. గరుడండును నిజపక్ష విక్షిప్తరజోవృష్టి నమరవరుల దృష్టిపథంబుఁ గప్పి స్వర్గలోకంబు నిరాలోకంబుగాఁ జేసిన, నమరేంద్రుపనుపునం బవనుం డా రజోవృష్టి చెదర వీచె నంత. 95
మాలిని. పరశు కులిశ కుంత ప్రాస బాణాసనోద్య
త్పరిఘ కణప చక్ర ప్రస్ఫుర ద్బాహు సేనా
పరివృతుఁ డయి తాఁకెన్‌ భౌమనుం డన్మహాకిం
కరుఁడు సమరకేళీగర్వితున్‌ వైనతేయున్‌.
96
క. బలవత్‌ఖగేంద్రకోపా | నలభస్మీభూతుఁ డై క్షణంబున వాఁడున్‌
బలమఱి క్రాఁగె నుదగ్ర | జ్వలన జ్వాలావలీఢశలభమపోలెన్‌.
97
సీ. పక్షతుండాగ్ర నఖక్షతదేహు లై | బోరన నవరక్తధార లొలుక
విహగేంద్రునకు నోడి నిహతు లై సురవరుల్‌ | సురరాజు మఱువు సొచ్చిరి కలంగి;
సాధ్యు లనాయాససాధ్యులై పాఱిరి | పూర్వాభిముఖు లయి గర్వ ముడిఁగి;
వసువులు రుద్రులు వసుహీనవిప్రుల | క్రియ దక్షిణాశ్రితు లయిరి భీతి
 
ఆ. వంది; యపరదిక్కుఁ బొంది రాదిత్యు; లా | శ్వినులు నుత్తరమున కొనరఁ బఱచి;
రనల వరుణ పవన ధనద యమాసురుల్‌ | వీఁక దఱిఁగి కాందిశీకు లయిరి.
98
క. తలరఁగ రేణుక్రథన | ప్రలిహప్రరుజాశ్వకృంతపదనఖులను ర
క్షులఁ గులిశనిశాతనఖా | వలిఁ బక్షీంద్రుండు వ్రచ్చివందఱలాడెన్‌.
99
వ. ఇట్లు నిర్జరవరుల నెల్ల నిర్జించి, యూర్జితుం డై గరుడం డమృతస్థానంబున కరిగి, దానిం బరివేష్టించి ఘోరసమీరప్రేరితం బై దుర్వారశిఖాజిహ్వల నంబరంబు నాస్వాదించుచున్న యనలంబుం గని, తత్‌క్షణంబ సకలనదీజలంబుల నెల్లఁ బుక్కిలించుకొని వచ్చి యయ్యనలంబు నాఱంజల్లి, తీక్ష్‌ణధారం బై దేవనిర్మితం బై పరిభ్రమించుచున్న యంత్రచక్రంబు నారాంతరంబున సంక్షిప్తదేహుం డై చొచ్చి యచ్చక్రంబుక్రింద. 100
ఉ. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుదు
ల్కారుణ దారుణాక్షములు నై, నిజదృష్టి విషాగ్ని నన్యులం
జేరఁగనీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర
క్షారతి నున్న యుగ్రభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్‌.
101
వ. అయ్యురగంబులం దనపక్షరజోవృష్టినంధంబులంజేసి, వాని శిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగనమృతంబు కొని గరుడండు గగనంబున కెగసిన. 102
క. కలహమున నిట్లు సురవీ | రులఁ బల్వుర నోర్చి, యొక్కరుఁడ యమృతముఁ దె
క్కలికొని, యాస్వాదింపక | యలోలుఁ డగు వానిఁ జూచి హరి యి ట్లనియెన్‌.
103
క. నీ విజయోత్సాహమునకు, | లావునకు, జవంబునకు, నలౌల్యమునకు, స
ద్భావమునకు మెచ్చి, వరం | బీ వచ్చితి, వేఁడు మెద్ది యిష్టము నీకున్‌.
104
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )