ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
వ్యాసుఁడు జనమేజయునకు భారతకథం దెలుప వైశంపాయను నియోగించుట (సం. 1-54-1)
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు జనమేజయుం డుపసంహృతసర్పసత్త్రుం డయి యథావిధి సంపూర్ణదక్షిణల ఋత్విజులను, సదస్యులనుం బూజించి, దీనానాథజనంబులకుఁ గోరినధనంబు లిచ్చి, యనేకపురాణపుణ్యకథాశ్రవణకుతూహలపరుం డగుచు విద్వజ్జనగోష్ఠి నుండి యొక్కనాఁడు. 2
మ. పరమబ్రహ్మనిధిం, బరాశరసుతున్‌, బ్రహ్మర్షిముఖ్యున్‌, దయా
పరుఁ, గౌరవ్యపితామహున్‌, జనహితప్రారంభుఁ, గృష్ణాజినాం
బరు, నీలాంబుదవర్ణదేహు, ననురూపప్రాంశు, నుద్యద్దివా
కర రుక్పింగజటాకలాపు, గతరాగద్వేషు, నిర్మత్సరున్‌.
3
వ. వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో ననేకమునిగణపరివృతుం డయి, కనకమణిమయోచ్చాసనంబున నున్న వ్యాసభట్టారకు నతిభక్తి నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, వినయవినమితశిరస్కుం డై నమస్కరించి జనమేజయుం డి ట్లనియె. 4
సీ. ప్రీతితో మీరును భీష్మాదికురువృద్ధ | రాజులు నుండి భూరాజ్యవిభవ
మెల్ల విభాగించి యిచ్చినం, దమతమ | వృత్తుల నుండక, వీఁగి పాండు
ధృతరాష్ట్రనందనుల్‌ ధృతి చెడి, వా రేమి | కారణంబునఁ బ్రజాక్షయము గాఁగ
భారతయుద్ధ మపారపరాక్రముల్‌ | చేసిరి? మీపంపు సేయ రైరి?
 
ఆ. యెఱిఁగి యెఱిఁగి వారి నేల వారింపర; | యిట్టి గోత్రకలహ మేల పుట్టె?
దీని కలతెఱంగు దెలియంగ నానతి | యిండు నాకు సన్మునీంద్రవంద్య!
5
వ. అని యిట్లు పాండవధార్తరాష్ట్రవిభేదనకథాశ్రవణకుతూహలపరుం డయి యడిగిన జనమేజయునకుం గరుణించి, కృష్ణ్ణద్వైపాయనుండు వైశంపాయనమునింజూచి ‘శ్రీమహాభారతకథాఖ్యానంబాద్యంతంబితనికి సవిస్తరంబుగాఁ జెప్పు’ మని పంచిచనిన. 6
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )