ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
జనమేజయ మహారాజు సర్పయాగము సేయుట (సం. 1-46-6; సం. 1-46-23)
క. ఆయుష్మంతుఁడ వై, ల | క్ష్మీయుత! బాల్యంబునంద మీయన్వయరా
జ్యాయత్తమహీభారం | బాయతభుజ! నీవు దాల్చి తభిషిక్తుఁడ వై.
199
ఉ. పెంచితి ధర్మమార్గమునఁ బ్రీతి యొనర్చుచు ధారుణీప్రజన్‌;
మంచి తనేకయాగముల మానుగ దక్షిణ లిచ్చి విప్రులన్‌;
నించితి సజ్జనస్తుతుల నిర్మల మైన యశంబు దిక్కులన్‌;
సంచితపుణ్య! సర్వగుణసంపద నెవ్వరు నీసమానులే!
200
ఉ. కాదన కిట్టిపాటియపకారముఁ దక్షకుఁ డేకవిప్ర సం
బోధనఁ జేసి చేసె; నృపపుంగవ! నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదరసంహతిన్‌ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్‌.
201
వ. అనిన విని జనమేజయుండు కోపోద్దీపితచిత్తుం డై సర్పయాగము సేయ సమకట్టి, పురోహితులను ఋత్విజులను బిలువంబంచి వారల కి ట్లనియె. 202
చ. తనవిషవహ్ని మజ్జనకుఁ దక్షకుఁ డెట్లు దహించె నట్ల యే
నును సహమిత్రబాంధవజనుం డగు తక్షకు నుగ్రహవ్యవా
హనశిఖలన్‌ దహించి, దివిజాధిపలోకనివాసుఁ డైన మ
జ్జనకున కీయుదంకునకు సాధుమతంబుగఁ బ్రీతిఁ జేసెదన్‌.
203
వ. ‘సర్పయాగం బిట్టి దని శాస్త్రవిధానంబు గలదేని చెప్పుం’ డనిన ఋత్విజు లి ట్లనిరి. 204
మత్తకోకిల. ‘నీతదర్థమ కాఁగ దేవవినిర్మితం బిది, యన్యు లు
ర్వీతలేశ్వర! దీనిఁ జేయరు; వింటి మేము పురాణ వి
ఖ్యాత మాద్యము’ నావుడున్‌, విని కౌరవప్రవరుండు సం
జాత నిశ్చయుఁ డయ్యె నప్పుడు సర్పయాగము సేయఁగన్‌.
205
వ. ఇట్లు కృతనిశ్చయుం డై జనమేజయుండు కాశిరాజపుత్త్రి యయిన వపుష్టమ యను మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగదీక్షితుం డయి, శాస్త్రోపదిష్ట ప్రమాణ లక్షణ నిపుణ శిల్పాచార్య వినిర్మితంబును, యజ్ఞోపకరణానేక ద్రవ్యసంభారసంభృతంబును, బ్రభూతధనధాన్యసంపూర్ణంబును, స్వస్వనియుక్తక్రియారంభసంభ్రమ పరిభ్రమద్బ్రాహ్మణ నివహంబును నయిన యజ్ఞాయతనంబున నున్న యా రాజునకు నొక్క వాస్తువిద్యా నిపుణుం డైన పౌరాణికుం డి ట్లనియె. 206
క. అనఘా! యీయజ్ఞము విధి | సనాథఋత్విక్‌ప్రయోగసంపూర్ణం బ
య్యును గడచన నేరదు; నడు | మన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్‌.
207
వ. అనినవానివచనం బవకర్ణించి, రాజనియుక్తు లయి చ్యవనకుల విఖ్యాతుండైన చండభార్గవుండు హోతగాఁ, బింగళుం డధ్వర్యుండుగా, శార్ఙ్గరవుండు బ్రహ్మగాఁ, గౌత్సుం డుద్గాతగా, వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతు శుక శ్వేతకేతు మౌద్గ ల్యోద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్యక్రామఠకకోహ లాసిత దేవల నారద పర్వత మైత్రే యాత్రేయ కుండజఠర కాలఘట వాత్స్యశ్రుతశ్రవో దేవశర్మ శర్మద రోమ శోదంక హరిత రురు పులోమ సోమశ్రవసు లాదిగాఁ గల మహామునులు సదస్యులుగా నీలాంబరపరిధానులును, ధూమసంరక్తనయనులు నై యాజ్ఞికు లగ్నిముఖంబు సేసి వేల్వం దొడంగిన. 208
క. ధరణిసురమంత్రహోమ | స్ఫురణను వివశు లయి భూరిభుజగప్రభు లొం
డొరుఁ బిలుచుచు నధికభయా | తురు లై కుండాగ్నులందుఁ దొరఁగిరి పెలుచన్‌.
209
వ. మఱియుఁ గోటిశ మానసపూర్ణ శలపాల హలీమక పిచ్ఛిల గౌణప చక్ర కాలవేగ ప్రకాలన హిరణ్యబాహు శరణ కక్షక కాలదంతకాదు లయిన వాసుకి కుల సంభవులును, బుచ్ఛాండక మండలక పిండసేక్తృ, రణేభకోచ్ఛిఖ శరభ భంగ బిల్వ తేజోవిరోహణ శిలి శలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ మహాహన్వాదు లయిన తక్షక కుల సంభవులును, బారావత పారిజాత యాత్ర పాండర హరిణ కృశ విహంగ శరభ మోద ప్రమోద సంహతాపనాదు లయిన యైరావతకులసంభవులును, నేరక కుండల వేణి వేణీస్కంధ కుమారక బాహుక శృంగబేర ధూర్తక ప్రాతరాతకాదు లయిన కౌరవ్యకులసంభవులును, శంకుకర్ణ పిఠరక కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖప్రహాస శకుని దర్యమాహఠ కామఠక సుషేణ మానసావ్యయ భైరవ ముండ వేదాంగ పిశంగ చోద్రపారక వృషభ వేగవ త్పిండారక మహాహను రక్తాంగ సర్వసారంగ సమృద్ధ పఠవాసక వరాహకవీరణకసుచిత్ర చిత్రవేగిక పరాశర తరుణకమణిస్కంధారుణ్యాదు లయిన ధృతరాష్ట్రకుల సంభవులును నయి యొక్కొక్కమొగి సహస్రాయుతసంఖ్యలు గలిగి. 210
మ. అతివేగాకులచిత్తు లై పడి, రుదాత్తాశీవిషాగ్నుల్‌, సితా
సితపీతారుణ వర్ణదేహులు, నవాసృగ్రక్తనేత్రుల్‌, మహో
న్నతు లేక త్రిక పంచ సప్త నవ నానామస్తకుల్‌, పల్వు రు
ద్ధతనాగేంద్రులు బ్రహ్మదండహతి నార్తధ్వాను లై వహ్నిలోన్‌.
211
క. తడఁబడఁ బడియెడు రవమును, | బడి కాలెడు రవముఁ, గాలి పలుదెఱఁగుల వ్ర,
స్సెడు రవమును, దిగ్వలయముఁ | గడుకొని మ్రోయించె నురగకాయోత్థిత మై.
212
వ. అంత. 213
క. తక్షకుఁ డతిభీతుం డై | యా క్షణమున నరిగె ‘సురగణాధిప! నన్నున్‌
రక్షింపుమ రక్షింపుమ | రక్షింపుమ’ యనుచు నప్పురందరు కడకున్‌.
214
వ. పురందరుండును దొల్లి కమలజువాక్యంబున వాసుకిప్రముఖ సర్పకులముఖ్యులకు సర్పసత్త్రభయంబు లేమి యెఱింగినవాఁడు గావున వాని నోడకుండు మని చేకొనియుండె; నిట వాసుకియు జనమేజయ సమారబ్ధ సర్పసత్త్ర పరిత్రస్తుం డై ద్వియోజన త్రియోజనాయామ స్థూలవ్యాళనివహంబులు నిజవంశ భ్రాతృవంశ జనితంబు లయినవి జననీ వాగ్దండపీడితంబు లయి యగ్నికుండంబునఁ బడుటకు శోకించి తన చెలియలి జరత్కారువుం జూచి యి ట్లనియె. 215
క. ప్రస్తుత ఫణి సత్త్ర భయ | త్రస్తాత్ముల మైన యస్మదాదుల కెల్లన్‌
స్వస్తి యొనర్పఁగ నవసర | మాస్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా!
216
క. విమలతపోవిభవంబునఁ | గమలజు నట్టిండ విగతకల్మషుఁ డాస్తీ
కమహాముని; యీతనివచ | నమున మహాహికులరక్షణం బగుఁ బేర్మిన్‌.
217
వ. ‘బ్రహ్మవచనంబు నిట్టిద కా విని యేలాపుత్త్రుండు మాకుఁ జెప్పె; జరత్కారుమహామునికి నిన్ను వివాహంబు సేయుటయు నేతదర్థంబ; యింకొక్కనిమేషంబేని యుపేక్షించిన సకలసర్పప్రళయం బగుం గావున నాస్తీకుండు జనమేజయ మహీపాలు పాలికిం బోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయు’ ననిన, నయ్యగ్రజువచనంబులు విని జరత్కారువు గొడుకు మొగంబు చూచి ‘భవన్మాతుల నియోగంబు సేయు’ మనిన నాస్తీకుం డి ట్లనియె. 218
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )