ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
తక్షకవిషాగ్నిచేఁ బరీక్షితుండు హర్మ్యంబుతోడ దగ్ధుం డగుట (సం. 1-39-19)
వ. అట్లు కశ్యపుం గ్రమ్మఱించి తక్షకుండు తత్‌క్షణంబ నాగకుమారులం బిలిచి ‘మీరలు విప్రుల రయి సురభి కుసుమ స్వాదు వన్యఫలంబులు పలాశపర్ణపుటికలం బెట్టికొని పరీక్షితు పాలికిం జని యిం’ డని పంచి, తానును వారితోడన యదృశ్యరూపుం డయి వచ్చిన. 193
చ. ద్విజవరులం గుమారుల నతిప్రియదర్శను లైనవారి ఋ
గ్యజుషపదక్రమంబులు క్రియన్‌ గుణియించుచు వచ్చువారి న
గ్గజపురవల్లభుండు గని, గ్రక్కున డాయఁగఁ బిల్చి మెచ్చి, భా
వజసుభగుండు చేకొనియె వారలు దెచ్చినవాని నన్నిటిన్‌.
194
క. వారల నర్హప్రియ స | త్కారులఁ గావించి పుచ్చి, కాలనియోగ
ప్రేరితుఁ డై, యమరేంద్రా | కారుఁడు తద్వన్యఫలజిఘత్సాపేక్షన్‌.
195
ఉ. సూరెల నున్న మంత్రులను జుట్టములం గడుఁ గూర్చుమిత్త్రులన్‌
సారబలుండు చూచి ‘మునిశాపదినంబులు వోవుదెంచె, నం
భోరుహమిత్త్రుఁ డస్తగిరిఁ బొందెడు’ నం చొగిఁ దత్ఫలావలుల్‌
వారల కెల్లఁ బెట్టి, యనవద్యుఁడు దా నొకపండు చెచ్చెరన్‌.
196
క. కొని వ్రచ్చుడు, లోపల న | ల్లనిక్రిమి యై తోఁచి, చూడ లత్తుక వర్ణం
బునఁ బామై, విషవహ్నులు | దనుకఁగఁ గురువీరుఁ గఱచి తక్షకుఁ డరిగెన్‌.
197
వ. తత్పరిజనంబు లందఱు నశనిపాతంబున బెదరి చెదరినట్లు గనుకనిం బఱచి; రయ్యేకస్తంభహర్మ్యంబును దక్షకవిషాగ్ని దగ్ధంబయ్యె; నట్లు భవజ్జనకుండు పరలోకగతుండైనం, బురోహిత పురస్సరానేకభూసురవరులు యథావిధిం బరలోకక్రియలు నిర్వర్తించి రంత. 198
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )