ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
పాండవధార్తరాష్ట్రుల భేదకారణసంగ్రహము (సం. 1-55-6)
సీ. పాండుకుమారులు పాండుభూపతిపరో | క్షంబున హస్తిపురంబునందు
ధృతరాష్ట్రునొద్దఁ దత్సుతులతో నొక్కటఁ | బెరుఁగుచు, భూసురవరులవలన
వేదంబులును ధనుర్వేదాదివిద్యలుఁ | గఱచుచుఁ గడలేనియెఱుకఁ దనరు
చున్నఁ, దద్విపుల గుణోన్నతి సైఁపక | దుర్యోధనుండు దుష్కార్య మెత్తి.
 
ఆ. దుర్ణయమున శకునికర్ణదుశ్శాసనుల్‌ | గఱపఁ బాండవులకు నఱయ చేయఁ
గడఁగెఁ; బాండవులును గడుధార్మికులు గానఁ | బొరయ రైరి వారిదురితవిధుల.
12
వ. అది యెట్లనిన: నొక్కనాఁడు జలక్రీడాపరిశ్రమవిచేష్టితుం డయి ప్రమాణకోటిస్థలంబున నిద్రితుం డైన భీమసేను నతిఘనలతాపాశబద్ధుం జేసి గంగమడువునం ద్రోచిన, నాతం డనంతసత్త్వుండు గావునఁ దద్బంధంబు లెల్లఁ దెగ నీల్గి మీఁదికి నెగసె; మఱియొక్కనాఁ డతివ్యాయామఖేదంబున సుప్తుం డైన వానిసర్వాంగంబుల యందుఁ గృష్ణసర్పంబులం బట్టి కఱపించిన, నాతండు వజ్రమయదేహుండు గావునఁ దద్విషదంష్ట్రలు నాఁటవయ్యె; మఱియు నొక్కనాఁడు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన, నతండు దివ్యపురుషుండు గావునఁ దద్విషం బన్నంబుతోడన జీర్ణం బయ్యె; మఱియు వారల కెల్ల నపాయంబు సేయసమకట్టి. 13
సీ. వదలక కురుపతి వారణావతమున | లక్కయిల్‌ గావించి, యక్కజముగ
నందఱఁ జొన్పి, యం దనలంబు దరికొల్పఁ | బనిచినఁ, బాండునందను లెఱింగి
విదురోపదిష్టభూవివరంబునం దప | క్రాంతు లై బ్రదికి నిశ్చింతు లయిరి;
ధర్మువు నుచితంబుఁ దప్పనివారల, | సదమలాచారుల నుదిత సత్య
 
ఆ. రతుల నఖిలలోకహితమహారంభుల, | భూరిగుణుల, నిర్జితారివర్గు
లై వెలుంగువారి దైవంబ రక్షించు | దురితవిధుల నెపుడుఁ బొరయకుండ.
14
వ. ఇట్లు దుర్యోధనుచేయు నపాయంబులవలనం బాయుచుఁబాండవులు లాక్షాగృహదాహంబువలన నక్షయు లై జననీసహితంబుగా వనంబులకుం జనిన, నందు భీమసేనుండు హిడింబాసురుం జంపి, వాని చెలియలి హిడింబను వివాహం బై, యేకచక్రపురంబున కేఁగి, యందు బకాసురుం జంపి విప్రులం గాచె; మఱి. యందఱు విప్రవేషంబున ద్రుపదుపురంబునకుం జని, యందు ద్రౌపదీస్వయంవరంబున మత్స్యయంత్రం బర్జునుం డశ్రమంబున నురుల నేసి, సకలరాజలోకంబు నొడిచి, ద్రోవదింజేకొనిన, దాని నేవురు గురువచనంబున వివాహం బై ద్రుపదుపురంబున నొక్కసంవత్సరం బున్న నెఱింగి ధృతరాష్ట్రుండు వారి రావించి, వారల కర్ధరాజ్యంబిచ్చి, యింద్రప్రస్థపురంబున నుండం బనిచిన, నందుఁ బాండవులు రాజ్యంబు సేయుచున్నంత. 15
క. ద్వారవతి కేఁగి, యర్జునుఁ | డారంగ సుభద్రఁ బెండ్లి యై వచ్చి, మహా
వీరు నభిమన్యుఁ గులవి | స్తారకు సత్పుత్త్రు నతిముదంబునఁ బడసెన్‌.
16
వ. మఱియు నగ్నిదేవుచేత దివ్యరథంబును దివ్యాశ్వంబులును గాండీవదేవదత్తంబులును నక్షయబాణ తూణీరంబులుం బడసి, సురగణంబులతో సురపతి నోర్చి, ఖాండవదహనంబున నగ్నిదేవునిం దనిపె; మఱి మయువలన సభాప్రాప్తుం డై, భీమునిచేత జరాసంధుం జంపించి, దిగ్విజయంబు సేసి సార్వభౌముం డై ధర్మరాజు రాజసూయమహాయజ్ఞంబుఁ గావించె; నివి మొదలుగాఁ గల పాండవులగుణసంపదలు చూచి సహింప నోపక దుర్యోధనుండు శకునికైతవంబున మాయాద్యూతంబున ధర్మరాజుం బరాజితుం జేసి, పండ్రెండేఁడులు వనవాసంబును, నొక్కయేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబునుగా సమయంబు సేసి భూమి వెలువరించినం, జని పాండవులు వనవాసంబున నున్నంత. 17
చ. పరమగురూపదేశమునఁ బార్థుఁడు పార్థివవంశశేఖరుం
డరిది తపంబునన్‌, భుజబలాతిశయంబున నీశుఁ బన్నగా
భరణుఁ బ్రసన్నుఁ జేసి, దయఁ బాశుపతాదిక దివ్యబాణముల్‌
హరసురరాజదేవనివహంబులచేఁ బడసెం బ్రియంబునన్‌.
18
అక్కర. వనమునఁ బదియు రెండేఁడు లజ్ఞాతవాస మొక్కేఁడు
జనపదంబున నుండి, తపన నయ్యేండ్లు సలిపి, సద్వృత్తు
లనఘులు మును వేఁడి, కొనక మఱి భారతాజి సేయంగ
మొనసిరి, పాండవ కౌరవుల భేదమూల మిట్టిదియ.
19
వ. ఇట్టి భరతకులముఖ్యులవంశచరితానుకీర్తనంబునం జేసి యిక్కథ శ్రీమహాభారతంబునాఁ బరఁగె. 20
శా. ఆ నారాయణపాండవేయగుణమాహాత్మ్యామలజ్యోత్స్నఁ జి
త్తానందం బొనరించుచున్‌, జనుల కర్థాంశుప్రకాశంబుతో
మానై, సాత్యవతేయధీవనధి జన్మ శ్రీమహాభారతా
ఖ్యానాఖ్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంతవిధ్వంసి యై.
21
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )