ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
యయాతిమహారాజు దేవయానిని వివాహం బగుట (సం. 1-76-8)
వ. అయ్యయాతియుఁ దత్ప్రదేశంబున సుఖోపవిష్టుం డై దేవయానిం దొల్లి యెఱింగినవాఁ డై యతిశయరూప లావణ్యగుణసుందరి యయిన శర్మిష్ఠ నెఱుంగ వేఁడి, ‘మీ రెవ్వరివారలు మీకులగోత్ర నామంబు లెఱుంగ వలతుం జెప్పుం’ డనిన నారాజునకు దేవయాని యి ట్లనియె. 158
తే. నన్ను మున్న యెఱుంగు; దిన్నాతి నాకు | దాసి, వృషపర్వుఁ డను మహాదానవేంద్రు
కన్య; నాయొద్ద నెప్పుడుఁ గదలకుండు | ననఘ! మఱి దీని శర్మిష్ఠ యండ్రు జనులు.
159
ఉ. నిగ్రహ మేది నన్నుఁ దరణిప్రభ! కూపము వెల్వరించునాఁ
డుగ్రమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణిఁ జేసి భూ
పాగ్రణి! నాదు దక్షిణకరాగ్రము వట్టితి కాన మున్న పా
ణిగ్రహణంబు సేసి; తది నీయెడ విస్మృతిఁ బొందఁ బాడియే.
160
ఉ. ‘నన్ను వివాహ మై నహుషనందన! యీలలితాంగిఁ దొట్టి యీ
కన్నియలందఱున్‌ దివిజకన్యలతో నెన యైనవారు నీ
కున్నతిఁ బ్రీతి సేయఁగ నృపోత్తమ! వాసవుఁ బోలి లీలతో
నిన్నరలోకభోగము లనేకము లందుము నీవు’ నావుడున్‌.
161
వ. ‘క్షత్త్రియకన్యకల బ్రాహ్మణులు వివాహం బగుదురు గాక; యధర్మోత్తరంబుగా క్షత్త్రియులు బ్రాహ్మణకన్యకల వివాహం బగుదురే? నీపలుకులు ధర్మ విరుద్ధంబులు; మఱియు సర్వవర్ణాశ్రమధర్మంబులు సంకరంబులు గాకుండ రక్షించుచున్న యేన యిట్టి యధర్మంబున కొడంబడితినేని జగత్ప్రవృత్తి విపరీతం బగు’ ననిన నయ్యయాతికి దేవయాని యి ట్లనియె. 162
క. ‘వెలయఁగ ధర్మాధర్మం | బులు నడపుచు నిఖిలలోకపూజ్యుండై ని
ర్మలుఁ డగు శుక్రుఁడు పంచిన | నలఘుభుజా! నను వివాహ మగుదే?’ యనినన్‌.
163
వ. ‘అమ్మహాముని వచ్చి యిది ధర్మవిరుద్ధంబు గా దని చెప్పెనేని నిన్ను వివాహం బగుదు’ నని యయాతి యొడంబడిన దేవయాని యప్పుడ శుక్రు రావించిన. 164
క. తనదివ్యతేజమున న | వ్వన మెల్ల వెలుంగుచుండ వచ్చెను భృగునం
దనుఁడు నిజనందనకుఁ బ్రియ | మొనరింపఁగఁదలఁచి దానియొద్దకుఁ బ్రీతిన్‌.
165
క. అతిసంభ్రమమున నవనీ | పతి విహితోత్థానుఁ డై తపశ్శక్తిఁ బ్రజా
పతినిభుఁ డగు భార్గవునకు | నతిభక్తిం బ్రణమితోత్తమాంగుం డయ్యెన్‌.
166
వ. మఱియు దేవయానియు శర్మిష్ఠయుం గన్యకాసహస్రంబును నత్యంతభక్తితోఁ గ్రమంబున నమస్కరించి; రంత దేవయాని శుక్రున కి ట్లనియె. 167
ఆ. ఇన్నరేంద్రుచేత మున్న గృహీత మై | యున్న నాకరంబు గ్రన్న నింక
నొరున కర్హ మగునె పరిణయ విషయ మై | ధరఁ బరిగ్రహింపఁ బరమమూర్తి!.
168
వ. ‘కావున నాకు నీ జన్మంబునఁ బతి యయాతియ; యితండును భవద్వచనంబున నన్ను వివాహం బగుదు ననియె; నిందు ధర్మవిరోధంబు లేకుండు నట్లుగాఁబ్రసాదింపవలయు’ ననిన శుక్రుండు గరుణించి ‘యయాతికి నీకును నయిన యీ వివాహంబునం దపక్రమదోషంబు లేకుండెడు’ మని వరం బిచ్చి యయ్యిరువురకుం బరమోత్సవంబున వివాహంబు సేసి, శర్మిష్ఠం జూపి ‘యిది వృషపర్వుని కూఁతురు; దీనికిఁ బ్రియంబున నన్నపాన భూషణాచ్ఛాదన మాల్యానులేపనాదుల సంతోషంబు సేయునది; శయనవిషయంబునఁ బరిహరించు నది’ యని పంచి, కూఁతు నల్లునిం బూజించిన; నయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్ఠను గన్యకా సహస్రంబును దోడ్కొని నిజపురంబునకుం జని యంతఃపురరమ్యహర్మ్యతలంబున దేవయాని నునిచి, తదనుమతంబున నశోకవనికాసమీపంబున నొక్క గృహంబునందుఁ గన్యకాసహస్రంబుతో శర్మిష్ఠ నునిచి, దేవయానియందు సుఖోపభోగపరుం డై యున్నఁ; గొండొకకాలంబునకు దేవయానికి యదుతుర్వసు లను కొడుకులు పుట్టి; రంత శర్మిష్ఠ సంప్రాప్తయౌవనయు ఋతుమతియు నై యాత్మగతంబున. 169
చ. అసదృశయౌవనం బిది యనన్యధనం బగు నొక్కొ! నాకు ని
క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గవల్లరీ
కుసుమ సముద్గమం బగు నొకో! పతిలాభము లేమిఁ జేసి; యొ
ప్పెసఁగఁగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో!
170
క. పతిఁ బడసి సుతులఁ బడయఁగ | నతివలు గోరుదురు; గోరినట్టుల తనకుం
బతిఁ బడసి సుతులఁ బడసెను; | సతు లీభార్గవికి భాగ్యసంపద నెనయే.
171
తరువోజ. ఈ రాజునంద నా హృదయంబు దవిలి యెప్పుడు నుండు; న న్నీతఁడు గరము
కారుణ్యమునఁ బ్రీతిగలయట్లు సూచుఁ; గమలాక్షి భార్గవకన్య దా నెట్లు
గోరి యీతనిఁ దనకును బతిఁ జేసికొనియె నటుల యేను గోరి లోకైక
భారధురంధరుఁ బరహితు ధర్మపరు నహుషాత్మజుఁ బతిఁ జేసికొందు.
172
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )