ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
యయాతి శర్మిష్ఠకుఁ బుత్రదానంబు సేయుట (సం. 1-77-10)
వ. అని విచారించుచున్న యవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితం బైన య ట్లొక్కనాఁడు యయాతి యశోకవని కాలోకనతత్పరుండైవచ్చువాఁ డేకతంబ యున్న శర్మిష్ఠం గనిన, నదియును సంభ్రమ వినయావనత యై తనవలన నమ్మహీపతి ప్రసన్నచిత్తుం డగుట యెఱింగి కరకమలంబులు మొగిచి యి ట్లనియె. 173
ఉ. నీలగళోపమాన! కమనీయగుణోన్నతిఁ జెప్పఁ జాలు న
న్నేలిన దేవయానికి నరేశ్వర! భర్తవు గాన నాకునుం
బోలఁగ భర్త వీవ; యిది భూనుత! ధర్మపథంబు; నిక్కువం;
బాలును దాసియున్‌ సుతుఁడు నన్నవి వాయనిధర్మముల్‌ మహిన్‌.
174
వ. ‘అద్దేవయానిం బరిగ్రహించినప్పుడ తద్ధనం బగుట నేనును భవత్పరిగ్రహంబ కావున నన్నుం గరుణించి నాకు ఋతుకాలోచితంబుఁ బ్రసాదింపవలయు’ ననిన నయ్యయాతి యి ట్లనియె. 175
క. లలితాంగి! శయన మొక్కఁడు | వెలిగా రుచిరాన్నపాన వివిధాభరణా
దుల శర్మిష్ఠకు నిష్టము | సొలయక చేయు మని నన్ను శుక్రుఁడు పంచెన్‌.
176
వ. ‘ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి; నెట్లు బొంకనేర్తు’ ననిన శర్మిష్ఠ యి ట్లనియె. 177
క. చను బొంకఁగఁ బ్రాణాత్యయ | మున, సర్వధనాపహరణమున, వధ గావ
చ్చిన విప్రార్థమున, వధూ | జన సంగమమున, వివాహసమయములందున్‌.
178
వ. ‘ఈ యేనింటియందు నసత్యదోషంబు లేదని మునివచనప్రమాణంబు గలదు; నీవు వివాహసమయంబున నొడంబడితివి కావున నసత్య దోషంబునం బొంద’ వనిన నయ్యయాతి యొడంబడి శర్మిష్ఠకు నభిమతం బొనరించె; నదియుఁ దత్సమాగ మంబున గర్భిణి యై కొడుకుం గనిన విస్మయపడి దేవయాని దానికడకు వచ్చి యి ట్లనియె. 179
తే. బాల వయ్యు నత్యుత్తమశీలవినయ | గౌరవాన్విత వై నిర్వికారవృత్తి
నున్న నీ కున్నయునికిన సన్నుతాంగి! | సుతుఁడు పుట్టుట యిది గడుఁజోద్య మయ్యె.
180
వ. అది యె ట్లని యడిగిన శర్మిష్ఠ లజ్జావనతవదన యయి యి ట్లను; ‘నెందేనినుండి యొక్కమహాముని నిఖిల వేదవేదాంగపారగుండు వచ్చి ఋతుమతినై యున్న నన్నుం జూచి నాకుఁ బుత్త్రోత్పత్తిఁ బ్రసాదించె’ ననిన విని దేవయాని నిజనివాసంబునకుం జనియె; శర్మిష్ఠయు నయ్యయాతివలనఁ గ్రమంబున ద్రుహ్వ్యను పూరు లనంగా మువ్వురు గొడుకులం బడసి యున్నంత, నొక్కనాఁడు. 181
సీ. కరువలిచేఁ దూలుకపిల జటాలియ | కరమొప్పు శిఖలుగాఁ గనకరత్న
మయజాల భూషణామలదేహదీప్తుల | తేజంబుగాఁ బ్రవిదీప్యమాన
యాగశతంబుల నర్చితం బైన మూఁ | డగ్నులు ప్రత్యక్ష మైన యట్లు
దనమ్రోల శర్మిష్ఠతనయులు గ్రీడించు | చుండంగ నున్న యయ్యుర్విఱేని
 
ఆ. కడకు నేఁగుదెంచెఁ గన్యలు దనుజాధి | రాజసుతయుఁ దోడరాఁగ నొప్పి
దేవి దేవయాని దేవేంద్రుదేవియ | పోలె నెంతయును విభూతి మెఱసి.
182
వ. ఇ ట్లరుగుదెంచి యధికతేజస్వులయి యయాతి ప్రతిబింబంబులుం బోని యబ్బాలకులం జూచి’ యిక్కుమారు లెక్కడి వా? రెవ్వరికొడుకు? లని యయాతి నడిగి యలబ్ధప్రతివచనయై ‘మీ తల్లిదండ్రులెవ్వ’ రని యక్కుమారుల నడిగిన. 183
క. తరుణప్రదేశినులు మా | సరముగ వారలు యయాతి శర్మిష్ఠలఁ జూ
పిరి తండ్రియుఁ దల్లియు నని | కర మనురాగిల్లెఁ గన్యకానివహంబున్‌.
184
వ. ఇట్లు ద న్నెఱుంగకుండ యయాతి శర్మిష్ఠవలన లబ్ధసంతానుం డగుట యప్పు డెఱింగి. 185
చ. పతివిహితానురాగమున భార్గవుపుత్త్రి యయాతిచేత వం
చిత యయి, వాఁడు దానవికిఁ జేసిన నెయ్య మెఱింగి, కోపదుః
ఖిత యయి, తండ్రిపాలి కతిఖేదమునం జని, దీర్ఘనేత్రని
ర్గతజలధారలం గడిగెఁ గాంత తదీయ పదాబ్జయుగ్మమున్‌.
186
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )