ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
శర్మిష్ఠ దాసి యై దేవయానిం గొలుచుట (సం. 1-75-13)
వ. ‘ఈ దేవయాని కెద్ది యిష్టంబు దానిన యిత్తు, నడుగు’ మనిన దేవయాని సంతసిల్లి ‘యట్లేని శర్మిష్ఠ గన్యకా సహస్రంబుతో నాకు దాసి గావలయు, నిదియ నా కిష్టంబు; దీనిన యిచ్చునది’ యనిన వృషపర్వుం డప్పు డక్కూఁతు రావించి, కన్యకాసహస్రంబుతో దేవయానికి దాసిగా నిచ్చి శుక్రునకు మనఃప్రియంబు సేసిన, శర్మిష్ఠయు నగ్గురువచనంబునఁ గన్యకాసహస్రంబుతో నిత్యంబును దేవయానిం గొలుచుచుండె; నంత నొక్కనాఁడు. 153
క. వనకేళీ కౌతుకమునఁ | జనియెను శర్మిష్ఠఁ దొట్టి సఖులెల్ల ముదం
బునఁ గొలిచిరాఁగ విభవము | దన కమరఁగ దేవయాని తద్వనమునకున్‌.
154
వ. ఇ ట్లరిగి యవ్వనంబునఁ గన్యకలుం దానును బుష్పాపచయంబు సేయుచు, విమలజలప్రవాహ విలసితం బైన యొక్కసెలయేటి కెలన, నవవికచ కుసుమ సుకుమార కోరక నికర భరిత సహకార కురవక వకు ళాశోక తమాల సాల చ్ఛాయాశీతల సికతాతలంబున నిష్టవినోదంబుల నున్న యవసరంబున. 155
సీ. అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ | కుంకుమ చందన పంకములయు
వారివ ధమ్మిల్లభారావకలిత ది | వ్యామోద నవపుష్పదామములయు
వారివ ముఖ సకర్పూరతాంబూలాది | వాసిత సురభి నిశ్శ్వాసములయు
వారివ పరిధాన చారుధూపములయు | విలసిత సౌరభావలులు దాల్చి
 
తే. యనిలుఁ డను దూత వోయి తోడ్కొనుచు వచ్చె | దేవయానిపాలికి మృగతృష్ణఁ జేసి
కాననంబునఁ గ్రుమ్మరువాని వీరు | నతిపరిశ్రాంతుఁ డైన యయాతి నంత.
156
క. తరళనయనాబ్జదళములు | నెరయఁగఁ బై మున్న చల్లి నృపసుతుఁ బూజిం
చిరి నవకుసుమమయాలం | కరణ విశేషముల నచటి కాంతలు ప్రీతిన్‌.
157
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )