ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
యయాతి మహారాజు చరిత్రము (సం. 1-71-3)
తే. వర్ణధర్మముల్‌ గాచుచు వసుధ యెల్ల | ననఘ చరితుఁ డై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ! భార్గవపుత్త్రి యైన | దేవయానిని దా నెట్లు దేవిఁ జేసె?
97
తే. విపులతేజంబునను దపోవీర్యమునను | జగదనుగ్రహనిగ్రహశక్తియుక్తుఁ
డయినయట్టి యయాతికి నలిగి యేమి | కారణంబున శాపంబు కావ్యుఁ డిచ్చె?
98
వ. మఱియు నస్మద్వంశకరుం డయిన యయాతిచరితంబు విన వలతుం జెప్పు మని యడిగిన వానికి వైశంపాయనుం డి ట్లనియె. 99
క. మనుజాధిప! వృషపర్వుం | డను దానవపతికి శుక్రుఁ డా చార్యుం డై
యనిమిషవిరోధులకుఁ బ్రియ | మొనరించుచు వివిధ విధినయోపాయములన్‌.
100
క. దేవాసుర రణమున గత | జీవితు లగు నసురవరులఁ జెచ్చెర మృతసం
జీవని యను విద్యఁ బున | ర్జీవులఁగాఁ బ్రతిదినంబుఁ జేయుచు నుండెన్‌.
101
వ. దాని నెఱింగి దేవతలెల్ల నతి భీతు లై యసురుల నోర్వ నోపక శుక్రువలన మృతసంజీవని వడసి తేనోపునట్టి మహాసత్త్వుం డెవ్వం డగునో యని విచారించి బృహస్పతిపుత్త్రుండయిన కచునికడకుం జని యిట్లనిరి. 102
క. పోరను మృతసంజీవని | కారణమున నిహతు లయ్యుఁ గా రసురవరుల్‌
వారల నోర్వఁగ మన కతి | భారము దుర్వారవీర్యబలయుతు లగుటన్‌.
103
క. మనపక్షంబున వా ర | ద్దనుజులచే నిహతు లయ్యుఁ దగ మృతసంజీ
వని లేమిఁ జేసి యమసా | దనమున కరుగుదురు వీర్యదర్పితు లయ్యున్‌.
104
క. కావున మృతసంజీవనిఁ | దేవలయును శుక్రువలన ధృతిఁ బడసి తప
శ్రీవ్శిభవ! దాని బలమునఁ | గావంగావలయు సురనికాయబలంబున్‌.
105
క. బాలుండవు, నియమవ్రత | శీలుండవు, నిన్నుఁ బ్రీతిఁ జేకొని, తద్వి
ద్యాలలనాదానముఁ గరు | ణాలయుఁ డై చేయు నమ్మహాముని నీకున్‌.
106
వ. ‘దుహితృస్నేహంబునం జేసి యద్దేవయాని పలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున దాని చిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీ కిష్టసిద్ధి యగు’ నని దేవతలు ప్రార్థించి పంచినం, గచుండును దేవహితార్థంబు వృషపర్వుపురంబునకుం జని యచ్చట వేదాధ్యయనశీలుం డయి సకలదైత్యదానవ గణోపాధ్యాయుం డయి యున్న శుక్రుం గని నమస్కరించి యి ట్లనియె. 107
క. ఏను గచుం డనువాఁడ, మ | హానియమసమన్వితుఁడ, బృహస్పతిసుతుఁడన్‌,
మానుగ వచ్చితి నీకును | భానునిభా! శిష్యవృత్తిఁ బని సేయంగన్‌.
108
వ. అనిన నమ్మునికుమారుని సుకుమారత్వంబును, వినయ ప్రియవచన మృదుమధురత్వంబును, ననవరత నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వంబునుం జూచి శుక్రం డతిస్నేహంబున ‘వీనిం బూజించిన బృహస్పతిం బూజించిన యట్ల’ యని యభ్యాగతపూజల వాని సంతుష్టుంగాఁ జేసి శిష్యుంగాఁ జేకొని యున్నంత, నక్కచుండు. 109
సీ. పని యేమి పంచినఁ బదపడి చేసెద | ననక తన్‌ బంచిన యాక్షణంబ
చేయుచు నిజగురు చిత్తవృత్తికిఁ గడు | ననుకూలుఁ డై వినయంబుతోడ
మనమునఁ జెయ్వుల మాటలభక్తి నే | కాకారుఁ డై, మఱి యంతకంటె
దేవయానికి సువిధేయుఁ డై ప్రియహిత | భాషణములఁ బుష్పఫలవిశేష
 
ఆ. దానములను సంతతప్రీతిఁ జేయుచు | నివ్విధమునఁ బెక్కులేండ్లు నిష్ఠ
గురుని గురుతనూజఁ గొలిచి యయ్యిరువుర | నెమ్మి వడసెఁ దనదునేర్పుపేర్మి.
110
వ. ఇట్లు గురుశుశ్రూషాకౌశలంబునఁ గచుండు శుక్రునకుం బ్రియశిష్యుం డై యున్న నెఱింగి, దానవులు సహింపనోపక బృహస్పతితోడి యలుకనక్కచు నొక్కనాఁడు హోమధేనువులం గాచుచు వనంబున నేకతంబ యున్న వాని వధియించి, విశాల సాలస్కంధంబున బంధించి చని; రంత నాదిత్యుం డస్తగిరి శిఖరగతుం డగుడు మగుడి హోమధేనువు లింటికి వచ్చిన, వానితోడన కచుండు రాకున్న, దేవయాని తనమనంబున మలమల మఱుంగుచుం బోయి తండ్రి కి ట్లనియె. 111
ఉ. వాఁడిమయూఖముల్‌ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె, ధేనువుల్‌
నేఁ డిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్‌ భవదగ్నిహోత్రముల్‌
పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ, బ్రొద్దును బోయెఁ, గచుండు నేనియున్‌
రాఁడు, వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో!
112
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )