ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
దేవదానవప్రముఖుల యుత్పత్తిక్రమము (సం. 1-59-9)
వ. అనిన విని జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ; దొల్లి సకలజగదుత్పత్తినిమిత్తభూతుం డైన బ్రహ్మకు మానసపుత్త్రు లైన మరీచియు, నంగిరసుండును, నత్రియుఁ, బులస్త్యుండును, బులహుండును, గ్రతువును ననునార్వురు పుట్టి; రందు మరీచికిఁ గశ్యపప్రజాపతి పుట్టెఁ; గశ్యపువలనఁ జరాచర భూతరాశి యెల్ల నుద్భవిల్లె; నె ట్లనిన- బ్రహ్మదక్షిణాంగుష్ఠంబున దక్షుండును, వామాంగుష్ఠంబున ధరణి యను స్త్రీయునుం బుట్టిన యయ్యిరువురకును. 59
క. సుతు లనఘులు వేవురు దమ | యుతు లై యుదయించి, సాంఖ్యయోగాభ్యాసో
న్నతిఁ జేసి ముక్తు లై, భూ | రితేజు లందఱును నూర్ధ్వరేతసు లైనన్‌.
60
వ. పదంపడి యేఁబండ్రుకూఁతులుం బుట్టిన, వారల నెల్ల దక్షుం డపుత్త్రకుండు గావునఁ బుత్త్రీకరణంబు సేసి, యందుఁ గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జా మతు లను వనితలఁ బదుండ్రను ధర్ముం డను మనువున కిచ్చె; నశ్విన్యాదు లైన యిరువదేడ్వు రను జంద్రున కిచ్చె; నదితి దితి దను కాలా నాయు స్సింహికా ముని కపిలా వినతా క్రోధా ప్రాధా క్రూరా కద్రువ లను పదుమువ్వురను గశ్యపున కిచ్చె; నం దదితి యనుదానికి ధాతృ మిత్రార్యమ శక్ర వరుణాంశు భగ వివస్వ త్పూష సవితృ త్వష్టృ విష్ణు లనంగా ద్వాదశాదిత్యులు పుట్టిరి; మఱియును. 61
క. దితి యనుదానికి నప్రతి | హతబలుఁడు హిరణ్యకశిపుఁ డనఁ బుట్టె సుతుం;
డతనికి నేవురు పుట్టిరి | ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్‌.
62
వ. ఆ ప్రహ్లాదసంహ్లాదానుహ్లాద శిబిబాష్కళులయందుఁ బ్రహ్లాదునకు విరోచన కుంభనికుంభు లనంగా మువ్వురు పుట్టి; రందు విరోచనునకు బలి పుట్టె; బలికి బాణాసురుండు పుట్టె; దను వనుదానికి విప్రచిత్తి శంబర నముచిపులోమాసి లోమకేశి దుర్జయాదు లయిన దానవులు నలువండ్రు పుట్టిరి; వారల పుత్త్రపౌత్త్రవర్గం బసంఖ్యాతం బై ప్రవర్తిల్లెఁ; గాల యనుదానికి వినాశనక్రోధాదు లెనమండ్రు పుట్టిరి. 63
ఆ. అజితశక్తియుతులనాయువ యనుదాని | కజరు లధిక వీరు లతుల భూరి
భుజులు శక్రరిపులు పుట్టిరి నలువురు | విక్షర బలవీర వృత్రు లనఁగ.
64
వ. మఱియు సింహిక యనుదానికి రాహువు పుట్టె; ముని యనుదానికి భీమసేనోగ్రసేనాదు లయిన గంధర్వులు పదార్వురు పుట్టిరి; కపిల యను దానికి నమృతంబును గోగణంబులును బ్రాహ్మణులును ఘృతాచీ మేనకాదు లయిన యప్సరసలును బుట్టిరి; వినత యను దానికి ననూరుండును గరుడుండును బుట్టి; రం దనూరునకు శ్యేని యనుదానికి సంపాతి జటాయువులు పుట్టిరి; క్రోధ యను దానికిఁగ్రోధవశగణంబు పుట్టెఁ; బ్రాధ యను దానికి సిద్ధాదులు పుట్టిరి; క్రూర యనుదానికి సుచంద్ర చంద్ర హంత్రాదులు పుట్టిరి; కద్రువ యను దానికి శేష వాసుకి పురోగమానేక భుజంగముఖ్యులు పుట్టిరి. 65
సీ. మఱి యంగిరసుఁ డను మానసపుత్త్రున | కయ్యుతథ్యుండు బృహస్పతియును
సంవర్తుఁడును గుణాశ్రయ యోగసిద్ధి య | న్కూఁతురుఁబుట్టి; రక్కొడుకులందు
విభుఁడు బృహస్పతి వేల్పుల కాచార్యుఁ | డై లోకపూజితుఁ డై వెలింగె;
మానుగా నత్రి య న్మానసపుత్త్రున | కుద్భవించిరి ధర్మయుతచరిత్రు
 
ఆ. లఖిలవేదవేదు లాద్యు లనేకులు | దీప్తరవిసహస్రతేజు లనఘు
లధికతరతపోమహత్త్వసంభృతవిశ్వ | భరులు సత్యపరులు పరమమునులు.
66
వ. మఱియుఁ బులస్త్యుం డను మానసపుత్త్రునకు ననేకరాక్షసులు పుట్టిరి; పులహుం డను మానసపుత్త్రునకుఁ గిన్నర కింపురుషాదులు పుట్టిరి; క్రతు వను మానసపుత్త్రునకు సత్యవ్రత పరాయణు లైన పతంగ సహచరులు పుట్టిరి; పైతామహుం డైన దేవుం డను మునికిఁ బ్రజాపతి పుట్టె; వానికి ధూమ్రా బ్రహ్మవిద్యా మనస్వినీ రతాశ్వసాశాండిలీ ప్రభాత లనంగా నేడ్వురు భార్య లై; రందు ధూమ్రకు ధరుండును, బ్రహ్మవిద్యకు ధ్రువుండును, మనస్వినికి సోముండును, రతకు నహుండును, శ్వసకు ననిలుండును, శాండిలికి నగ్నియుఁ, బ్రభాతకుఁ బ్రత్యూష ప్రభాసు లనంగా నెనమండ్రు వసువులును బుట్టి; రందు ధరుం డను వసువునకు ద్రవిణుండును. హుతవావ్యవహుండునుం బుట్టిరి; ధ్రువుండను వసువునకుఁ గాలుండు పుట్టె; సోముం డను వసువునకు మనోహర యనుదానికి వర్చసుండును శిబిరుండును బ్రాణుండును రమణుండును బృథ యను కూఁతురునుం బుట్టిరి; పృథకుఁ బదుండ్రు గంధర్వసుతులు పుట్టిరి; యహుం డను వసువునకు జ్యోతి పుట్టె; ననిలుండను వసువునకు శివ యను దానికి మనోజవుండును నవిజ్ఞాతగతియునుం బుట్టిరి. అగ్ని యను వసువునకుఁ గుమారుండు పుట్టెఁ; బ్రత్యూషుం డను వసువునకు ఋషియైన దేవలుండు పుట్టెఁ; బ్రభాసుం డను వసువునకు బృహస్పతి చెలియ లైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె. 67
క. ఆ విశ్వకర్మ నిర్మిత | దేవవిమానుండు, నిఖిల దివ్యాభరణ
శ్రీవిరచన పరితోషిత | దేవుఁడు, శిల్పప్రజాపతియు నై నెగడెన్‌.
68
వ. మఱియు స్థాణునకు మానసపుత్త్రు లైన మృగవ్యాధ శర్వ నిరృత్యజైక పాదహిర్బుధ్న్యపినాకి దహనేశ్వరకపాలి స్థాణు భవు లనంగా నేకాదశరుద్రులు పుట్టిరి; మఱి బ్రహ్మ దక్షిణస్తనంబున ధర్ముం డను మనువు పుట్టె; వానికి శమకామహర్షు లనంగా మువ్వురు పుట్టిరి; యామువ్వురకుఁ గ్రమంబునఁ బ్రాప్తి రతి నంద లనంగా మువ్వురు భార్యలైరి; సవితృనకు బడబారూపధారిణి యైన త్వాష్ట్రికి నాశ్వినులు పుట్టిరి; బ్రహ్మహృదయంబున భృగుండు పుట్టె; వానికిఁగవి పుట్టె; వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుం డయ్యె; వానికిఁ జండామర్కత్వష్ట్యధరాత్త్రు లనంగా నలువురు గొడుకులు పుట్టిరి; వా రసురులకు యాజ్ఞికు లైరి మఱియును. 69
సీ. విగతాఘుఁ డైన యాభృగునకుఁ బుత్త్రుఁడై | చ్యవనుండు పుట్టె; భార్గవవరుండు
జనవంద్యుఁ డతనికి మనుకన్యకకుఁ బుట్టె | నూరుల నౌర్వుండు భూరికీర్తి;
యతనికి నూర్వురు సుతులు ఋచీకాదు | లుదయించి రఖిల భూవిదిత తేజు;
లందు ఋచీకున కొందంగ జమదగ్ని | యనుముని పుట్టె; నాతనికిఁ బుట్టి
 
ఆ. రలఘుమతులు సుతులు నలువురు; వారిలోఁ | బరశురాముఁ డాదిపురుషమూర్తి
దండితాహితుండు గొండుక యయ్యును | దద్ద గుణములందుఁ బెద్ద యయ్యె.
70
వ. మఱియు బ్రహ్మకు ధాతయు విధాతయు ననంగా నిద్దఱు మనుసహాయులై పుట్టిరి; వారితోడను లక్ష్మి పుట్టె; లక్ష్మికి మానసపుత్త్రు లనేకులు పుట్టిరి; వరుణునకు జ్యేష్ఠకు బలుండును సుర యను కూఁతురునుం బుట్టిరి; సురయం దధర్ముండు పుట్టె; నా యధర్మునకు నిరృతికి భయ మహాభయ మృత్యువు లనఁగా మువ్వురు పుట్టిరి; మఱియుఁ దామ్రకుఁ గాకియు శ్యేనియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు నన నేవురుకన్యలు పుట్టిరి; యందుఁ గాకి యనుదానికి నులూకంబులు పుట్టె; శ్వేని యను దానికి శ్యేనంబులు పుట్టె; భాసి యనుదానికి భాసగృధ్రాదులు పుట్టె; ధృతరాష్ట్రి యను దానికి హంస చక్ర వాకంబులు పుట్టె; శుకియను దానికి శుకంబులు పుట్టె; మఱియుం గ్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు ననఁ దొమ్మండ్రు పుట్టి; రందు మృగి యనుదానికి మృగంబులు పుట్టె; మృగమంద యనుదానికి ఋక్ష చమర సృమరాదులు పుట్టె; హరి యనుదానికి వానరగణంబులు పుట్టె భద్రమనస యనుదానికి నైరావణంబు పుట్టె; నైరావణంబునకు దేవనాగంబులు పుట్టె; మాతంగి యనుదానికి గజంబులు పుట్టె; శార్దూలి యనుదానికి సింహవ్యాఘ్రంబులు పుట్టె; శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుట్టె; సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననలయు ననం బుట్టి; రందు రోహిణికిఁ బశుగణంబులు పుట్టె; గంధర్వి యనుదానికి హయంబులు పుట్టె; ననలకు గిరి వృక్షలతా గుల్మంబులు పుట్టె; సురసకు సర్పంబులు పుట్టె; నిది సకలభూత సంభవప్రకారంబు. 71
చ. దివిజ మునీంద్ర దానవదితి ప్రభవాదిసమస్తభూతసం
భవముఁ గృతావధాను లయి భక్తిమెయిన్‌ వినుచున్న పుణ్యమా
నవులకు నిక్కువం బగు మనఃప్రియ నిత్యసుఖంబులుం జిరా
యువు బహుపుత్త్రలాభవిభవోన్నతియున్‌ దురితప్రశాంతియున్‌.
72
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )