ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
దుష్యంతుఁడు వేఁట కరుగుట (సం. 1-63-1)
శా. ఆ దుష్యంతుఁ డనంతసత్త్వుఁడు సమస్తాశాంతమాతంగ మ
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్త మై యుండఁగా
నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో
నాదిక్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్‌.
8
క. ఆతని రాజ్యంబున ను | ర్వీతలము ప్రజాసమృద్ధి వెలసి రుజాశో
కాతంక క్షయ శంకా | పేతం బై ధర్మచరితఁ బెరుఁగుచు నుండెన్‌.
9
వ. అమ్మహీపతి యొక్కనాఁడు మృగయావినోదార్థి యయి యాదిత్యహయంబులకంటె వడిగల హయంబులు పూనిన రథం బెక్కి యాజానేయతురంగారూఢు లైన యాశ్వికులు పరివేష్టించి రాఁగ ననంతకుంతశక్తిచాప కృపాణపాణు లయిన వీరభటసహస్రంబులతోఁ జని వనంబులోని మృగంబులం జుట్టుముట్టి. 10
క. కలయఁగ నార్పుల బొబ్బల | యులివున నవ్విపిన మను మహోదధిఁ బెలుచం
గలఁచెను దుష్యంత మహా | బల మందరనగము సత్త్వభయజననం బై.
11
క. సరభస పరిచరిత మహా | శరభ ద్విపరిపు వరాహ శార్దూల మద
ద్విరదాది ప్రకర భయం | కరవనమధ్యమున నృపతి గడుఁ గడిమిమెయిన్‌.
12
క. ఓసరిలి పఱచు మృగముల | నేసియు, డాసిన మృగముల నెగచి భుజాసిన్‌
వ్రేసియుఁ, జంపెను మృగయా | వ్యాసక్తి నపారఘోరవన్యమృగాళిన్‌.
13
వ. ఇట్లు పెక్కుమృగంబుల నెగిచి చంపుచు మఱియుఁ జంపెడువేడుక నతి దూరంబున కరిగిన, నాతని రథవేగంబు ననుగమింపనోపక యధిక క్షుత్పిపాసాపరవశు లయి పదాతు లయ్యయి ప్రదేశంబుల విశ్రమించి; రంత దుష్యంతుండు కతిపయామాత్య పురోహితసహితుం డై కొండొకనేల యరిగి, ముందట నొక్క పుణ్యనదీతీరంబున వివిధసురభి కుసుమఫల భారవినమ్ర తరులతాగుల్మ పరిశోభితం బయిన యొక్కవనంబు గని. 14
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )