ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
భారత మహిమము
క. జనమేజయుండు విద్వ | జ్జనపరివృతుఁ డై సమస్తజనపాలసభా
జనయోగ్యుని వైశంపా | యనమునిఁ బూజించె వినతుఁ డై వినువేడ్కన్‌.
7
వ. ఆ వైశంపాయనుండును నఖిలభువనవంద్యుం డయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారంబు సేసి, విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి. 8
సీ. కమనీయధర్మార్థకామమోక్షములకు | నత్యంతసాధనం బయినదాని,
వేడ్కతోఁ దవిలి తన్‌ వినుచున్నవారల | కభిమతశుభకరం బయినదాని,
రాజుల కఖిలభూరాజ్యాభివృద్ధిని | త్యాభ్యుదయప్రదం బయినదాని,
వాఙ్మనఃకాయప్రవర్తితానేకజ | న్మాఘనిబర్హణం బయినదాని,
 
ఆ. సత్యవాక్ప్రబంధశతసహస్రశ్లోక | సంఖ్య మయినదాని, సర్వలోక
పూజ్య మయినదాని, బుధనుతవ్యాసమ | హామునిప్రణీత మయినదాని.
9
చ. వినుతపరాక్రముల్‌, ధృతివివేకులు, సత్యసమన్వితుల్‌, యశో
ధనులు, కృతజ్ఞు, లుత్తములు, ధర్మపరుల్‌, శరణాగతానుకం
పను లనఁగాఁ బ్రసిద్ధు లగు భారతవీరుల సద్గుణానుకీ
ర్తనముల నొప్పుదాని, విదితం బగుదాని సభాంతరంబులన్‌.
10
శా. ఆయుష్యం, బితిహాసవస్తుసముదాయం, బైహికాముష్మిక
శ్రేయః ప్రాప్తినిమిత్త, ముత్తమసభాసేవ్యంబు, లోకాగమ
న్యాయైకాంతగృహంబునాఁ బరఁగి, నానావేదవేదాంతవి
ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భారతాఖ్యానమున్‌.
11
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )