ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
శ్రీమన్నారాయణుఁడు గరుడునకుఁ బ్రసన్నుఁ డగుట; ఇంద్రుండు గరుడునితో స్నేహించుట (సం. 1-29-12)
వ. అని ప్రసన్నుం డై యానతిచ్చిన యాదిదేవుం డగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి గరుడం డి ట్లనియె. 105
సీ. ‘అమృతాశనంబు చేయకయును దేవ! నా | కజరామరత్వంబు నందుటయును,
అఖిలలోకంబుల కగ్రణి వైన నీ | యగ్రంబునందు ని న్నధికభక్తిఁ
గొలుచుచు నునికియుఁ గోరితిఁ, గరుణతో | దయసేయు ముద్ధతదైత్యభేది!’
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁ | డై యిచ్చి హరి యిట్టు లనియె: ‘నాకు
 
ఆ. ననఘ! వాహనంబ వై మహాధ్వజమ వై | యుండు’ మనినఁ బక్షియును ప్రసాద
మనుచు మ్రొక్కిపఱచె; నంత నాతనిమీఁద | వజ్ర మెత్తి వైచె వాసవుండు.
106
వ. అదియును నంబరంబున నగ్నికణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజుపక్షంబులు దాఁక వచ్చినం జూచి గరుడండు నగి, ‘నీచేయువేదన నన్నుం దాఁక నోపదు; నీవు మహాముని సంభవంబ వగుటను, దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింపంగాదు, గావున మదీ యైకపర్ణశకలచ్ఛేదంబు సేయుము; నాయందు నీశక్తి యింతియ’ యనిన సకలభూతసంఘం బెల్ల నాతనిపర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుం డని పొగడిరి. సురేంద్రుండును నవ్విహగేంద్రుమాహాత్మ్యంబునకు మెచ్చి యచ్చెరు వంది యి ట్లనియె 107
ఆ. నిరుపమానశౌర్య! నీతోడఁ జెలిమి సే | యంగ నా కభీష్ట మైనయదియు;
నిట్టి విక్రమంబు, నిట్టి సామర్థ్యంబుఁ | గలదె! యొరుల కిజ్జగంబునందు.
108
క. అమరుఁడ వజరుఁడ వజితుఁడ | వమేయుఁడవు; నీకు నమృత మది యేల ఖగో
త్తమ! దీని నొరుల కిచ్చిన | నమరులకును వా రసాధ్యు లగుదురు పోరన్‌.
109
క. ‘నీ వొరులకు నీయమృతం | బీ వలవదు; నాకు మగుడ నిచ్చిన నీ కి
ష్టావాప్తి యగు విధం బేఁ | గావించెద’ ననిన హరికి గరుడం డనియెన్‌.
110
వ. ‘ఏను మదీయమాతృదాసీత్వనిరాసార్థం బురగుల కమృతంబుఁ దెచ్చియిత్తు నని కాద్రవేయులతో నొడివి వచ్చినవాఁడ; నీ యమృతంబు గొనిపోయి వారల కిచ్చి మదీయజననీదాస్యంబుఁ బాచికొనిన, నురగు లీ యమృతం బుపయోగింపకుండ ముందఱ నీవు గొనిచను’ మనిన, నగ్గరుడని మహానుభావంబునకు మెచ్చి ‘నీబలపరాక్రమంబులు వినవలతుం జెప్పు’ మనిన నయ్యింద్రునకు గరుడం డి ట్లనియె. 111
క. పరనిందయు, నాత్మగుణో | త్కరపరికీర్తనముఁ జేయఁగా నుచితమె స
త్పురుషుల? కైనను, నీ క | చ్చెరువుగ నా కలతెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్‌.
112
ఉ. స్థావరజంగమప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా
లావునఁ బూని తాల్తు, నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల ర
త్నావళితోన చల్లుదు బృహన్ని జపక్షసమీరణంబునన్‌,
దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులన్‌.
113
వ. అని చెప్పిన గరుడని జవసత్త్వసామర్థ్యంబులకు మెచ్చి సంతసిల్లి ‘నీవు నాతో నెప్పుడు బద్ధసఖ్యుండ వై యుండవలయు’ నని, వెండియు దేవేంద్రుండు గరుడని కి ట్లనియె. 114
క. ‘నా కభిమత మొనరించితి | నీ కిష్టము చెప్పికొను’ మనిన ‘దుర్మదు లై
మా కి ట్లహితముఁ జేసిన | యా కద్రువపుత్త్రు లశన మయ్యెడు నాకున్‌’.
115
క. భవదభిరక్ష్యము లగు నీ | భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్‌
దివిజాధిప! నీ కెఱిఁగిం | పవలసె; నీయాజ్ఞ నాకుఁ బడయఁగ వలసెన్‌.
116
వ. అని గరుడండు దనకు నురగభోజనత్వంబు సురపతిచేతం బడసి, తదనుగమ్యమానుం డై, యురగుల యొద్దకు వచ్చి, మరకతహరితం బైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి, యురగులకుం జూపి యి ట్లనియె. 117
క. అనిమిషనాథ సుగుప్త మ | యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి; నస్మ
జ్జననీదాస్యము వాసెను | దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్‌.
118
వ. ‘మీరలు స్నాతాలంకృతుల రై వచ్చి దీని నుపయోగింపుం’ డని పంచి, తల్లిం దనవీఁ పెక్కించుకొని విహగేంద్రుం డురగుల కదృశ్యుండైయున్న సురేంద్రు వీడ్కొని చనియె; నిట యురగులును నమృతోపయోగకు తూహలంబున నొండొరులం గడవఁ గృతస్నానాలంకృతు లై చనుదెంచుటకు ముందఱ. 119
క. అమరాధిపుఁ డమృతముఁ గొని | యమరావతి కరిగి, తొంటియట్టుల సుస్థా
నమున నవిచలిత రక్షా | క్షముఁ డై రక్షించుకొని సుఖస్థితి నుండెన్‌.
120
వ. అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానం బని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటంజేసి, నాటంగోలె ద్విజిహ్వులు నాఁ బరఁగిరి; యమృతస్థితింజేసి దర్భలు పవిత్రంబు లయ్యె. 121
క. ఈ సౌపర్ణాఖ్యానము | భాసురముగ వినిన పుణ్యపరులకు నధిక
శ్రీ సంపద లగు; దురితని | రాసం బగుఁ; బాయు నురగరక్షోభయముల్‌.
122
వ. ఇట్లురగు లమృతం బుపయోగింపం గానక చనిన, శేషుండు తనతల్లియుం దమ్ములుఁజేసిన యధర్మంబునకు నిర్వేదించి, వారల విడిచి కడునిష్ఠతో గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబు లాదిగాఁ గల పుణ్యస్థానంబులం దనేక సహస్రవర్షంబులు బ్రహ్మ నుద్దేశించి తపంబు సేసిన, బ్రహ్మయుఁ బ్రత్యక్షం బై వరంబు వేడు మనిన శేషుం డి ట్లనియె. 123
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )