ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
మత్స్యగంధి వృత్తాంతము (సం. 1-57-50)
వ. అయ్యద్రికయు మానుషప్రసవం బొనరించినం దనకు శాపమోక్షణం బగు నని బ్రహ్మవచనంబు గలుగుటంజేసి మీనయోని విడిచి, దివ్యవనిత యయి దేవలోకంబునకుం జనియె; మఱియును మత్స్యోదరంబునఁ బుట్టిన యక్కొడుకు మత్స్యరాజునాఁ బరఁగి, ధర్మపరుం డయి మత్స్యదేశంబున కధిపతి యయ్యె; నక్కూఁతును దాశరాజు దనకూఁతుంగాఁ జేకొని పెంచినం బెరుఁగుచు. 33
క. అంబుజముఖి యక్కన్య ప్రి | యం బొనరఁగ మత్స్యగంది యనఁగా ధర్మా
ర్థంబుగఁ దనతండ్రి నియో | గంబున నయ్యమున నోడఁ గడపుచు నుండెన్‌.
34
వ. అంత. 35
చ. గతమదమత్సరుండు, త్రిజగద్వినుతుండు, వసిష్ఠపౌత్త్రుఁ డు
న్నతమతి, శక్తిపుత్త్రుఁ, డఘనాశనఘోరతపోధనుండు, సు
వ్రతుఁ డయి తీర్థయాత్ర చనువాఁడు, పరాశరుఁ డన్మునీంద్రుఁ డ
య్యతివఁ దలోదరిం గనియె నయ్యమునానది యోడరేవునన్‌.
36
వ. ఇ ట్లేకతంబ యేకవస్త్ర యై యోడ నెక్కవచ్చువారి నిరీక్షించుచున్న సత్యవతిం జూచి యా మునివరుండు దానియందు మదనపరవశుం డై దానిజన్మంబు దన దివ్యజ్ఞానంబున నెఱింగి, యయ్యోడ యెక్కి దానితో నొక్కటఁ జని చని. 37
సీ. చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ, | జిక్కనిచనుఁగవఁ జీఱఁ గోరు,
నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు, | జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి,
యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు, | వేడ్కతో మఱుమాట వినఁగఁ దివురు,
నతిఘనలజ్జావనత యగు నక్కన్య | పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు
 
ఆ. నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు | లయ్యు, గడువివిక్త మయినచోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు; రెందుఁ | గాముశక్తి నోర్వఁగలరె జనులు.
38
వ. ఇట్లు విగతలజ్జాపరవశుం డయి మునివరుండు దనయభిప్రాయం బక్కన్యక కెఱింగించిన, నదియును దీని కొడంబడనినాఁడు నా కలిగి యిమ్ముని శాపం బిచ్చునో యని వెఱచి యి ట్లనియె. 39
తరలము. తనువు మీన్పొలవల్చు జాలరిదాన, నట్లును గాక యే
ననఘ! కన్యకఁ, గన్యకావ్రత మంతరించిన నెట్లు మ
జ్జనకునింటికిఁ బోవ నేర్తుఁ? బ్రసాదబుద్ధి యొనర్పు స
న్మునిగణోత్తమ! నాకు దోషవిముక్తి యె ట్లగు నట్లుగాన్‌.
40
వ. అనిన నమ్మునివరుండు గరంబు సంతోషించి ‘నాకు నిష్టంబు సేసినదాన నీకన్యాత్వంబు దూషితంబు గా, దోడకు’ మని దానికి వరం బిచ్చి, నీవు వసు వనురాజర్షివీర్యంబునం బుట్టినదానవు గాని సూతకులప్రసూతవు కా వని చెప్పి, దానిశరీరసౌగంధ్యంబు యోజనంబునం గోలె జనులకు నేర్పడునట్లుగాఁ బ్రసాదించిన, నది గంధవతి యనియు, యోజనగంధి యనియుఁబరఁగి, తత్ప్రసాదంబున ననేక దివ్యాంబరాభరణభూషితయు నయి యమునానదీద్వీపంబున నోడ చేర్చి. 41
తే. ‘ఎల్లవారును జూడంగ నిట్టిబయల | నెట్లు సంగమ మగు’ నని యింతి యన్న
నమ్మునీంద్రుండు గావించె నప్పు డఖిల | దృష్టిపథరోధినీహారతిమిర మంత.
42
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )