ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
కశ్యపునకుఁ దక్షకుఁడు గోరిన ధనం బిచ్చి మరల్చుట (సం. 1-38-31)
మధ్యాక్కర. ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమవిషవహ్ని
నురగంబు లేర్చుచు నునికి కలిగి, పయోరుహగర్భుఁ
డురగవిషాపేతజీవ సంజీవనోపదేశంబు
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబు పొంటె.
183
వ. అట్టి కశ్యపుం డను బ్రహ్మర్షి ‘శృంగిశాపంబునఁ బరీక్షితుండు తక్షకదష్టుం డగు నేఁడు సప్తమదివసం బటె! యేను వాని నపేతజీవు సంజీవితుం జేసి నావిద్యాబలంబు మెఱయుదు; మఱి యదియునుంగాక.’ 184
తే. ధరణియెల్లను రక్షించు ధర్మచరితు | నా పరీక్షితు రక్షించి, యతనిచేత
నపరిమితధనప్రాప్తుండ నగుదుఁ; గీర్తి | యును ధనంబు ధర్మముఁ గొను టుఱదె నాకు.
185
వ. అని విచారించి హస్తిపురంబునకుం బోవువానిఁ దక్షకుండు వృద్ధవిప్రుం డయి వనంబులో నెదురంగని ‘మునీంద్రా! యెట వోయె, దేమి కార్యంబున’ కనిన వానికిం గశ్యపుం డి ట్లనియె. 186
క. తక్షకుఁ డను పన్నగుఁడు ప | రీక్షితుఁ గఱచునటె నేఁ; డరిందము నతనిన్‌
రక్షింపఁగఁ బోయెద శుభ | దక్షిణు నా మంత్ర తంత్ర దాక్షిణ్యమునన్‌.
187
క. అనిన విని నగుచు వాఁ డి | ట్లనియెను ‘దక్షకుఁడ నేన, యశనినిపాతం
బున బ్రదుకఁగ నగు నేనియు | ననఘా! మద్విషనిహతుల కగునే బ్రదుకన్‌.
188
వ. ‘నీమందులు మంత్రంబులు నాయందుం బనిసేయవు క్రమ్మఱి పొమ్ము; కాదేని నీవ చూడ నివ్వట వృక్షంబుఁ గఱచి నావిషానలంబున భస్మంబు సేసెద; నోపుదేని దీనిని సంజీవితంబుఁజేయు’ మని తక్షకుం డా వృక్షంబుఁ గఱచిన. 189
ఆ. అయ్యహీంద్ర విష మహానల దగ్ధ మై | విపుల పత్త్ర దీర్ఘ విటపతతుల
గగనమండలంబుఁ గప్పిన యవ్వట | తరువు భస్మ మయ్యెఁ దత్‌క్షణంబ.
190
వ. కశ్యపుండును నప్పుడ యాభస్మ చయంబు గూడఁ ద్రోచి, తన మంత్రతంత్రశక్తింజేసి యెప్పటియట్ల వృక్షంబుగాఁ జేసినం జూచి, తక్షకుం డతివిస్మయం బంది ‘మునీంద్రా! నీవిద్యాబలంబున నిది సంజీవితం బయ్యె నేనియు నతికుపిత విప్రశాప వ్యపగతాయుష్యుం డైన పరీక్షితుండు సంజీవితుండు గానోపండు; వాని యిచ్చు ధనంబు కంటె నాయం దధికధనంబు గొనిపొ’ మ్మనినఁ గశ్యపుండును దన దివ్యజ్ఞానంబున నట్లకా నెఱింగి, తక్షకుచేత ననంతం బైన యర్థంబు గొని క్రమ్మఱి చనియె; విజనం బైన విపినాంతరంబున నైన యయ్యిరువుర వృత్తాంతంబు మీ రె ట్లెఱింగితి రంటేని వినుము. 191
తే. ఇప్పురంబున బ్రాహ్మణుం డింధనార్థ | మేఁగి, మున్న యావృక్షంబు నెక్కి, దాని
తోన దగ్ధుఁ డై, మఱి దానితోన లబ్ధ | జీవుఁడై వచ్చి జనులకుఁ జెప్పె దీని.
192
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )