ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
జనమేజయునకుఁ బరీక్షితు శాపకారణంబు మంత్రులు చెప్పుట (సం. 1-36-8)
సీ. అభిమన్యునకు విరాటాత్మజ యైన యు | త్తరకును బుట్టిన ధర్మమూర్తి,
కౌరవాన్వయపరిక్షయమున నుదయించి | ప్రథఁ బరీక్షితుఁడు నాఁ బరఁగువాఁడు,
ధర్మార్థకామముల్‌ దప్పక సలుపుచుఁ | బూని భూప్రజ నెల్లఁ బుణ్యచరిత
ననఘుఁ డై రక్షించి యఱువదియేఁడులు | రాజ్యంబు సేసిన రాజవృషభుఁ,
 
ఆ. డధికధర్మమార్గుఁ డైన నీయట్టి స | త్పుత్త్రుఁ బడసియున్న పుణ్యుఁ, డన్య
నాథ మకుటమణిగణప్రభారంజిత | పాదపంకజుండు భరతనిభుఁడు.
163
వ. భవత్పితృప్రపితామహుం డైన పాండురాజునుంబోలె మృగయాసక్తుం డై యొక్కనాఁడు మహాగహనంబులఁ బెక్కుమృగంబుల నెగచి చంపి, తనచేత నేటువడి పాఱినమృగంబు వెంటఁ దగిలి మహాధనుర్ధరుం డై యజ్ఞమృగంబు పిఱుందం బఱచు రుద్రుండునుం బోలె. 164
పృథ్వీవృత్తము. అమిత్త్రమదభేది యొక్కరుఁడ యమ్మృగాన్వేషణ
భ్రమాకులితచిత్తుఁ డై తగిలి పాఱుచున్‌ ముందటన్‌
శమీకుఁ డనువాని నొక్కమునిసత్తమున్‌ సంతత
క్షమాదమసమన్వితుం గనియెఁ గాననాంతంబునన్‌.
165
వ. కని ‘మునీంద్రా! నాచేత నేటువడి మృగం బమ్ముతోన యిటవచ్చె, నది యెక్కడంబాఱె? నీ వెఱుంగుదేని చెప్పుమనిన, నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి, తత్సమీపంబున నపగతప్రాణం బై పడియున్నపాముం దనవింటికొప్పున నెత్తి, యమ్మునియఱుతం దగుల వైచి, క్రమ్మఱి హస్తిపురంబునకు వచ్చియున్నంత. 166
ఆ. ఆశమీకుపుత్త్రుఁ డంబుజసంభవు | గుఱిచి భక్తితోడ ఘోరతపము
సేయుచున్న సుప్రసిద్ధుండు శృంగి య | న్వాఁడు భృంగిసముఁడ వంధ్యకోపి.
167
క. తనజనకు నఱుతఁ బవనా | శనశవముఁ దగిల్చి రాజసమునఁ బరీక్షి
జ్జనపాలు చనుట, కృశుఁ డను | మునివలన నెఱింగి కోపమూర్ఛాన్వితుఁ డై.
168
వ. శాపజలంబు లెత్తికొని ‘విజనం బైన విపినాంతరంబున విజితేంద్రియుం డై, మొదవుల చన్నులు వత్సంబులు గుడుచునప్పు డుద్గతం బగు పయఃఫేనంబ తనకాహారంబుగా మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న మహావృద్ధు మదీయజనకు నవమానించిన పరీక్షితుండు నేఁడు మొదలుగా సప్తదివసంబులలోనఁ దక్షక విషాగ్నిదగ్ధుం డై యమసదనంబున కరిగెడు’ మని శాపం బిచ్చి తండ్రిపాలికిం జని. 169
క. ఉరగకళేబర మంసాం | తరమునఁ బడి వ్రేలు చునికిఁ దలఁపక యచల
స్థిరుఁ డై పరమధ్యానా | వరతేంద్రియవృత్తి నున్నవాని శమీకున్‌.
170
వ. కని యయ్యురగకళేబరంబుఁ బాఱవైచి, తత్‌క్షణంబ ప్రబుద్ధనయనుం డైనతండ్రి కభివాదనంబు సేసి, బాష్పపూరితనయనుం డై శృంగి పరీక్షితు నుద్దేశించి తన చేసిన శాపస్థితి సెప్పిన విని, శమీకుండు గరంబడలి యి ట్లనియె. 171
క. క్రోధమ తపముం జెఱుచును; | గ్రోధమ యణిమాదు లైన గుణములఁ బాపుం:
గ్రోధమ ధర్మక్రియలకు | బాధ యగుం; గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే?
172
క. క్షమ లేని తపసితపమును, | బ్రమత్తుసంపదయు, ధర్మబాహ్యప్రభురా
జ్యము భిన్నకుంభమున తో | యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్‌.
173
వ. క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధం బైనక్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుం డైన పరీక్షిత్తునకుం బరీక్షింపక శాపం బిచ్చి చెట్ట సేసితివి; రాజరక్షితు లై కాదె మహామును లతిఘోరతపంబు సేయుచు, వేదవిహిత ధర్మంబులు నడుపుచు మహాశక్తిమంతు లయి యున్నవా; రట్టిరాజుల కపకారంబు దలంచు నంత కంటె మిక్కిలిపాతకం బొం డెద్ది? మఱియు భరతకుల పవిత్రుం డైన పరీక్షితు రాజసామాన్యుంగా వగచితే? 174
ఉ. క్షత్త్రియవంశ్యు లై ధరణిఁ గావఁగ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్త్రియవైశ్యశూద్రు లనఁగాఁ గల నాలుగుజాతులన్‌ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామమాం
ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యే యుగంబులన్‌!
175
వ. ‘అతండు మృగయావ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుం డయి యెఱుంగక నా కవజ్ఞఁ జేసె; నేనును దాని సహించితి; నమ్మహాత్మునకు నీయిచ్చిన శాపంబుఁ గ్రమ్మరింపనేర్తేని లగ్గగు’ ననిన శృంగి యి ట్లనియె. 176
క. అలుకమెయి మున్న పలికితి | నలుకని నా పలుకు తీక్ష్‌ణ మై యింతకు ను
జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ | దలరఁగఁ బ్రేరేప కేల తానెడ నుడుగున్‌.
177
వ. ‘నావచనం బమోఘం’ బనిన, శమీకుండు శోకాకులితచిత్తుండై, తన శిష్యున్‌ గౌరముఖుం డనువానిం బిలిచి, ‘దీని నంతయుఁ బరీక్షితునకెఱింగించి తక్షకువలనిభయంబు దలంగునట్టి యుపాయంబు సేసికొమ్మని చెప్పి ర’ మ్మనిన; వాఁడు నప్పుడ పరీక్షితుపాలికిం జని యి ట్లనియె. 178
సీ. అడవిలో నేకాంతమతి ఘోరతపమున | నున్న మా గురులపై నురగశవము
వైచుట విని యల్గి, వారి తనూజుండు | శృంగి యన్వాఁడు కార్చిచ్చునట్టి
శాపంబు నీ కిచ్చె, సప్తాహములలోన | నా పరీక్షితుఁడు నాయలుకఁ జేసి
తక్షకవిషమున దగ్ధుఁ డయ్యెడు మని, | దానికి గురులు సంతాప మంది
 
ఆ. భూతలేశ! నన్నుఁ బుత్తెంచి రిప్పుడు, | తద్భయంబులెల్లఁ దలఁగునట్టి
మంత్రతంత్రవిధు లమర్చి యేమఱకుండు | నది నిరంతరంబు ననియుఁ గఱప.
179
వ. అని చెప్పి గౌరముఖుం డరిగినం, బరీక్షితుండు పరిక్షీణహృదయుం డై తనచేసిన వ్యతిక్రమంబునకు సంతాపించి, శమీకు నుపశమనంబునకు మెచ్చి శృంగి శాపంబునకు వెఱచి మంత్రివర్గంబుతో విచారించి యాత్మరక్షయం దప్రమాదుం డై. 180
మ. సకలోర్వీశుఁ డతిప్రయత్నపరుఁ డై, సర్వక్రియాదక్ష త
క్షకకోటుల్‌ పనిసేయఁగా, ఘనతరైకస్తంభహర్మ్యంబుఁ ద
క్షకభీతిన్‌ రచియింపఁ బంచి, దృఢరక్షన్‌ దానిలో నుండెఁ బా
యక రాత్రిందివజాగరూకహితభృత్యామాత్యవర్గంబుతోన్‌.
181
వ. మఱియు విషాపహరంబులయి వీర్యవంతంబు లయిన మంత్రతంత్రంబులు గలిగి యాజ్ఞాసిద్ధులైన విషవైద్యుల నొద్దఁ బెట్టికొని పరీక్షితుం డుండునంత, నట తక్షకుండు విప్రవచన ప్రచోదితుం డయి పరీక్షితునొద్దకు నెవ్విధంబునఁ బోవనగునో యని చింతించుచుండె; నటఁ దొల్లి. 182
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )