ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
జరత్కారుండు వివాహంబు చేసికొనఁబూనుట (సం. 1-42-9)
వ. ‘కావున నీవు కృతదారపరిగ్రహుండ వై సంతానంబు వడసి, మమ్ము నూర్ధ్వలోకగతులం జేయు’ మనిన, జరత్కారుం ‘డట్లేని నాకు సనామ్ని యయినదాని వివాహంబు గావలయు’ నని వారికి నమస్కరించి వీడ్కొని, సనామ కన్యాన్వేషణపరుం డై భూవలయం బెల్లఁ గలయం గ్రుమ్మరి. 149
తరువోజ. అనవరతవ్రతాయాసఖేదమున నతికృశం బగుచున్న యంగంబునందుఁ
దనరి యేర్పడ సిరల్‌, దద్దయు ముదిమిఁ దల వడంకుచునుండఁ, దన పితృవరుల
ఘనముగా నూర్ధ్వాభిగమనులఁ జేయఁగడఁగి వివాహంబుగా జరత్కారుఁ
డనఘుండు దనకోర్కి కనురూప యైనయట్టి కన్యకఁ గానఁ డయ్యె మర్త్యమున.
150
వ. ఇట్లు జరత్కారుండు వివాహాపేక్షం బ్రతీక్షించుచున్న వాసుకియుం దనచారులవలన నంతయు నెఱింగి, నిజసహోదరి యైన జరత్కారుం దోడ్కొని జరత్కారుమహామునిపాలికిం బోయి యి ట్లనియె. 151
శా. ధన్యం బయ్యె భవత్కులం, బతి కృతార్థం బయ్యె నస్మత్కులం,
బన్యోన్యానుగుణాభిధానములఁ జిత్తానంద మొందెన్‌ వివే
కన్యాయాన్విత భూసురోత్తమ! జరత్కారూ! జగన్మాన్య! యి
క్కన్యాభిక్షఁ బరిగ్రహింపుము జరత్కారున్‌ మదీయానుజన్‌.
152
వ. అనిన నొడంబడి, జరత్కారుండు సనామ యగుటంజేసి యక్కన్యకను వివాహం బై, ప్రథమసమాగమంబునం దన ధర్మపత్నికి సమయంబు సేసె; ‘నాకు నీ వెన్నండేని యవమానంబు దలంచితి, నాఁడ నిన్నుం బాసి పోవుదు’ ననిన నాఁటంగోలె. 153
క. వాలుపయి నడచున ట్ల | బ్బాలిక నడునడ నడుంగి భయమున నియమా
భీలుఁ డగు పతికిఁ బవళుల్‌ | రేలును నేమఱక పరిచరించుచు నుండెన్‌.
154
క. అనవరతభక్తిఁ బాయక | తనపతికిం బ్రియము సేసి, తద్దయు గర్భం
బనురక్తిఁ దాల్చి యొప్పెను | దినకరగర్భ యగు పూర్వదిక్సతివోలెన్‌.
155
వ. అక్కోమలి యొక్కనాఁడు దనకుఱువు దలయంపిగాఁ గృష్ణాజినాస్తరణంబున నిజనాథుండు నిద్రితుండై యున్న యవసరంబున నాదిత్యుం డస్తగిరిశిఖరాసన్నుం డగుటయు, సంధ్యాసమయోచితక్రియలు నిర్వర్తింపఁ దదాశ్రమవాసు లైన మునులు గడంగుటం జూచి యాత్మగతంబున. 156
సీ. ‘సంధ్యలం దొనరించు సద్విధుల్‌ గడచిన | ధర్మలోపం బగుఁ దడయ కేల
బోధింప వై తని భూసురప్రవరుండు | పదరునో, బోధింపఁబడి యవజ్ఞ
దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప | నని యల్గునో, దీని కల్గెనేని
యలుకయ పడుదుఁ గా, కగునె ధర్మక్రియా | లోపంబు, హృదయంబులో సహింప’
 
ఆ. నని వినిశ్చితాత్మ యై నిజపతిఁ బ్రబో | ధించె; మునియు నిద్ర దేఱి యలిగి
‘యేల నిద్రఁ జెఱిచి తీవు’ నావుడు జర | త్కారు విట్టు లనియెఁ గరము వెఱచి.
157
క. ‘ఇనుఁ డస్తమింపఁ బోయిన | ననఘా! బోధింపవలసె’ ననవుడు, ‘నామే
ల్కను నంతకు నుండక యినుఁ | డొనరఁగ నస్తాద్రి కేఁగ నోడఁడె చెపుమా!’
158
వ. ‘నీవు నా కవమానంబు దలంచితివి; నీయొద్దనుండ నొల్లఁ; దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద; నీగర్భంబున నున్నవాఁడు సూర్యానలసమప్రభుం డైన పుత్త్రుం; డుభయకులదుఃఖోద్ధరణ సమర్థుండు సుమ్ము; నీవు వగవక నీయగ్రజునొద్ద నుండు’ మని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబునకుం జనియె; నిట జరత్కారువును తనయగ్రజుం డైన వాసుకి యొద్దకు వచ్చి తద్వృత్తాంతంబంతయు నెఱింగించి యుండునంత. 159
క. ఆపూర్ణతేజుఁ డపగత | పాపుఁ డపాకృతభవానుబంధుఁడు, నిజమా
తాపితృపక్షప్రబల భ | యాపహుఁ డాస్తీకుఁ డుదితుఁ డై పెరిఁగెఁ బ్రభన్‌.
160
తే. చ్యవనసుతుఁ డైన ప్రమతితోఁ జదివె సకల | వేదవేదాంగములు, నిజవిమలబుద్ధి
నెఱిఁగె సకలశాస్త్రంబుల, నెల్లయందు | నధికసాత్త్వికుఁ డాస్తీకుఁ డనఁగ జనులు.
161
వ. అటజనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకు పంచత్వం బుదంకువలన నెఱింగి, మంత్రులం జూచి, ‘యిది యేమినిమిత్తంబు? దీని సవిస్తరంబుగాఁ జెప్పుం’ డనిన మంత్రు లి ట్లనిరి. 162
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )