ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
దేవదానవాద్యంశములచే భూమియందుఁ బుట్టిన వారి క్రమము (సం. 1-57-84)
వ. మఱియు మర్త్యలోకంబునందు దేవదైత్యదానవుల యంశావతారంబుల వివరించెద వినుము. 73
క. యాదవవంశంబున జగ | దాదిజుఁ డగు విష్ణుదేవునంశంబున ను
త్పాదిల్లెఁ గృష్ణుఁ డపగత | ఖేదుఁడు వసుదేవ దేవకీదేవులకున్‌.
74
క. శ్రీ వెలుఁగ రోహిణికి వసు | దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్‌
భూవంద్యుఁ డనంతుఁడు బల | దేవుండు ప్రలంబ ముఖ్యదితిజాంతకుఁ డై.
75
వ. మఱియు లక్ష్మి యంశంబున రుక్మిణి యుదయించె; సనత్కుమారు నంశంబునఁ బ్రద్యుమ్నుండు పుట్టె; నప్సరసల యంశంబులఁ గృష్ణునిషోడశసహస్రాంతఃపురవనితలు పుట్టి; రయ్యయి వేల్పుల యంశంబుల యదువృష్ణి భోజాంధక వంశంబుల వీరు లనేకులు పుట్టిరి; మఱియు. 76
క. ముదమునఁ బ్రభాసుఁ డను నెని | మిది యగు వసునంశమునను మేదిని భీష్ముం
డుదయించె సర్వవిద్యా | విదుఁ డపజిత పరశురామ వీర్యుఁడు బలిమిన్‌.
77
క. అనఘుఁడు సురగురునంశం | బునను భరద్వాజుకలశమునఁ బుట్టె శరా
సనవిద్యాచార్యుఁడు భూ | వినుతుఁడు ద్రోణుండు నిఖిలవేదవిదుం డై.
78
క. అలఘుఁడు కామక్రోధా | దుల యేకత్వమునఁ బుట్టె ద్రోణునకు మహా
బలుఁ డశ్వత్థామ రిపు | ప్రళయాంతకుఁ డస్త్రశస్త్రపరిణతుఁ డగుచున్‌.
79
వ. మఱియు నేకాదశరుద్రుల యంశంబునఁగృపుఁడు పుట్టె; సూర్యునంశంబునఁగర్ణుండు పుట్టె; ద్వాపరాంశంబున శకుని పుట్టె; నరిష్టాపుత్త్రుం డయిన హంసుం డను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుం డయి పుట్టె; మతి యనువేల్పుగాంధారి యై పుట్టె; మఱియు నయ్యిద్దఱకుం గలియంశంబున దుర్యోధనుండు పుట్టెఁ; బౌలస్త్య భ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యోధనానుజ శతం బై పుట్టె; హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె; సంహ్లాదుండు శల్యుం డై పుట్టె; ననుహ్లాదుండు ధృష్ణకేతుం డై పుట్టె; శిబి యనువాఁడు ద్రుమసేనుం డై పుట్టె; బాష్కళుండు భగదత్తుఁ డై పుట్టె; విప్రచిత్తి యను దానవుండు జరాసంధుం డై పుట్టె; నయశ్శిరుండును నశ్వశీర్షుండును నయశ్శంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును ననువా రేవురు దానవులు గేకయరాజు లయి పుట్టిరి; కేతుమంతుండమితౌజుం డై పుట్టె; స్వర్భానుం డుగ్రసేనుండై పుట్టె; జంభుండు విశోకుండై పుట్టె; నశ్వపతి కృతవర్మ యై పుట్టె; వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుం డై పుట్టె; నజరుండు మల్లుం డై పుట్టె; నశ్వగ్రీవుండు రోచమానుం డై పుట్టె; సూక్ష్ముండు బృహద్రథుం డై పుట్టెఁ; దుహుం డనువాఁడు సేనాబిందుం డై పుట్టె; నేకచక్రుండు ప్రతివింధ్యుం డై పుట్టె; విరూపాక్షుండు చిత్రవర్మ యై పుట్టె; హరుండును నహరుఁడును సుబాహు బాహ్లికు లై పుట్టిరి; చంద్రవక్త్రుండు ముంజకేశుం డై పుట్టె; నికుంభుండు దేవాపి యై పుట్టె; శరభుండు సోమదత్తుం డై పుట్టెఁ; జంద్రుండు చంద్రవర్మ యై పుట్టె; నర్కుండు ఋషికుం డై పుట్టె; మయూరుండు విశ్వుం డై పుట్టె; సుపర్ణుండు క్రోధకీర్తి యై పుట్టె; రాహువు క్రోధుం డై పుట్టెఁ; జంద్రహంత శునకుం డై పుట్టెఁ; నశ్వుం డనువా డశోకుండైపుట్టె; భద్రహస్తుండు నందుం డై పుట్టె; దీర్ఘజిహ్వుండు గాశిరాజై పుట్టెఁ; జంద్రవినాశనుండు జానకి యై పుట్టె; బలీనుండు పౌండ్రమత్స్యుం డై పుట్టె; వృత్రుండు మణిమంతుం డై పుట్టెఁ; గాలాపుత్త్రు లెనమండ్రు క్రమంబున జయత్సేనాపరాజితనిషధాధిపతి శ్రేణిమన్మ హౌజో -భీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి; క్రోధ వశగణంబువలన మద్రక కర్ణ వేష్ట సిద్ధార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్ర సురథ శ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మిజనమేజ యాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషకక్షేమ ధూర్తి శ్రుతాయు రుద్వహ బృహత్సేన క్షేమాగ్ర తీర్థకుహర మతిమ దీశ్వరాదు లనేకులు పుట్టిరి; కాలనేమి కంసుండై పుట్టె; స్త్రీ పుంసరూప ధరుం డైన గుహ్యకుండు శిఖండి యై పుట్టె; మరుద్గణాంశంబునఁ బాండురాజు పుట్టె. 80
క. మరుతులయంశంబునఁ బు | ట్టిరి మువ్వురు వివిధరణపటిష్ఠబలులు సు
స్థిరయశులు ద్రుపదసాత్యకి | విరాట భూపతులు భువనవిశ్రుతచరితుల్‌.
81
క. మాండవ్యుం డను మునివరు | చండతర క్రోధజనిత శాపంబున ధ
ర్ముం డఖిల ధర్మతత్త్వవి | దుం డనఁ విదురుఁ డనఁ బేర్మితో నుదయించెన్‌.
82
క. ప్రియ మొనరఁగ సిద్ధియు బు | ద్ధియు నను దేవతలు వసుమతిని గుంతియు మా
ద్రియు నై పుట్టిరి పాండు | ప్రియపత్నులు నిఖిలజగదభీష్టచరిత్రల్‌.
83
సీ. యమునంశమునఁ బుట్టె నధిపతి ధర్మజుం; | డనిలాంశమునఁ బుట్టె ననిలజుండు;
శక్రాంశమున ధనంజయుఁ డుదయించె; నా | శ్వినుల యంశముల నూర్జితులు నకుల
సహదేవు లనవద్యచరితులు పుట్టిరి; | శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె;
నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్నుఁ | డనఁ బుట్టె ద్రుపదరాజాన్వయమున;
 
ఆ. ననఘ! యిది సురాసురాంశావతారకీ | ర్తనము; దీని వినినఁ దవిలి భక్తిఁ
జదివినను సమస్త జనులకు నఖిలదే | వాసురాదు లిత్తు రభిమతములు.
84
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 85
సీ. అభ్యస్తవేదవేదాంగులు, విధిదత్త | దక్షిణాప్రీణిత ధరణిదేవు,
లనవరతాశ్వమేధావభృథస్నాన | పూతమూర్తులు, కృతపుణ్యు, లహిత
వర్గజయుల్‌, ప్రాప్తవర్గచతుష్టయుల్‌, | సత్త్వాది సద్గుణజన్మనిలయు
లాభరతాది మహామహీపాలకు | లిద్ధయశోర్థు లెందేనిఁ బుట్టి
 
ఆ. రట్టి కౌరవాన్వయంబుఁ బాండవ నృప | రత్నములకు వారిరాశి యైన
దాని వినఁగ వలతుఁ దద్దయుఁ బ్రీతితో | విప్రముఖ్య! నాకు విస్తరింపు.
86
వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 87
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )