ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
భీష్మాదివీరుల దేవదానవాదుల యంశంబువలనఁ బుట్టుట (సం. 1-58-3)
వ. ‘మఱియు దేవదైత్య దానవ ముని యక్ష పక్షిగంధర్వాదుల యంశావతారంబులు దాల్చి భీష్మాది మహావీరులు భారత యుద్ధంబు సేయ ననేకులు పుట్టిరి. వారల కొలంది యెఱింగి చెప్ప ననేకకాలం బనేకసహస్ర ముఖంబులవారి కైన నలవిగా’ దనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 48
క. ‘అమరాసుర ముఖ్యుల యం | శములను మహిఁ బుట్టి ‘సకలజనపాలక సం
ఘములకు భారతరణరం | గమునను లయ మొంద నేమి కారణ?’ మనినన్‌.
49
వ. జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 50
సీ. పరశురాముండు భీకర నిజకోపాగ్ని | నుగ్రుఁ డై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్త్రంబు సేసినఁ, | దత్‌క్షత్త్రసతులు సంతానకాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల | దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల, | నిప్పాటఁ దత్‌క్షత్త్ర మెసఁగి యుర్విఁ
 
ఆ. బర్వి రాజధర్మపద్ధతి ననఘమై, | జారచోర దుష్టజనుల బాధఁ
బొరయకుండ నిఖిల భూప్రజాపాలనఁ | జేయుచుండె శిష్టసేవ్య మగుచు.
51
వ. ఇట్లు బ్రాహ్మణ వీర్య ప్రభవు లయిన క్షత్త్రియులు ధర్మమార్గంబునం బ్రజాభిరక్షణంబు సేయుటంజేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు దప్పక ప్రవర్తిల్లుటయు, బ్రహ్మక్షత్త్రంబుల కాయుర్వర్ధనంబును, ననవరతయాగతర్పిత పర్జన్య ప్రసాదంబునం గోరినయప్పుడు వానలు గురియుచు సకల సస్యసమృద్ధియుఁ, బ్రజావృద్ధియు నైన భూదేవి ప్రజాభారపీడిత యై సురాసుర మునిగణ పరివృతు లై యున్న హరి హర హిరణ్యగర్భుల కడకుం జని యి ట్లనియె. 52
క. ‘భూరి ప్రజా నిరంతర | భారము దాల్చు టిది కరము భారము; దయతో
మీరీభారమునకుఁ బ్రతి | కారము గావించి నన్నుఁ గావుం’ డనినన్‌.
53
క. వనజాసను ననుమతమున | వనరుహనాభుండు వాసవప్రముఖసుప
ర్వనికాయాంశంబులతోఁ | దనరఁగఁ బుట్టించె నుర్విఁ దనయంశమ్మున్‌.
54
క. దితిసుత దానవ యక్ష | ప్రతతుల యంశములఁ బుట్టి ప్రజలకు విహితా
హితు లగుచుండి రనేకులు | జితకాశులు ధరణిపతులు శిశుపాలాదుల్‌.
55
చ. అతులబలాఢ్యు లైన యమరాంశ సముద్భవు లెల్లఁ బాండుభూ
పతిసుతపక్ష మై, సురవిపక్ష గణాంశజు లెల్ల దుర్మదో
ద్ధత కురురాజ పక్షమయి, ధారుణిభారము వాయ ఘోరభా
రతరణభూమి నీల్గిరి పరస్పరయుద్ధము సేసి వీరు లై.
56
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 57
క. ఆదిత్య దైత్య దానవు | లాదిగఁ గల భూతరాశి దగు సంభవమున్‌
మేదినిఁ దదంశముల మ | ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగన్‌.
58
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )