ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
కౌరవ వంశ వివరణము (సం. 1-70-10)
చ. నిరుపమధర్మమార్గపరినిష్ఠితు లై మహి యెల్లఁ గాచుచుం
బరఁగిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిఁ జేసి భూ
భరవహనక్షమం బగుచుఁ బౌరవ కౌరవ పాండవాన్వయం
బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్త జగత్ప్రసిద్ధ మై.
88
వ. అది యెట్లనినం: దొల్లి దాక్షాయణి యైన యదితికిఁ గశ్యపునకుం బుట్టిన వివస్వంతునకు వైవస్వతుం డను మనువును యముండును శనైశ్చరుండును యమునయుఁ దపతియు ననం బుట్టి; రందు వైవస్వతుం డను మనువు వలన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రాదు లైన మానవులు పుట్టిరి; మఱియు వానికి వేనప్రముఖు లైన రాజు లేఁబండ్రు పుట్టి వంశకరు లై తమలోన యుద్ధంబు సేసి మడిసిరి; మఱియు నమ్మనుపుత్త్రి యైన యిల యనుదానికి సోమపుత్త్రుం డైన బుధునకుఁ బురూరవుండు పుట్టి చక్రవర్తి యై. 89
క. ఇమ్మహిఁ ద్రయోదశ ద్వీ | పమ్ములు దన శౌర్యశక్తిఁ బాలించి మదాం
ధ్యమ్మున విప్రోత్తమ వి | త్తమ్ములు దా నపహరించె ధనలోభమునన్‌.
90
క. విని దాని నుడుపఁగా బ్ర | హ్మనియుక్తుం డై సనత్కుమారుఁడు మహికిం
జనుదెంచె బ్రహ్మలోకం | బుననుండి యనేక దివ్యమునిసంఘముతోన్‌.
91
వ. పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనం బీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని నున్మత్తుంగా శపియించిన, వాఁడు గంధర్వలోకంబున నూర్వశీ సహితుం డై యుండె; నట్టి పురూరవునకు నూర్వశికి నాయువు ధీమంతుండు నమావసువు దృఢాయువు వనాయువు శతాయువు నను నార్వురు గొడుకులు పుట్టి; రం దాయువునకు స్వర్భానవి యను దానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసు లనంగా నేవురు పుట్టిరి; వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డై. 92
మ. చతురంభోధిపరీతభూవలయమున్‌ సద్వీప సారణ్యస
క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచుం
గ్రతువుల్‌ నూ ఱొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్‌ నిర్జితా
హితుఁ డై యా నహుషుండు దాఁ బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్‌.
93
వ. అట్టి నహుషునకుఁ బ్రియంవద యనుదానికి యతి యయాతి సంయా త్యాయా త్యయతి ధ్రువు లనంగా నార్వురు పుట్టి; రందు యయాతి రా జై యనేకయాగంబులు సేసి శుక్రపుత్త్రి యయిన దేవయానియందు యదుతుర్వసులును వృషపర్వపుత్త్రి యయిన శర్మిష్ఠయందు ద్రుహ్య్వనుపూరులు ననంగా నేవురు కొడుకులం బడసి రాజ్యంబు సేయుచు శుక్రశాపంబున జరాభారపీడితుం డై కొడుకుల నందఱం బిలిచి యి ట్లనియె. 94
సీ. ‘విషయోపభోగాభిలషణ మింకను నాకు | వదలక పెరుఁగుచున్నదియుఁ గాన
నందనులార! మీయం దొక్కరుండు నా | దగు జరాభారంబు దగిలి తాల్చి
తనజవ్వనంబు నా కొనరంగ నెవ్వఁ డీ | నోపు నాతండ సద్వీపసకల
ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు’ | నని యడిగిన నగ్రతనయుఁ డయిన
 
ఆ. యదువుఁ దొట్టి సుతులు ముదిమికి నోపక | తలలు వాంచి యున్న వెలయఁ దండ్రి
పనుపుఁ జేసి ముదిమి గొని జవ్వనం బిచ్చెఁ | బూరుఁ డనుసుతుండు భూరికీర్తి.
95
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 96
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )