ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
పూరువంశక్రమము (సం. 1-90-11) (1-89-4)
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె : నట్లు యయాతికిఁ బుత్త్రుం డయిన పూరుండు సకల మహీరాజ్యంబు సేయుచు వంశకర్త యయిన వానికిఁ గౌసల్య యనుదానికి జనమేజయుండు పుట్టి రాజై యశ్వమేధత్రయంబుఁజేసి ప్రఖ్యాతి నొందె; నాజనమేజయునకు ననంత యనుదానికిఁబ్రాచిన్వంతుఁడు పుట్టి పరాక్రమంబున నుదయాచల పర్యంతంబు ప్రాగ్దిగ్విజయంబు సేసి ప్రాచిన్వంతుఁడు నాఁ బరఁగె; నట్టి ప్రాచిన్వంతునకు నశ్మకి యనుదానికి సంయాతి పుట్టె; వానికి వరాంగియనుదానికి నహంయాతి పుట్టె; వానికిం గృతవీర్యపుత్త్రియైన భానుమతికి సార్వభౌముండు పుట్టె; వానికిఁ గేకయ రాజపుత్త్రి యైన సునందకు జయత్సేనుండు పుట్టె; వానికి వైదర్భి యైన సుశ్రవసకు నవాచీనుండు పుట్టె; నయ్యవాచీనునకు విదర్భరాజపుత్త్రి యైన మర్యాదకు నరిహుండు పుట్టె; వానికి నాంగి యనుదానికి మహాభౌముండు పుట్టె; నా మహాభౌమునకుం బ్రసేనజిత్పుత్త్రియైన సుపుష్టకు నయుతానీకుండు పుట్టె; వానికిం బృథుశ్రవసుని పుత్త్రి యైన కామకు నక్రోధనుండు పుట్టె; వానికిం గాళింగి యైన కరంభ యనుదానికి దేవాతిథి పుట్టె; వానికి వైదేహి యయిన మర్యాదకు ఋచీకుండు పుట్టె; వానికి నాంగియైన సుదేవ యనుదానికి ఋక్షుండు పుట్టె; ఋక్షునకుఁ దక్షకపుత్త్రి యయిన జ్వాలయనుదానికి మతినారుండు పుట్టి. 2
క. ఇమ్ముగ సరస్వతీ తీ | రమ్మునఁ బండ్రెండు వత్సరమ్ములు విధిమా
ర్గమ్మున సద్గుణసముదా | య మ్మెసగఁగఁ జేసి సత్త్రయాగము నిష్ఠన్‌.
3
క. అతనికి సరస్వతీనది | మతి ననురక్త యయి వాని మానుగఁ దనకుం
బతిఁ జేసికొనియె ధర్మ | స్థితి; నయ్యిరువురకుఁ ద్రసుఁడు ధీరుఁడు పుట్టెన్‌.
4
వ. ఆ త్రసునకుఁ గాళింది యనుదానికి నిలినుండు పుట్టె; వానికి రథంతరి యను దానికి దుష్యంతుండు పుట్టెఁ; బుట్టి యనన్యసాధారణశక్తియుక్తుం డై. 5
క. బాలహరిణములఁ బట్టెడు | లీలను విషమాటవీ చలిత కేసరి శా
ర్దూలేభ శరభములఁ దన | బాలత్వమునంద యెగిచి పట్టుచు మఱియున్‌.
6
క. ఉర్వీరుహ నివహముతోఁ | బర్వతములు వెఱికి యొండు పర్వతములపైఁ
బర్వఁగ వైచుచు యౌవన | గర్వంబున నొప్పె నుర్విఁ గడు నధికుం డై.
7
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )