ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
యయాతి పూరునకు బోధించిన నీతులు (సం. 1-82-6)
క. ఎఱుక గలవారి చరితలు | గఱచుచు, సజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు, నెఱిఁగిన దానిని | మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్‌.
203
క. ఇచ్చునది పాత్రునకు ధన | మచ్చుగ; నొరు వేఁడకుండునది; యభిముఖు లై
వచ్చిన యాశార్థుల వృథ | పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్‌.
204
క. మనమునకుఁ బ్రియంబును హిత | మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు | కొనరఁగఁ బలుకునది ధర్మయుతముగ సభలన్‌.
205
సీ. వదన బాణాసన వ్యక్తముక్తము లైన | పలుకు ల న్కడువాఁడి బాణతతులఁ
బరమర్మలక్ష్యముల్‌ పాయక భేదించు | చుండెడి దుర్జనయోధవరుల
కడనుండ కున్నది; కరుణ యార్జవమక్ష | జయము సత్యంబును శమము శౌచ
మను నివి యెద నిల్పునది; శత్రుషడ్వర్గ | జయమందునది శుద్ధశాంతబుద్ధి;
 
తే. మదముఁ గామముఁ గ్రోధంబు మత్సరంబు | లోభమును మోహమును నను లోని సహజ
వైరివర్గంబు నొడిచినవాఁడ యొడుచు | నశ్రమంబున వెలుపలి యహితతతుల.
206
వ. ‘అని పూరుం గఱపితి; నమ్మహాపురుషుం డొరులకుఁ గఱపునట్టి సర్వగుణసంపన్నుం’ డనిన విని యింద్రుండు వెండియు నయ్యయాతి కి ట్లనియె. 207
క. ఏమి తపం బొనరించితి | భూమీశ్వర! పుణ్యలోక భోగంబులఁ దే
జోమహిమ ననుభవించితి | సామాన్యమె శతసహస్రసంవత్సరముల్‌.
208
వ. అనిన నయ్యింద్రున కయ్యయాతి యి ట్లనియె. 209
క. సురదైత్య యక్షరాక్షస | నరఖేచర సిద్ధమునిగణ ప్రవరుల భా
సురతపములు నాదగు దు | ష్కరఘోరతపంబు సరియుఁ గా వమరేంద్రా!.
210
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )