ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
వాసుకి తల్లిశాపమునకు వగచుట (సం. 1-33-1)
చ. చిరముగ బ్రహ్మకుం దపము సేసి, యనంతుఁ డనంతధారుణీ
భరగురుకార్యయుక్తుఁ డయి, పన్నగముఖ్యులపొత్తు వాసి, చె
చ్చెరఁ దనయంత నుండి, మదిఁ జేర్చి తలంపఁడ యొక్కనాఁడు దు
ర్భరతర దందశూకకుల భావిభయప్రవిఘాతకృత్యముల్‌.
127
వ. ‘మఱి యమృతమథనంబునాఁడు మంథరమహానగంబునకు నేత్రంబ నయిన నాక్లేశంబునకు మెచ్చి యమరులెల్లఁ బితామహుం బ్రార్థించి నాకు నవ్యయత్వంబును, సకలభయవిమోక్షణంబునుగా వరం బిప్పించి; రైనను జననీశాపంబున నురగకులప్రళయం బగుటకు మనోదుఃఖంబు దుస్సహం బై యుండు; దాని నుడిగించు నుపాయంబెద్ది? యేమిసేయువార?’ మని చింతించుచున్న యన్నాగరాజునకు నాగకుమారు లత్యుద్ధతు లై యి ట్లనిరి. 128
సీ. జనమేజయునిచేయు సర్పయాగమునకు | విఘ్న మందఱము గావింత; మతఁడు
ధర్మార్థి గావున ధారుణీసురుల మై | యడుగుద మిదియుఁ జేయకు మనియును;
గొందఱ మతనికిఁ గూర్చు మంత్రులము నై | యీక్రతుక్రియఁ జేసి యిహపరముల
కగుఁ బెక్కుదోషంబు లని హేతువులు సూపి | యుడిగింత; మందఱు నొక్కమొగిన
 
ఆ. భక్ష్యభోజ్యలేహ్య పానీయములమీఁద | సదములోని విప్రజనులమీఁద
వెగడుపడఁగఁ బాఱి వెఱపింత మొజ్జలు | తత్ప్రయోగవిధులు దప్పి పఱవ.
129
వ. అనిన వారలలోఁ గొందఱు బుద్ధిమంతు లయిన భుజంగముఖ్యు లి ట్లనిరి. 130
క. ఇవి మీ కన్నియుఁ జేయఁగ | నవు నని తలఁపకుఁడు; భూసురాహుతి మంత్రో
ద్భవ దారుణదహనశిఖల్‌ | గవిసిన నెద్దియును జేయఁగా నెడ గలదే!
131
వ. అనిన విని నాగరాజానుజుం డైన యేలాపుత్త్రుం డి ట్లనియె. 132
ఆ. శాప మిచ్చునాఁడు జననియుత్సంగంబు | నందు నిద్రవోయి నట్ల యుండి
యమరవరుల కజున కైన యన్యోన్యసం | భాషణంబు లెఱుకపడఁగ వింటి.
133
వ. అప్పలుకులు సవిస్తరంబుగాఁ జెప్పెదవినుండు; ‘శాపానంతరంబ యమరులెల్ల నజున కిట్లని రయ్యా! కద్రువ కడు నిర్దయురాలై యిట్టి యనంతబలవీర్యసంపన్ను లయిన కొడుకులం బడసి, వారి కకారణంబ దారుణం బైన శాపం బిచ్చె; మీరును వారింపక యుపేక్షించితిరి; దీనికిం బ్రతీకారంబు గలదే? ‘యనిన నమరులకుఁ గమలసంభవుం డి ట్లనియె. 134
క. క్రూరాకారుల, జగదప | కారులఁ, బన్నగులఁ దాల్పఁగా నోపని యి
ద్ధారుణికి హితంబుగ దు | ష్టోరగసంహార మిప్పు డొడఁబడ వలసెన్‌.
135
వ. ‘మఱియు సకలలోకహితాచారంబు లై ప్రసిద్ధులైన నాగముఖ్యుల నెల్ల వాసుకి చెలియ లైన జగత్కారువునకు జగత్కారుం డను మహామునికిఁ బుట్టెడువాఁడధికతేజస్వి యాస్తీకుం డను మహాముని జనమేజయసమారబ్ధ సర్పసత్త్రప్రళయంబువలన రక్షించు’ నని పితామహుండు దేవతలకుం జెప్పిన తెఱంగు సెప్పిన, వాసుకి ప్రముఖనాగముఖ్యులెల్ల సంతసిల్లి యేలాపుత్త్రు నెత్తుకొని సాధువాదంబుల నభినందించిరి; వాసుకియు నాఁటంగోలె జరత్కారుమునీంద్రుం డెన్నండు దార పరిగ్రహంబు సేయునో యని తత్సమయ సమాగమం బపేక్షించి యుండు నంత. 136
క. పరమతపోనిధి, యాయా| వరవంశోత్తముఁడు, నియమవంతుఁడు, లోకో
త్తరుఁడు, జరత్కారుఁడు నాఁ | బరఁగిన ముని బ్రహ్మచర్యపరిపాలకుఁ డై.
137
క. ఘోరవ్రతములు సలుపుచు | దారపరిగ్రహము సేయఁ దా నొల్లక, సం
సారపునర్భవభీతి న | పారవ్యామోహపాశబంధచ్యుతుఁ డై.
138
వ. తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులం జేసి ఋషులఋణంబుల నీఁగుచుఁ బరిభ్రమించువాఁడు వనంబులో నొక్కపల్వలంబు గని, యందు మూషికవిలూనం బయి యొక్కమూలంబు తక్కియున్న వీరణతృణస్తంబంబు నవలంబించి తలక్రిం దై యాదిత్యకిరణంబు లాహారంబుగా వ్రేలుచున్న ఋషులం గొందఱం జూచి డాయంబోయి జరత్కారుం డి ట్లనియె. 139
క. ‘కడునుగ్రము దలక్రిందుగఁ | బడి వ్రేలుట; యిదియు నొక తపంబొకొ; నా కే
ర్పడఁ జెప్పుఁ డీ తపం, బేఁ | దొడఁగెద’ ననవుడును నయ్యధోముఖవిప్రుల్‌.
140
క. అనఘ! యిది యేటి తప, మే | మనుపమ దుఃఖితుల మగుట, నాధారము లే
కను సంతానోచ్ఛేదం | బున వ్రేలెద మధమలోకమున తెరువు చనన్‌.
141
వ. మందభాగ్యుల మయిన మావంశంబున జరత్కారుం డను పాపకర్ముండు పుట్టి దారపరిగ్రహంబు సేయను, సంతానంబు వడయను నొల్లకున్నవాఁ; డే మాతని పితృపితామహులము; మాపట్టిన యవురుగంటవేళ్ళెల్లం గాలుండు మూషికవ్యాజంబునం దరతరంబ కొఱికిన నొక్కవేర తక్కియున్నయిది; యదియును జరత్కారుం డనపత్యుం డయినం దెగు; నే మధఃపాతుల మగుదు; మాతం డపత్యంబు వడసెనేని యూర్ధ్వగతుల మగుదుము. 142
తే. నీవు మాచుట్టమవపోలె నెమ్మితోడ | నవహితుండ వై మాపల్కు లాదరించి;
తా జరత్కారుఁ గని చెప్పవయ్య వాని | నెఱుఁగుదేని మాపడియెడు నీయవస్థ.
143
వ. అనిన విని జరత్కారుం డతికారుణ్యచిత్తుం డయి, యపత్యార్థం బవశ్యంబు వివాహంబు గావలయు నని యెంతయుం బ్రొద్దు చింతించి తన పితృవర్గంబున కి ట్లనియె. 144
క. మీరలు నాపితృదేవత | లారాధ్యుల; రేను మీకు నాత్మజుఁడ; జర
త్కారుఁ డనువాఁడ; ముందఱ | దారపరిగ్రహము సేయఁ దగులదు బుద్ధిన్‌.
145
క. మి మ్మిట్లు చూచి, మీకు హి | త మ్మెట్లగు నట్లకా ముదంబున దారా
ర్థమ్ము ప్రవర్తింపఁగఁ జి | త్తమ్మిప్పుడు పుట్టె నాకు ధర్మస్థితి మై.
146
వ. అనిన నమ్మహామునులు జరత్కారుపల్కులకు సంతసిల్లి యి ట్లనిరి. 147
చ. తగియెడు పుత్త్రులం బడసి, ధర్మువు దప్పక, తమ్ము నుత్తముల్‌
పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్‌ గడుఘోరనిష్ఠతోఁ
దగిలి తపంబు సేసియును, దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్‌
నెగడఁగఁ జేసియుం, బడయనేర రపుత్త్రకు లైన దుర్మతుల్‌.
148
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )