ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
కణ్వాశ్రమ వర్ణన (సం. 1-64-3)
క. అమరపతి ఖాండవమునకు | రమణను వైశ్రవణు చైత్రరథమునకు సమా
నముగా దీనిని భూభా | గమునను రచియించె నొక్కొ కమలజుఁడు దయన్‌.
15
వ. అని దాని రమణీయభావంబుఁ బొగడుచుఁ జనుదెంచి యవ్వనంబు సొచ్చునప్పుడు 16
చ. అతిరుచిరాగతుం డయిన యాతనికిన్‌ హృదయప్రమోద మా
తతముగ నవ్వనంబున లతాలలనల్‌ మృదులానిలాపవ
ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టినయట్టిరైరి సం
పత దళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్‌.
17
వ. మఱియును. 18
క. కాఱడవిఁ బఱచు మృగముల | నూఱడకం దిగిచి డస్సియున్నతని శ్రమం
బాఱఁగ నెడఁ బరితాపము | దీఱఁగఁ బైవీచె నన్నదీపవనంబుల్‌.
19
మానిని. ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల, జొంపములం
బూచిన మంచియశోకములన్‌, సురపొన్నలఁ, బొన్నల, గేదఁగులం,
గాచి బెడంగుగఁ బండిన యాసహకారములం, గదళీతతులం
జూచుచు, వీనుల కింపెసఁగన్‌ వినుచున్‌ శుకకోకిల సుస్వరముల్‌.
20
కవిరాజ విరాజితము. చని చని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమలతాతతులం
బెనఁగిన మ్రాఁకుల కొమ్మలమీఁద నపేతలతాంతము లైనను బా
యని మధుపప్రకరంబులఁ జూచి జనాధిపుఁ డంత నెఱింగెఁ దపో
వన మిది యల్లదె దివ్యమునీంద్రునివాసము దానగు నంచు నెదన్‌.
21
వ. ఇట్లు హృదయసుఖావహం బగుచున్న యవ్వనంబులో నరిగి యరిగి యనవరత మహాద్విజ పఠ్యమానవేదధ్వనులను, నవిచ్ఛిన్న హూయమానాగ్ని హోత్రస్వాహాశబ్దంబులను, ననేకమునిగణప్రణీత వచన విషయ విభాగ వినిర్ణయన్యాయనిపుణ విద్వత్సభాసంభాషణఘోషంబులను, బ్రతిపక్ష దుర్విభేద ప్రమాణ విచార్యమాణ వేదార్థ మీమాంసక గోష్ఠీవివాద నాదంబులనుంజేసి మ్రోయుచు, యజ్ఞప్రయోగప్రవీణు లయిన యాజ్ఞికులకును విహితానుష్ఠానాసక్తులయిన యనుష్ఠాతలకును నధికతపోనిరతు లయిన మహాతపోధనులకును నివాసం బయిన పుణ్యనదీతీరంబునఁ దద్దయు రమ్యం బయి గంగాతీరంబున నరనారాయణస్థానంబునుంబోలె జగత్పావనం బైన కణ్వమహాముని యాశ్రమంబు గని యందు. 22
సీ. శ్రవణసుఖంబుగా సామగానంబులు | చదివెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులయుఁ గరికర | శీతలచ్ఛాయఁ దచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్పాసపడి దానిఁ | జెంది సుఖం బున్న సింహములయు,
భూసురప్రవరులు భూతబలుల్‌ తెచ్చి | పెట్టు నీవారాన్న పిండతతులు
 
తే. గడఁగి భక్షింప నొక్కటఁ గలిసియాడు | చున్న యెలుకలుఁ బిల్లుల యొండు సహజ
వైరివర్గంబులయు సహవాస మపుడు | సూచి మునిశక్తి కెంతయుఁ జోద్య మంది.
23
వ. ‘ఇక్కాశ్యపుం డైన కణ్వమహామునీంద్రునకు నమస్కరించి వచ్చెద; నా వచ్చునంతకు నందఱు నిచ్చోటన యండునది’ యని. 24
చ. వలయు నమాత్యులం దగినవారల నుండఁగఁ బంచి ధారుణీ
తలవిభుఁ డొక్కరుండ చని తన్విఁ బయోజదళాయతాక్షి సం
కుల మిళితాళినీల పరికుంచిత కోమలకుంతలన్‌ శకుం
తల యను కన్యకం గనియెఁ దన్మునివల్లభు మందిరంబునన్‌.
25
వ. అదియును ననంతవిలాసంబున జయంతుండ పోని దుష్యంతు నెఱింగి, యతిసంభ్రమంబున నాసనార్ఘ్య పాద్యాది విధులం బూజించి, కుశలం బడిగి యున్న, నక్కన్యకం జూచి దుష్యంతుం డి ట్లనియె. 26
ఉ. ‘క్రచ్చఱ వేఁట వచ్చి యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి; మెందుఁ బోయిరొకొ వా?’ రనినన్‌ విని యాలతాంగి ’ వా
రిచ్చటినుండి యీక్షణమ యేఁగిరి కానకుఁ బండ్లుదేర; మీ
వచ్చు టెఱింగిరేని జనవల్లభ! వారును వత్తు రింతకున్‌.
27
వ. ‘వారు వచ్చునంతకు నొక్కముహూర్తం బుండునది’ యనిన విని యక్కోమలి వినయంబునకు మృదుమధురవచనంబులకు సంతసిల్లి, దానిం గన్యకగా నెఱింగి మనోజరాజ్యలక్ష్మియుంబోని దాని సర్వలక్షణ లక్షితంబు లయిన సర్వావయవంబులుం జూచి సంచలితహృదయుం డై ‘నీ వెవ్వరి కూఁతుర? విట్టి రూపలావణ్యవిలాసవిభ్రమగుణసుందరి విందుల కేల వచ్చి’? తని యడిగిన నది యి ట్లనియె. 28
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )