ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
శ్రీవేదవ్యాసమునీంద్రుని యవతారము (సం. 1-57-70)
క. పరమేష్ఠికల్పుఁ డగు న | ప్పరాశరుసమాగమమునఁ బరమగుణైకా
భరణకు ననవద్యమనో | హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్‌.
43
క. సద్యోగర్భంబున నహి | మద్యుతితేజుండు వేదమయుఁ డఖిలమునీం
ద్రాద్యుఁడు వేదవ్యాసుం | డుద్యద్‌జ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్‌.
44
క. ఆ యమునాద్వీపమున న | మేయుఁడు కృష్ణుఁడయి లీలమెయిఁ గృష్ణద్వై
పాయనుఁ డనఁ బరఁగి వచ | శ్రీయ్శుతుఁడు తపంబువలనఁ జిత్తము నిలిపెన్‌.
45
వ. పరాశరుండు సత్యవతి గోరిన వరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె; నంతఁ గృష్ణద్వైపాయనుండును గృష్ణాజిన పరిధాన కపిలజటామండల దండకమండలు మండితుం డై తల్లిముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి ‘మీకుం బనిగలయప్పుడ నన్నుం దలంచునది; యాక్షణంబ వత్తు’ నని సకలలోకపావనుం డఖిలలోక హితార్థంబుగాఁ దపోవనంబునకుం జని, యందు మహాఘోరతపంబు సేయుచు. 46
ఉ. సంచిత పుణ్యుఁ డంబురుహసంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁ డైనవాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్‌ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్తజగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరఁగు భారతసంహితఁ జేసె నున్నతిన్‌.
47
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )