ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
బ్రహ్మ యనుజ్ఞవలన శేషుఁడు భూభారంబు దాల్చుట (సం. 1-32-2)
సీ. ‘తల్లియు నాసహోదరులును మూర్ఖు లై | ధర్మువు నుచితంబుఁ దప్పి వినత
కావైనతేయున కపకారములు సేసి, | రెప్పుడు వారు సహింప కెగ్గు
సేయుదు, రేను రోసితి, వారితోడిపొ | త్తొల్లఁ, దపంబు సేయుచు శరీర
భారంబు విడిచెదఁ బరమేష్ఠి!’ యనవుడు | నాతని సమబుద్ధి కజుఁడు మెచ్చి
 
ఆ. నిత్యసత్యధర్మనిరతుండ వఖిలంబు | దాల్పనోపు నట్టి ధైర్యయుతుఁడ,
విది యనన్యవిషయ; మిమ్మహీభారంబు | నీవ తాల్పవలయు నిష్ఠతోడ.
124
చ. వినతకు నాత్మజుం డయిన వీరుఁడు, కశ్యపవాలఖిల్యస
న్మునులవరంబు గన్న ఖగముఖ్యుఁడు, వాసవు నోర్చియున్న స
ద్వినుతబలుండు కావున వివేకమునన్‌ వినతాతనూజుతో
ఘనముగఁ జెల్మి సేయు; మిది కార్యము నీకు భుజంగమేశ్వరా!
125
వ. అని బ్రహ్మ నియోగించిన శేషుం డశేషమహీభారంబు దాల్చి గరుడనితో బద్ధసఖ్యుం డై యుండె; నిట వాసుకియుం దల్లిశాపంబున జనమేజయు చేయు సర్పయాగంబునం దయ్యెడుసర్పకులప్రళయంబునకు వెఱచి, తనబాంధవుల నైరావతాది సహోదరుల రావించి విషణ్ణహృదయుం డై యి ట్లనియె. 126
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )