ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
ఆస్తీకుఁడు సర్పయాగము నివారించుట (సం. 1-49-17)
క. కడవఁబడి మున్ను వహ్నిం | గడుకొని పడినవియ కాని కద్రూసుతులం
బడనీ నింక; నవశ్యము | నుడిగింతును సర్పయాగ; మోడకుఁ డింకన్‌.
219
వ. అని యాస్తీకుండు వాసుకి ప్రముఖుల నాశ్వాసించి, సకలవేదవేదాంగపారగు లయిన విప్రవరులతో జనమేజయ సర్పసత్త్ర సదనంబునకుం జనుదెంచి, స్వదేహకాంతి సభాంతరంబెల్ల వెలుంగుచుండ స్వస్తివచనపూర్వకంబుగా ని ట్లని స్తుతియించె. 220
మ. రజనీనాథకు లైన భూషణుఁడ వై, రాజర్షి వై, ధారుణీ
ప్రజ నెల్లన్‌ దయతోడ ధర్మచరితం బాలించుచుం, దొంటి ధ
ర్మజు నాభాగు భగీరథున్‌ దశరథున్‌ మాంధాతృ రామున్‌ రఘున్‌
విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షితా!
221
తరలము. కువలయంబున వారి కోరిన కోర్కికిం దగ నీవు పాం
డవకులంబు వెలుంగఁ బుట్టి, దృఢంబుగా నృపలక్ష్మితో
నవనిరాజ్యభరంబు దాల్చిన యంతనుండి మఖంబులం
దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తు లైరి మహాద్విజుల్‌.
222
ఉ. అమ్మనుజేంద్రుఁ డైన నలుయజ్ఞము, ధర్మజురాజసూయయ
జ్ఞమ్ముఁ, బ్రయాగఁ జేసిన ప్రజాపతియజ్ఞముఁ, బాశపాణియ
జ్ఞమ్మును, గృష్ణుయజ్ఞము, నిశాకరుయజ్ఞము నీ మనోజ్ఞ య
జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా!
223
చ. వితతమఖప్రయోగవిధివిత్తము, లుత్తమధీయుతుల్‌ జగ
న్నుత సుమహాతపోధను, లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ
క్రతువున ఋత్విజుల్‌, కమలగర్భసమానులు పూర్వదిక్పతి
క్రతువున యాజకోత్తములకంటెఁ బ్రసిద్ధులు సర్వవిద్యలన్‌.
224
శా. విద్వన్ముఖ్యుఁడు, ధర్మమూర్తి, త్రిజగద్విఖ్యాతతేజుండు కృ
ష్ణద్వైపాయనుఁ డేగుదెంచి, సుతశిష్యబ్రహ్మసంఘంబుతో
సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్‌ శక్యంబె వర్ణింప; సా
క్షాద్విష్ణుండవు నీవు భూపతులలోఁ గౌరవ్యవంశాగ్రణీ!
225
ఉ. ఆర్తిహరక్రియాభిరతుఁ డై, కృతసన్నిధి యై, ప్రదక్షిణా
వర్త శిఖాగ్రహస్తముల వహ్ని మహాద్విజదివ్యమంత్రని
ర్వర్తితహవ్యముల్‌ గొనుచు వారిజవైరికులేశ! నీకు సం
పూర్తమనోరథంబులును, బుణ్యఫలంబులు నిచ్చుచుండెడున్‌.
226
వ. అని జనమేజయు, నాతని యజ్ఞమహిమను, ఋత్విజులను, సదస్యులను, నగ్నిభట్టారకు ననురూప శుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతు లయి; రంత జనమేజయుం డాస్తీకుం జూచి ‘మునీంద్రా! నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు, నడుగు’ మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డి ట్లనియె. 227
ఉ. మానిత సత్యవాక్య! యభిమన్యుకులోద్వహ! శాంతమన్యుసం
తానుఁడ వై దయాభినిరతస్థితి నీవు మదీయబంధు సం
తానమనోజ్వరం బుపరతంబుగ, నాకుఁ బ్రియంబుగా మహో
ర్వీనుత! సర్పయాగ ముడివింపుము; కావుము సర్పసంహతిన్‌.
228
చ. అనిన సదస్యులందఱుఁ బ్రియంబున ‘నిట్టి విశిష్ట విప్రము
ఖ్యునకు మహాతపోధనునకుం దగుపాత్రున కెద్ది యిచ్చినన్‌
ఘనముగ నక్షయం బగును గావున నీ ద్విజనాథుకోర్కిఁ బెం
పున వృథ సేయఁగాఁ దగదు భూవలయేశ్వర! యిమ్ము నెమ్మితోన్‌.’
229
వ. అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తీక ప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె; నయ్యవసరంబున. 230
మ. అతులోర్వీసురముఖ్య మంత్రహుత మాహాత్మ్యంబునన్‌ వాసవ
చ్యుతుఁ డై ముందర తక్షకుం డురువిషార్చుల్‌ దూల వాత్యారయో
ద్ధతి నుద్ధూతవివర్ధితాయతబృహద్దావాగ్నివోలెన్‌ విచే
ష్టితుఁ డై మేఘపథంబులం దిరుగుచుండెన్‌ విస్మితుల్‌గా జనుల్‌.
231
క. ఆతని నత్యుగ్రానల | పాతోన్ముఖుఁ డైన వానిఁ బడకుండఁగ ‘నో
హో తక్షక! క్రమ్మఱు’ మని | యాతతభయుఁ గ్రమ్మఱించె నాస్తీకుఁ డెడన్‌.
232
మ. ‘జననీశాపభయప్రపీడితమహాసర్పేంద్రులన్‌ సర్పయా
గనిమిత్తోద్ధత మృత్యువక్త్రగతులం గాకుండఁగాఁ గాచె’ నం
చును నాస్తీకమునీంద్రు నందుల సదస్యుల్‌ సంతసం బంది బో
రనఁ గీర్తించిరి సంతతస్తుతిపదారావంబు రమ్యంబుగన్‌.
233
క. ఒనర జరత్కారు మునీం | ద్రునకు జరత్కారునకు సుతుం డైన మహా
మునివరు నాస్తీకుని ముద | మునఁ దలఁచిన నురగభయముఁ బొందదు జనులన్‌.
234
వ. మఱియు నయ్యాస్తీకు చరితంబు విన్నవారికి సర్వపాపక్షయం బగు నని. 235
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )