ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
శుక్రుఁడు యయాతికి శాపం బిచ్చుట (సం. 1-78-24)
వ. అయ్యయాతియు దానిం బట్టువఱుచుచుఁ డోడన చని శుక్రుం గని నమస్కరించి యున్న నద్దేవయాని గద్గద వచన యై ‘యధర్మంబున ధర్మంబు గీడ్పఱిచి యిమ్మహీశుం డాసురంబున నాసురియం దనురక్తుం డై పుత్త్రత్రయంబు వడసి నాకవమానంబు సేసె’ ననిన విని శుక్రుండు యయాతి కలిగి ‘నీవు యౌవనగర్వంబున రాగాంధుండ వై నాకూఁతున కప్రియంబు సేసితివి కావున జరాభారపీడితుండవు గ’ మ్మని శాపం బిచ్చిన నయ్యయాతి శుక్రున కి ట్లనియె. 187
క. ఋతుమతి యై పుత్త్రార్థము | పతిఁ గోరిన భార్యయందుఁ బ్రతికూలుం డై
ఋతువిఫలత్వము సేసిన | యతనికి మఱి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్‌.
188
క. దానికి భీతుఁడ నై య | మ్మానవతీ ప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడసితి నెదలో | దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా!
189
వ. ‘ఏ నిద్ద్దేవయానియందు విషయోపభోగతృప్తుండఁ గాను, జరాభారంబుఁ దాల్పనోప’ నని ప్రార్థించిన విని వానికి శుక్రుండు గరుణించి ‘యట్లేని నీముదిమి నీకొడుకులయం దొక్కరునిపయిం బెట్టి వానిజవ్వనంబు నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము; నీవు విషయోపభోగ తృప్తుండ వైన మఱి నీముదిమి నీవ తాల్చి, వాని జవ్వనంబు వానికి నిచ్చునది; నీ ముదిమిఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును, వంశకర్తయు నగు’ ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీసహితుం డై తనపురంబునకు వచ్చి శుక్రుశాపంబున జరాభారంబుఁ దాల్చిన, వానికి. 190
క. తల వడఁకఁ దొడఁగె, నింద్రియ | ముల గర్వ మడంగె, నంగములు వదలె, వళీ
పలితంబు లయ్యె, వగరును | దలయేరును నుక్కిసయును దరికొనుదెంచెన్‌.
191
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )