ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
యయాతి నూతంబడిన దేవయాని నుద్ధ్దరించుట (సం. 1-73-14)
ఉ. ఆనహుషాత్మజుం డగు యయాతి యధిజ్యధనుస్సహాయుఁ డై
యానతశాత్రవుండు మృగయారసలోలనిబద్ధబుద్ధిఁ ద
త్కానన మెల్లఁ గ్రుమ్మఱి నికామధృతశ్రముఁ డేగుదెంచె నం
దానలినాక్షి యున్న విపినాంతర కూపతటంబునొద్దకున్‌.
139
సీ. చనుదెంచి, యమ్మహాజనపతి జల మపే | క్షించి, యచ్చో విశ్రమించి, చూచి,
తత్కూపమున విలసత్కూలఘనవల్లి | యన్నిష్టసఖి నూఁదియున్న దాని,
గురుకుచయుగముపైఁ బరువడిఁ దొరఁగెడు | కన్నీరు పూరించుచున్న దానిఁ,
దనసమీపమునకు జనుల యాగమనంబు | పన్నుగాఁ గోరుచునున్న దాని,
 
ఆ. వరుణదేవుతోడఁ గర మల్గి జలనివా | సంబు విడిచి భూస్థలంబువలని
కరుగుదేర నున్న వరుణేంద్రుదేవియ | పోనిదాని దేవయానిఁ గనియె.
140
వ. కని ‘నీ వెవ్వరిదాన? వి ట్లేల యేకతంబ యివ్విపినాంతరకూపంబున నున్న దాన?’ వనిన విని దేవయాని యెప్పుడుం దమ విహరించుచున్న యవ్వనంబునకు మృగయావినోదార్థంబు యయాతి వచ్చుటంజేసి తొల్లియుఁజూచినది కావున నాతని నెఱింగి యి ట్లనియె. 141
తరలము. అమరసన్నిభ! యేను ఘోరసురాసురాహవభూమి న
య్యమరవీరులచేత మర్దితు లైన దానవులన్‌ గత
భ్రములఁగాఁ దన విద్యపెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య
త్యమితశక్తిమెయిన్‌ వెలింగినయట్టి భార్గవుకూఁతురన్‌.
142
వ. ‘దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్నదానను; న న్నుద్ధరించి రక్షింపు’ మనిన నవ్విప్రకన్యకయందుఁ దద్దయు దయాళుం డై. 143
చ. జలధివిలోలవీచి విలసత్కలకాంచి సమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునం దదున్నమ
ద్గళదురఘర్మవారికణక్రమకరాబ్జము వట్టి నూతిలో
వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్‌.
144
వ. ఇట్లు దేవయాని నుద్ధరించి నిజపురంబున కరిగె; నిట దేవయానియు శర్మిష్ఠసేసిన యెగ్గువలన విముక్తయయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణిక యను పరిచారికం గని ‘యేను వృషపర్వుపురంబు సొర నొల్ల; శర్మిష్ఠ చేత నా పడిన యవమానంబు మదీయ జనకున కెఱింగింపు’ మని పంచిన, నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతం బంతయు శుక్రునకుం జెప్పిన, శుక్రుండును నాక్షణంబ వచ్చి కోప ఘూర్ణిత బాష్ప పూరితనయన యై యున్న దేవయానిం గని యి ట్లనియె. 145
క. అనుపమ నియమాన్వితు లై | యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే
సినవారికంటె నక్రో | ధనుఁడ గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్‌.
146
క. అలిగిన నలుగక, యెగ్గులు | పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్‌
వలుకక, బన్నము వడి యెడఁ | దలఁపక యు న్నతఁడె చూవె ధర్మజ్ఞుఁ డిలన్‌.
147
వ. ‘కావున బుద్ధి గలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు; శర్మిష్ఠ రాచకూఁతురు; గొండుక యది; దానితోడి దేమి ర’ మ్మనిన దేవయాని యి ట్లనియె. 148
క. కడు ననురక్తియు నేర్పును | గడఁకయు, గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్‌
నొడివెడు వివేకశూన్యుల | కడ నుండెడు నంతకంటెఁ గష్టము గలదే.
149
వ. ‘ఈవృషపర్వుపురం బేను జొరనొల్ల; నెట యేనియుం బోదు’ ననిన శుక్రుండు ‘నాకు నీవ గతివి. నీతోడ నేనును వత్తు’ ననుచుఁగూఁతుం బట్టువఱుచుచున్నంత, నంతయుఁజారులవలన నెఱింగి వృషపర్వుండు శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి యి ట్లనియె. 150
ఉ. దేవతలన్‌ జయించుచు నతిస్థిరసంపదలం ద్వదీయవి
ద్యావిభవంబు పెంపునన దానవు లుద్ధతు లైరి; కానినాఁ
డీ వనరాశిలోఁ జొరరె యింతకు నంతకకోపు లైన య
ద్దేవపతాకినీపతుల దివ్యనిశాతమహాయుధాహతిన్‌.
151
క. వారణ ఘోటక భాండా | గారంబులు మొదలుగాఁగఁ గల ధనములతో
సూరినుత! యిందఱము నీ | వారకములు గాఁగ మమ్ము వగవుము బుద్ధిన్‌.
152
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )