ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
కచుండు దానవహతుం డై మృతసంజీవనిచే బ్రదుకుట (సం. 1-71-30)
వ. అనిన విని శుక్రుండు దనదివ్యదృష్టి నసురవ్యాపాదితుం డైన కచుం గని, వానిం దోడ్కొని తేర మృతసంజీవనిం బంచిన, నదియును బ్రసాదం బని యతి త్వరితగతిం జని, విగతజీవుం డయిన కచు నప్పుడ సంజీవితుం జేసి తోడ్కొని వచ్చినం జూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లి యున్నంతఁ, గొన్నిదినంబులకు వెండియు నొక్కనాఁడు. 113
క. అడవికిఁ బువ్వులు దేరఁగ | వడి నరిగినకచునిఁ జంపి, వారక దనుజుల్‌
పొడవు సెడఁ గాల్చి, సురతోఁ | దడయక యబ్బూది శుక్రుఁ ద్రావించి రొగిన్‌.
114
వ. శుక్రుండును సురాపానమోహితుం డయి యున్నఁ, దొల్లింటియట్ల దేవయాని గచుం గానక దుఃఖిత యై ‘నేఁడును గచుండు రాక మసలె; నసురులచేత నిహతుం డయ్యెఁ గావలయు’ నని శోకించిన దానిం జూచి శుక్రుం డి ట్లనియె. 115
క. వగవక సంజీవని పెం | పగణిత గర్వమున నసురు లా కచుతోడం
బగఁ గొని చంపెద; రాతఁడు | సుగతికిఁ జనుఁగాక; యేల శోకింపంగన్‌?
116
వ. అనిన దేవయాని యి ట్లనియె. 117
మ. మతిలోకోత్తరుఁ డైన యంగిరసుమన్మం, డాశ్రితుం, డాబృహ
స్పతికింబుత్త్రుఁడు, మీకు శిష్యుడు, సురూప బ్రహ్మచర్యాశ్రమ
వ్రత సంపన్నుఁ, డకారణంబ దనుజవ్యాపాదితుం డైన న
చ్యుతధర్మజ్ఞ! మహాత్మ! యక్కచున కే శోకింప కె ట్లుండుదున్‌?
118
వ. ‘వానిం జూచి కాని కుడువనొల్ల’ నని దేవయాని యేడ్చుచున్నఁ, బెద్దయుంబ్రొద్దునకుఁ బ్రసన్నుం డై శుక్రుండు దనయోగదృష్టిం జూచి లోకాలోకపర్యంతభువనాంతరంబునఁ గచుం గానక సురాసమ్మిశ్ర భస్మ మయుం డై తనయుదరంబున నున్న యక్కచుం గని, సుర సేసిన దోషంబును, నసురులు సేసిన యపకారంబును నెఱింగి. 119
ఆ. మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్‌ | పరఁగఁ బెక్కుసేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణ మాత్రన | చెఱుచు మద్యసేవ సేయ నగునె?
120
క. భూసురు లాదిగఁ గల జను | లీసుర సేవించిరేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితు లగుదురు; | చేసితి మర్యాద; దీనిఁ జేకొనుఁడు జనుల్‌.
121
వ. అని శుక్రుండు సురాపానంబు మహాపాతకంబుగా శపియించి, తనయుదరంబున నున్న కచు నప్పుడ సంజీవితుం జేసిన, నంద యుండి కచుండు శుక్రున కి ట్లనియె. 122
క. తనువును జీవము సత్త్వం | బును బడసితి నీ ప్రసాదమున; నీయుదరం
బనఘా! వెలువడు మార్గం | బొనరింపుము నాకు భూసురోత్తమ! దయతోన్‌.
123
వ. అనిన ‘నాయుదరంబుభేదిల్లినంగాని యిమ్మునికుమారుండు వెలువడ నేరం; డుదరభేదనంబున మూర్ఛితుండ నయిన నన్ను సంజీవితుంజేయ వలయు’ నని శుక్రుండు కచునకు సంజీవని నుపదేశించిన. 124
క. ఉదరభిదాముఖమున న | భ్యుదయముతో నిర్గమించె బుధనుతుఁడు కచుం
డుదయాద్రిదరీముఖమున | నుదితుం డగు పూర్ణహిమమయూఖుఁడ పోలెన్‌.
125
వ. అంత. 126
తే. విగతజీవుఁ డై పడియున్న వేదమూర్తి | యతనిచేత సంజీవితుఁ డై వెలింగె
దనుజమంత్రి యుచ్చారణదక్షుచేత | నభిహితం బగు శబ్దంబునట్ల పోలె.
127
వ. ఇ ట్లతిప్రయత్నంబునఁ గచుండు శుక్రువలన సంజీవని వడసి పెద్దకాలం బుండి, యొక్కనాడు శుక్రుచేత ననుజ్ఞాతుం డయి దేవలోకంబునకుం బోవుచుండి, దేవయాని కతిప్రియపూర్వకంబునం జెప్పిన, నదియును దద్వియోగదుఃఖిత యై కచున కి ట్లనియె. 128
ఉ. ‘నీవును బ్రహ్మచారివి, వినీతుఁడ, వేనును గన్యకన్‌; మహీ
దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్‌
భావజశక్తి నైనయది; పన్నుగ నన్నుఁ బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ; జేయుము నాకుఁ బ్రియంబు’ నావుడున్‌.
129
క. ఆ కచుఁ డత్యంతవిషా | దాకులుఁ డై ‘లోకనింద్య మగు నర్థము నీ
వాకునకుఁ దెచ్చు టుచితమె? | నాకు సహోదరివి నీవు నాచిత్తమునన్‌.’
130
క. గురులకు శిష్యులు పుత్త్రులు | పరమార్థమ లోకధర్మపథ మిది; దీనిం
బరికింపక యీ పలుకులు | తరుణీ! గురుపుత్త్రి! నీకుఁ దగునే పలుకన్‌.
131
వ. అనిన నా కచునకు దేవయాని కరం బలిగి ‘నీవు నా మనోరథంబు విఫలంబుగాఁ జేసిన వాఁడవు; నీకు సంజీవని పని సేయకుండెడు’ మని శాపం బిచ్చినఁ, గచుం ‘డేను ధర్మపథంబుఁ దప్పనివాఁడను; నీ వచనంబున నాకు సంజీవని పనిచేయదయ్యెనేనియు నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బనిసేయుంగాక; మఱి నీవు ధర్మ విరోధంబు దలంచితివిగావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గాకుండెడు’ మని దేవయానికిఁ బ్రతిశాపం బిచ్చి తత్‌క్షణంబ. 132
క. దేవగురునందనుం డమ | రావాసంబునకు నరిగి యమరులకును సం
జీవని యుపదేశించి, సు | ధీవినుతుఁ డొనర్చుచుండె దేవహితంబుల్‌.
133
వ. ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ఠయను కన్యక యొక్కనాడు కన్యకాసహస్రపరివృతయయి దేవయానీ సహితంబు వనంబునకుం జని, యొక్క సరోవర తీరంబునఁ దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడ లాడుచున్న, నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కలిసిన నొండొరులం గడవఁ గొలను వెలువడు సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠ గట్టిన, మఱి దాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యి ట్లనియె. 134
క. లోకోత్తరచరితుం డగు | నా కావ్యుతనూజ; నీకు నారాధిత; నేఁ
బ్రాకట భూసురకన్యక; | నీకట్టిన మైల గట్ట నేర్తునె చెపుమా.
135
వ. అనిన శర్మిష్ఠ యి ట్లనియె. 136
క. మా యయ్యకుఁ బాయక పని | సేయుచు దీవించి ప్రియము సెప్పుచు నుండున్‌
మీయయ్య; వెండి మహిమలు | నా యొద్దన పలుక నీకు నానయు లేదే?
137
వ. ‘నాకట్టిన పుట్టంబు నీకుం గట్టంగాదు గా కేమి’ యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి, శర్మిష్ఠ కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజనివాసంబున నుండె; నంత. 138
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )