ఇతిహాసములు భారతము ఆదిపర్వము - తృతీయాశ్వాసము
యయాతి యష్టకాదు లడిగిన ప్రశ్నలకు సంక్షేపరూపంబున సమాధానంబు లొసఁగుట (సం. 1-84-3)
ఆ. సర్వభూతదయకు సత్యవాక్యమునకు | నుత్తమంబు ధర్ము వొం డెఱుంగ;
నొరుల నొప్పి కోడ కుపతాప మొనరించు | నదియ కడు నధర్మ మనిరి బుధులు.
219
ఆ. వేదవిహితవిధుల నాదరించుట యూర్ధ్వ | గతికిఁ దెరువు; విధులఁ గడచి యెందు
నాఁగఁబడినవాని లోఁగక చేయుట | యధమగతికి మార్గ మనిరి మునులు.
220
వ. మఱియు గర్భయోనియందు ఋతుపుష్ప రససంయుక్తం బగుచు రేతంబు గాడ్పుచేతం బ్రేరితం బయి కలసిన, నందుఁ బంచతన్మాత్రలు పొడ వయి క్రమంబున నవయవంబు లేర్పడి లబ్ధజీవు లయి యుద్భవిల్లి, శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును ద్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును నెఱుంగుచుఁ, బూర్వకర్మనియోగంబున దుష్కృతంబును సుకృతంబును జేయుచు, దుష్కృత బాహుళ్యంబునఁ బుణ్యంబు గీడ్పఱిచి బుద్ధి విరహితులై తిర్యగ్యోనులందుఁ బుట్టుదురు; సుకృత బాహుళ్యంబునఁ బాపంబు గీడ్పఱిచి బుద్ధియుక్తులై మనుష్యయోనులందుఁ బుట్టి, యుక్తాచారులును దత్త్వ విదులును నయి, దేవత్వంబునం బొంది, విశుద్ధజ్ఞాను లయి ముక్తు లగుదురు; మఱి యుక్తాచారు లెవ్వరనిన గురు శుశ్రూష సేయుచు నిత్యాధ్యయనాగ్ని కార్యంబులయం దప్రమత్తు లయి శమదమ శౌచంబులు దాల్చి యవిప్లుత బ్రహ్మచర్యులయిన బ్రహ్మచారులును, బాపంబునకుఁబరోపతాపంబునకు వెఱచి ధర్మ్యంబైన విత్తంబున నతిథులం బూజించుచు యజ్ఞంబులు సేయుచుఁ బరుల యీనిధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠానపరు లయిన గృహస్థులును, నియతాహారు లై సర్వసంగంబులు విడిచి జితేంద్రియు లైన వానప్రస్థులును, వనంబులనుండి గ్రామ్యవస్తువుల నుపయోగింపక గ్రామంబులనుండి శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజను లయి నగర ప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులం బొరయక శౌచాచారక్రియారతు లయి సర్వద్వంద్వంబులు నొడిచిసర్వసంగవివర్జితులయి యేకచరు లయి యనేకనికేతను లయిన యతులును నను వీరలు దమతమ పుణ్యాచారంబులం జేసి క్రిందం బదితరంబులవారిని మీఁదం బదితరంబుల వారిని దమ్మును నుద్ధరింతురు. 221
క. మానాగ్నిహోత్రమును మఱి | మానాధ్యయనమును మానమౌనంబు నవి
జ్ఞానమున మానయజ్ఞము | నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్‌.
222
వ. అని యయాతి యష్టకాదు లడిగినవాని నెల్ల సంక్షేపరూపంబునం జెప్పుటయు వార లి ట్లనిరి. 223
తే. ‘సకల ధర్మవిదుండవు, సర్వలోక | వర్తనము లెఱింగిన పుణ్యకర్త, వీవు
నెయ్య మొనరంగ నెఱిఁగింపుమయ్య మాకు | వెలయఁ బుణ్యలోకంబులు గలవె’ యనిన.
224
వ. ‘మీకుంబుణ్యలోకంబులుగల’ వని యయాతి సెప్పిన విని యన్నలువురు సంతోషించి ‘యేము నీ దౌహిత్రులము సు’ మ్మని త మ్మెఱింగించి వానికిఁ బుణ్యలోకంబు లిచ్చిన న ట్లయ్యయాతి సత్సంగతిం జేసి తానును దౌహిత్రులు నూర్ధ్వలోకంబునకుం జనియె నని. 225
క. ఆ యతులపుణ్యునకు నన | సూయునకుఁ బరీక్షిదగ్రసుతునకు వైశం
పాయనుఁ డనంతపుణ్యఫ | లాయత్తము గాఁగఁ జెప్పె నని కడుఁ బ్రీతిన్‌.
226
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )