ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
దుష్యంతుండు శకుంతలను వివాహంబు సేసికొనఁ గోరుట (సం. 1-67-1)
చ. ఇది మునినాథ కన్య యని యెంతయు నిఃస్పృహవృత్తి నున్ననా
హృదయము రాజపుత్త్రి నని యిక్కమలాక్షి నిజాభిజాత్య సం
పద నెఱిఁగించినన్‌ మదనబాణపరంపర కిప్పు డుండ నా
స్పద మయి సంచలించె నళిపాత వికంపిత పంకజాకృతిన్‌.
51
వ. అనుచు మదనాతురుం డయి దుష్యంతుండు దనయం దక్కోమలియనురాగం బుపలక్షించి యి ట్లనియె. 52
క. ఈ వల్కలాజినములకు | నీ వన్యఫలాశనముల కీ విటపకుటీ
రావాసములకు నుచితమె | నీ విలసిత రూపకాంతి నిర్మలగుణముల్‌.
53
ఉ. ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పఁగా
భామిని! నాకు భార్య వయి భాసురలీల నశేషరాజ్య ల
క్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా
దామలతుంగహర్మ్యముల హారిహిరణ్మయ కుట్టిమంబులన్‌.
54
సీ. ‘బ్రాహ్మంబు దైవంబుఁ బరఁగ నార్షంబుఁ బ్రా | జాపత్యమును రాక్షసంబు నాసు
రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు | నను నెనిమిది వివాహములయందుఁ
గడుఁ బ్రశస్తములు సత్‌క్షత్త్ర వంశ్యులకు గాం | ధర్వ రాక్షసములు ధర్మయుక్తి;
నీకును నాకును నెమ్మిఁ బరస్పర | ప్రేమంబు గాముండు పెంపఁదొడఁగెఁ
 
ఆ. గాన యెడయుఁ జేయఁగా నేల? గాంధర్వ | విధి వివాహ మగుట వినవె యుక్త’
మనిన లజ్జఁ జేసి యవనత వదన యై | యాలతాంగి యిట్టు లనియెఁ బతికి.
55
క. కరుణానిరతులు ధర్మ | స్వరూపు లింతకు మదీయజనకులు సనుదెం
తురు; వారు వచ్చి నీ కి | చ్చిరేని పాణిగ్రహణము సేయుము నన్నున్‌.
56
వ. అనిన దానికి దుష్యంతుం డి ట్లనియె. 57
తే. తనకు మఱి తాన చుట్టంబు, తాన తనకు | గతియుఁ, ద న్నిచ్చుచోఁ దాన కర్త యనఁగ
వనజనేత్ర! గాంధర్వవివాహ మతి ర | హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు.
58
వ. అని దుష్యంతుండు గాంధర్వవివాహస్వరూపంబు చెప్పి శకుంతల నొడంబఱిచిన నది యి ట్లనియె. 59
చ. నరనుత! నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్‌ మహీ
గురుతర యౌవరాజ్యమునకున్‌ దయతో నభిషిక్తుఁ జేయఁగా
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో;
నిరుపమకీర్తి! యట్లయిన నీకును నాకును సంగమం బగున్‌.
60
వ. అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి, గాంధర్వవివాహంబున నభిమతసుఖంబు లనుభవించి, యక్కోమలి వీడ్కొని ‘నిన్నుఁ దోడ్కొనిరా నస్మత్ప్రధానవర్గంబుఁ గణ్వమహాముని పాలికిం బుత్తెంచెద’ నని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె; నిట శకుంతలయుఁ దనచేసినదాని మునివరుం డెఱింగి యలిగెడునో యని వెఱచుచుండె; నంత నమ్మహాముని వనంబుననుండి కందమూలఫలంబులు గొని చనుదెంచి, లలితశృంగారభావంబున లజ్ఞావనతవదనయు నతిభీతచిత్తయు నైయున్న కూఁతుంజూచి, తన దివ్యజ్ఞానంబున నంతవృత్తాంతంబు నెఱింగి, క్షత్త్రియులకు గాంధర్వవివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కి ట్లనియె. 61
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )