ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
ఉపరిచరవసుమహారాజు వృత్తాంతము (సం. 1-57-1)
వ. ఇట్టి శ్రీమహాభారతంబునకుం గర్త యయిన శ్రీవేదవ్యాసునిజన్మంబు సవిస్తరంబుగాఁ జెప్పెద వినుము. 22
సీ. వాసవప్రతిముండు వసు వను నాతండు | చేదిభూనాథుండు శిష్టలోక
నుతకీర్తి మృగయావినోదార్థ మడవికిఁ | జని, యొక్కమునిజనాశ్రమమునందు
నిర్వేదమున మహానిష్ఠతో సన్న్యస్త | శస్త్రుఁ డై తప మొప్పఁ జలుపుచున్న
నాతనిపాలికి నమరగణంబుతో | నింద్రుండు వచ్చి తా నిట్టు లనియె:
 
ఆ. ‘ధరణిఁ బ్రజఁ గరంబు దయతోడ వర్ణధ | ర్మాభిరక్షఁ జేసి యమలచరిత
నేలి, రాజ్యవిభవ మది యేల యని తప | శ్చరణ నునికి నీక చనియె ననఘ!’
23
వ. ‘నీవర్ణధర్మప్రతిపాలనంబునకుఁ దపంబునకు మెచ్చితి; నీవు నాతోడం జెలిమిసేసి నాయొద్దకువచ్చుచుంబోవుచు మహీరాజ్యంబు సేయుచు నుండు’ మని వానికి దేవత్వంబును గనకరత్నమయం బైన దివ్యవిమానంబును నెద్దాని నేని తాల్చిన నాయుధంబులు దాఁక నోడు నట్టి వాడని వనజంబులు గలిగిన యింద్రమాల యను కమలమాలికయును, దుష్టనిగ్రహశిష్టపరిపాలనక్షమం బైన యొక్కవేణుయష్టియు నిచ్చిన, నవ్వసువును దద్విమానారూఢుం డై యుపరిలోకంబునం జరించుటంజేసి యుపరిచరుండు నాఁ బరఁగి, యక్కమల మాలికయుఁ దనకుం జిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయుచు, మెఱసి యేఁటేఁట నింద్రోత్సవం బను నుత్సవంబు సేయుచు నీశ్వరునకు నింద్రాదిదేవతలకు నతిప్రీతి సేసె; నది మొదలుగా రాజులెల్లం బ్రతిసంవత్సరంబు నింద్రోత్సవంబు సేయుచుండుదురు. 24
క. ఘనముగ నయ్యింద్రోత్సవ | మొనరించు మహీపతులకు నొగి నాయుర్వ
ర్ధనము నగుఁ, బెరుఁగు సంతతి, | యనవరతము ధరణిఁ బ్రజకు నభివృద్ధి యగున్‌.
25
వ. అట్టియింద్రోత్సవంబున నతిప్రీతుండయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల యదురాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి, వారలం బెక్కుదేశంబుల కభిషిక్తులం జేసిన, నయ్యేవురువాసవులు వేఱువేఱ వంశకరు లయి పరఁగి; ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుం డయి రాజర్షి యయి రాజ్యంబు సేయుచు, నిజపురసమీపంబునం బాఱిన శుక్తిమతి యను మహానదిం గోలాహలం బనుపర్వతంబు గామించి యడ్డంబు వడిన, దానిం దనపాదంబునం జేసి తలఁగంద్రోచిన, నన్నదికిఁ బర్వతసమాగమంబున వసుపదుం డను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన, నయ్యిరువురను శుక్తిమతి దద్దయు భక్తిమతి యై గిరినిరోధంబు బాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన, నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని, గిరికం దనక ధర్మపత్నిగాఁ జేసికొని యున్నంత, నగ్గిరిక ఋతుమతి యయిన, దీనికి మృగమాంసంబు దెచ్చి పెట్టు మని తనపితృదేవతలు పంచిన, నప్పు డయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి. 26
సీ. పలుకులముద్ద్దును, గలికిక్రాల్గన్నుల | తెలివును, వలుఁదచన్నులబెడంగు,
నలఘుకాంచీపదస్థలములయొప్పును | లలితాననేందుమండలము రుచియు,
నళినీలకుటిలకుంతలములకాంతియు, | నెలజవ్వనంబున విలసనమును,
నలసభావంబునఁ బొలుపును, మెలుపును | గలుగు నగ్గిరికను దలఁచి తలఁచి,
 
ఆ. ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ | జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్కంద | మయ్యె నవనిపతికి నెయ్య మొనర.
27
వ. అయ్యమోఘవీర్యం బొక్కయజీర్ణపర్ణపుటంబున నిమ్ముగా సంగ్రహించి యొక్కడేగయఱుతంగట్టి దీనిం గొనిపోయి గిరికకిమ్మని యుపరిచరుండు పనిచిన, నదియు నతిత్వరితగతి నాకానం గడచి యాకాశంబునం బఱచునప్పుడు. 28
క. ఆమిష మని దానిం గొనఁ | గా మది సమకట్టి, యొక్కఖగ మాఖగమున్‌
వ్యోమమునఁ దాఁక, దివిసం | గ్రామం బారెంటి కయ్యెఁ గడురభసమునన్‌.
29
క. సునిశితతుండహతిని వ్ర | స్సినపర్ణపుటంబు వాసి చెదరుచు నృపనం
దనువీర్యము యమునానది | వనమధ్యమునందు వాయువశమునఁ బడియెన్‌.
30
వ. తొల్లి బ్రహ్మశాపనిమిత్తంబున నద్రిక యను నప్సరస యమునయందు మీ నయి క్రుమ్మరుచున్నయది యవ్వసువీర్యబిందుద్వయంబు త్రావి గర్భంబు దాల్చిన దశమమాసంబునందు. 31
తే. తెరలవల వైచి జాలరుల్‌ దిగిచి, దాని | యుదరదళనంబు సేసి, యం దొక్కకొడుకు
నొక్కకూఁతును గని, వారి నొనరఁ దెచ్చి | దాశరాజున కిచ్చిరి తత్‌క్షణంబ.
32
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )