ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
శకుంతల దుష్యంతునకుఁ దనజన్మక్రమం బెఱింగించుట (సం. 1-65-14)
క. ‘జగతీవల్లభ! యే న | త్యగణిత ధర్మస్వరూపుఁ డని జనములు దన్‌
బొగడఁగ జగదారాధ్యుం | డగు కణ్వమహామునీంద్రునాత్మజ’ ననినన్‌.
29
చ. ‘ఇది మునికన్య యేని మఱి యేలొకొ యీలలితాంగియందు నా
హృదయము దద్దయుం దవిలె; నిప్పలు కింకను నమ్మనేర న
య్యెద; విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు’ నంచుఁ దా
నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్‌.
30
వ. ఇట్లు దుష్యంతుం డా శకుంతలజన్మం బెఱుంగ వేఁడి వెండియు దాని కి ట్లనియె. 31
తే. ఉత్తమాశ్రమనిష్ఠితుఁ డూర్ధ్వరేతుఁ | డైన కణ్వమహాముని యనఘచరితుఁ;
డట్టిముని కెట్లు గూఁతుర వైతి? దీని | నాకు నెఱుఁగంగఁ జెప్పుము నలిననేత్ర!
32
వ. అని యడిగిన నారాజునకు శకుంతల యి ట్లనియె. 33
క. ‘ఇక్కమలాక్షి శకుంతల | యెక్కడియది? దీని జన్మ మెవ్విధ?’ మని త
మ్మొక్క మునినాథుఁ డడిగిన | నిక్కాశ్యపు లర్థిఁ జెప్పి రేను వినంగన్‌.
34
వ. ‘నాజన్మప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పినవిధంబు చెప్పెదఁజిత్తగించివిను’మని యాదుష్యంతునకు శకుంతల యి ట్లనియె. 35
సీ. అనఘుఁడు రాజర్షియై తపశ్శక్తిమై | బ్రహ్మర్షిభావంబుఁ బడసియున్న
సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర | తపము సేయుచునున్నఁ దత్తపమున
కెంతయు వెఱచి దేవేశ్వరుఁ డప్సరో | గణములలో నగ్రగణ్య యైన
దాని మేనక యను ధవళాక్షిఁ బిలిచి ‘వి | శ్వామిత్రుపాలికిఁ జని తదీయ
 
ఆ. ఘోరతపము చెఱిచి కోమలి! నా దైన | దేవరాజ్యమహిమఁ దివిరి నీవు
గావు’ మనిన నదియుఁ గడు భయంపడి యమ | రేశ్వరునకు మ్రొక్కియిట్టు లనియె.
36
చ. వనజభవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోక మ
న్వననిధిలోన ముంచిన యవారితసత్త్వుఁడు నిన్నుఁ దొట్టి యీ
యనిమిషు లెల్లవానికి భయంపడుచుండుదు రట్టియుగ్రకో
పనుకడ కిప్పు డేఁగు మని పాడియె యిప్పని నన్నుఁ బంపఁగన్‌.
37
ఉ. అమ్ముని యల్గి చూచుడును నాక్షణమాత్రన గోత్రధారుణీ
ధ్రమ్ములు వ్రయ్యు, నయ్యిసుము దక్కఁగ నంబుధు లింకు, మూఁడులో
కమ్ములు దిర్దిరం దిరుగు, గాడ్పు చలింపఁగ నోడు, నుగ్రతం
బమ్మినయట్టి కోపపరుపాలికి భామలు వోవ నోడరే.
38
వ. ‘అయినను నానేర్చువిధంబున నమ్మునివరుచిత్తంబు మెత్తన చిత్తజాయత్తంబగునట్లుగాఁ జేసెద’ నని వాసవు వీడ్కొని మేనక తనకు మందమలయానిలంబు దోడుగాఁ జనుదెంచి, హిమవత్పర్వతప్రదేశంబునం దపంబుసేయుచున్న విశ్వామిత్రు తపోవనంబు సొత్తెంచిన. 39
క. చల్లని దక్షిణ మారుత | మల్లన వీతెంచెఁ దగిలి యా లలనా ధ
మ్మిల్ల కుసుమాంగరాగస | ముల్లసనసుగంధి యగుచు మునివరుమీఁదన్‌.
40
వ. అంత. 41
చ. అనిమిషకాంతయున్‌ నవలతాంత విభూషణ లీల నల్లన
ల్లన వనకేళి లాలస విలాసగతిం జనుదెంచి ముందటం
గనియె మహామునిప్రవరుఁ గౌశికుఁ గౌశిక చిత్తభీతి సం
జనన మహాతపశ్చరణ సంయతచిత్తు నిరస్తచిత్తజున్‌.
42
క. అంబుజలోచన గని విన | యంబున నమ్మునికి మ్రొక్కి యనురాగముతో
డం బుష్పాపచయ వ్యా | జంబున విహరించుచుండె సఖులుం దానున్‌.
43
చ. అలసత యొప్పఁగాఁ దరుణి యమ్మునివల్లభుమ్రోల నున్న స
మ్మిళిత సుగంధబంధురసమీరవశంబునఁ దూలి బాల పై
వలు వెడలన్‌ బయల్పడియె వల్దకుచంబులుఁ గక్షయుగ్మమున్‌
లలితకృశోదరంబుఁ దరళత్రివళీయుత రోమరాజియున్‌.
44
క. అందుఁ దనదృష్టి నాటుడుఁ | గందర్ప నిశాత సాయకంబులు పెలుచన్‌
డెందముఁ గాఁడిన ధృతి సెడి | కంది మునీంద్రుండు దానిఁ గవయం దివిరెన్‌.
45
వ. మేనకయు విశ్వామిత్రు నిష్టంబునకుం దగిన కామోపభోగంబులం బెద్దకాలంబు రమియించిన నయ్యిద్దఱకు నిక్కన్యక పుట్టిన, దీని మాలిని యను నొక్కయేటి పులినతలంబునం బెట్టి మేనక దేవలోకంబునకుం జనియె; విశ్వామిత్రుండును దపోవనంబునకుం జనియె; నంత నమ్ముని ప్రభావంబున. 46
ఆ. చెలఁగి లేవ నేడ్చు చిఱుతుకదానిఁ గ్ర | వ్యాదఘోరమృగము లశనబుద్ధిఁ
బట్టకుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు | కొని శకుంతతతులు గూడియుండె.
47
వ. అంత నేము శిష్యగణంబులతోడ సమిత్కుసుమ ఫలాహరణార్థం బక్కడకుం జని, యమ్మాలినీ పులినతలంబున శకుంతరక్షిత యై యున్న కూఁతు నత్యంతకాంతిమతి నవనీతలంబున కవతరించిన తరుణ శశిరేఖ యుంబోని దాని నెత్తుకొని వచ్చి, శకుంతరక్షిత యగుటఁ జేసి శకుంతల యను నామం బిడి కరంబు గారవంబునం బెనిచితిమి. 48
మధురాక్కర. తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
యును ననఁగ నింతులకు మువ్వు రొగిన గురువులు; వీర
లనఘ! యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు.
49
వ. ‘అనం బరఁగిన శాస్త్రార్థంబున నేము దీనికి భయత్రాతల మగుటంజేసి గురుల; మిదియును మాచే నభివర్ధిత యగుటం జేసి మాకు హృదయానందని యైన కూఁతు’ రని కణ్వమహామును లమ్మునికిం జెప్పిన విధం బంతయు సవిస్తరంబుగా శకుంతల చెప్పిన విని దుష్యంతుం డాత్మగతంబున. 50
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )