ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
ఇంద్రుఁడు యయాతిని స్వర్గలోకభ్రష్టునిఁ జేయుట (సం. 1-83-3)
వ. అని తపోభిమానంబున మహర్షులతపంబు లవమానించి పలికిన నయ్యయాతిగర్వంబునకు సహింపక యింద్రుం డలిగి ‘నీకు దేవలోకసుఖానుభవంబులందుఁ బుణ్యసమాప్తియయ్యె; నీగర్వంబు నిన్నింత సేసె; నింక నధోలోకంబున కరుగు’ మనిన వాఁడును ‘మనుష్యలోకంబునకుం బోవనోప; నంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండు నట్లుగా నాకుఁ బ్రసాదింపు’ మని యింద్రుననుమతంబు వడసి. 211
తే. అంతరిక్షంబువలన దిగంతరములు | వెలుఁగఁ జనుదెంచు నాతని విమలదీప్తి
సూచి సద్గణములు గడుఁ జోద్య మంది | రురుతరద్యుతి యిది యేమి యొక్కొయనుచు.
212
వ. అంతనయ్యయాతి దౌహిత్రు లయిన యష్టకుండును బ్రతర్దనుండును వసుమంతుండును నౌశీనరుం డయిన శిబియు ననువారలు సద్భువన నివాసులు దమ యొద్దకుం జనుదెంచిన యయాతి నధిక తేజోమయు ననంత పుణ్యమూర్తిం గని నిసర్గస్నేహంబున నభ్యాగత పూజల సంతుష్టుంజేసి ‘నీవెవ్వండ? వెం దుండి యేమికారణం బున నిందులకు వచ్చి?’ తని యడిగిన వారలకు నయ్యయాతి యి ట్లనియె. 213
క. అనవద్యధర్మచరితం | బున నున్నతుఁ డైన నహుషుపుత్త్రుఁడఁ, బూరుం
డను మధ్యమలోకేశ్వరు | జనకుండ, యయాతి యనఁగఁ జనియెడువాఁడన్‌.
214
క. అమిత తపోవిభవంబునఁ | గమలజులోకంబు మొదలుగాఁ గల సురలో
కములందుఁ బుణ్యఫలములఁ | గ్రమమున భోగించి యింద్రుకడ కేఁ జనినన్‌.
215
క. సురపతి నా తపమున క | చ్చెరువడి నీ తపము పేర్మిఁ జెప్పుమ యనినన్‌
సురసిద్ధమునీంద్ర తప | శ్చరణలు నాతపముతోడ సరిగా వంటిన్‌.
216
చ. అమరవిభుండు దాని విని యల్గి ‘మదంబున నుత్తమావమా
నము దగునయ్య చేయ’ నని నన్ను నధోభువనప్రపాతసం
భ్రమవివశాత్ముఁ జేసి; నది పాడియ; యెందును నల్ప మయ్యు ద
ర్పము బహుకాలసంచిత తపఃఫలహాని యొనర్పకుండునే.
217
వ. ‘ఇట్లు కుపిత శతమఖ వచన ప్రపీడితుండ నయి తదాదేశంబున సద్భువనంబునకు వచ్చితి’ ననిన నాతండు దమకు మాతామహుం డగుటయు నతని మహత్త్వంబును సార్వలౌకికత్వంబును సర్వజ్ఞానసంపత్తియు నెఱింగి, యష్టకాదులు సకల ధర్మాధర్మంబులు, సుగతి, దుర్గతి స్వరూపంబులు, జీవుల గర్భోత్పత్తిప్రకారంబులు, వర్ణాశ్రమధర్మంబులు నడిగిన వారల కయ్యయాతి యి ట్లనియె. 218
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )