ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
యయాతి యదుప్రముఖులకు శాపం బిచ్చుట (సం. 1-79-1)
వ. ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి గొడుకులనెల్లరావించి ‘నాకు విషయసుఖతృప్తి లేకున్నయది గావున మీయందొక్కరుండు నా ముదిమి గొని తన జవ్వనంబు నా కిచ్చునది’ యనిన విని యదు తుర్వసు ద్రుహ్వ్యనులు దండ్రి కి ట్లనిరి. 192
ఆ. తగిలి జరయు రుజయు దైవవశంబున | నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యారెంటిఁ జే | కొందురయ్య యెట్టి కుమతు లైన.
193
క. నరలు గల కాము నైనను | దరుణులు రోయుదురు డాయ; ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా | పరిభూతి నభీష్టభోగబాహ్యుఁడ కాఁడే.
194
వ. అని యొడంబడ కున్న నలిగి యయాతి ‘యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాఁ, దుర్వసు వంశంబునవారు ధర్మాధర్మవివేకశూన్యు లై సంకీర్ణవర్ణ కిరాతులకు రాజులుగా, ద్రుహ్యువంశంబునవారు డుపప్లవసంతార్యం బైన దేశంబునకు రాజులుగా, జరాదూషకుం డగుట ననువంశంబునవారు ముదియు నంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగు వారునుంగా శాపంబిచ్చి, యానలువురకుం గొండుక వాని శర్మిష్ఠాపుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన, వాఁడు దండ్రి కోరినయట్ల చేసిన నవయౌవనుం డై యయాతి యభిమతసుఖంబులు సహస్రవర్షంబు లనుభవించి తృప్తుం డై, పూరుజవ్వనంబు వానిక యిచ్చి, తన జరాభారంబుఁ దాన తాల్చి నిజాజ్ఞావిధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్త్రాది వర్ణముఖ్యుల నెల్ల రావించి మంత్రిపురోహితసామంత పౌరజన సమక్షంబున సకలక్షోణీ చక్రసామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుం జేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి. 195
మ. అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ! నీయగ్రసం
భవుఁ డత్యున్నతశక్తియుక్తుఁడు మహీభారప్రగల్భుండు భా
ర్గవదౌహిత్రుఁడు పాత్రుఁ డీయదుఁడు లోకఖ్యాతుఁ డుండంగ నీ
భువనేశత్వభరంబుఁ బూన్పఁ దగునే పూరున్‌ జఘన్యాత్మజున్‌.
196
వ. అనిన వారల కయ్యయాతి యి ట్లనియె. 197
క. యదుఁ డగ్రతనూజుఁడు నా | హృదయ సముద్భవుఁడు దానయిన మద్వచనం
బిది యేటిది యని కడు దు | ర్మదుఁ డై చేయక కృతావ మానుం డయ్యెన్‌.
198
క. తనయుండు దల్లిదండ్రులు | పనిచినపని సేయఁడేని, పలు కెడలోఁ జే
కొనఁడేని, వాఁడు తనయుం | డనఁబడునే? పితృధనమున కర్హుం డగునే?
199
క. పూరుఁడు గొండుక యయ్యును | భూరిగుణజ్యేష్ఠుఁడును సుపుత్త్రుఁడు నవనీ
భారసహిష్ణుఁడు నాతఁడ | కోరినకార్యంబు దీర్చి కుశలుం డగుటన్‌.
200
వ. ‘నా జరాభారంబుఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు; శుక్రవచనంబును నిట్టిద’ యని యయాతి ప్రకృతిజనంబుల నొడంబఱిచి, పూరు నఖిల భూభారధురంధరుం జేసి, యదుప్రభృతులఁ బ్రత్యంత భూములకు రాజులం జేసి, తాను వేదవేదాంగపారగు లయిన బ్రాహ్మణులతోడం దపోవనంబునకుం జని, యందుఁ గందమూల ఫలాశనుం డై వన్యంబులయిన ఫలంబుల హవ్యకవ్యంబుల నగ్నిభట్టారకుం బితృదేవతలం దనుపుచు, వానప్రస్థ విధానంబుఁ దప్పక శిలోంఛవృత్తి నతిథిభుక్తశేషం బుపయోగించుచు, నియతాత్ముం డై జితారిషడ్వర్గుండును నయి సహస్ర వర్షంబులు దపంబు సలిపి సర్వసంగ విముక్తుం డై, సర్వద్వంద్వంబులును విడిచి ముప్పది యేండ్లు నిరాహారుం డయి, యొక్కయేఁడు వాయుభక్షకుం డయి, పంచాగ్నిమధ్యంబున నిల్చి, యొక్కయేఁడు నీటిలో నేకపాదంబున నిలిచి, మహాఘోరతపంబు సేసి, దివ్య విమానంబున దేవలోకంబునకుం జని, యందు దేవర్షిగణపూజితుం డై బ్రహ్మలోకంబునకుం జని, యందు బ్రహ్మర్షిగణపూజితుం డై యనేక కల్పంబు లుండి, క్రమ్మఱ నింద్రలోకంబునకు వచ్చిన నింద్రుండు వానిం బూజించి యి ట్లనియె. 201
ఆ. ‘కొడుకుజవ్వనంబుఁ గొని నీవు నిజరాజ్య | భూరిభరము వానిఁ బూన్చునప్పు
డతని కెద్ది గఱపి’ తని యడిగిన హరి | కయ్యయాతి యిట్టు లనుచుఁ బలికె.
202
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )