ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
భరతుని జననము ( సం.1-68-1)
తే. తల్లి! నీకులగోత్ర సౌందర్యములకుఁ | దగిన పతిఁ గంటి; దానికిఁ దగఁగ గర్భ
మయ్యె; నీదు గర్భమున వాఁ డఖిలభువన | వహన మహనీయుఁ డగు చక్రవర్తి సుమ్ము.
62
వ. ‘నీధర్మచరితంబునకు మెచ్చితి, నీ కోరిన వరం బిచ్చెద వేఁడు’ మనిన శకుంతలయు ‘నాచిత్తం బెప్పుడు ధర్మువునంద తగిలియుండను, నాకుద్భవించెడు పుత్త్రుండు దీర్ఘాయురారోగ్యైశ్వర్య బలసమన్వితుండును వంశకర్తయుఁగాను వలయు’ ననిన నమ్మహాముని కరుణించి దాని కోరిన వరం బిచ్చి, యథాకాలవిధుల గర్భసంస్కార రక్షణంబులు సేయించి యున్నంత, వర్షత్రయంబు సంపూర్ణం బైన, శకుంతలకు భరతుం డుదయించి కణ్వనిర్వర్తిత జాతకర్మాది క్రియాకలాపుం డయి పెరుఁగుచుఁ గరతలాలంకృతచక్రుండును, చక్రవర్తిలక్షణలక్షితుండును, సింహసంహననుండును, దీర్ఘబాహుండును, ననంతజవసత్త్వ సంపన్నుండును నై పరఁగుచు. 63
మ. అమితోగ్రాటవిలోనఁ గ్రుమ్మరు వరాహవ్యాళశార్దూల ఖ
డ్గమదేభాదులఁ బట్టి తెచ్చి ఘనుఁడై కణ్వాశ్రమోపాంత భూ
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ
న్యమదేభంబుల నెక్కుచుం దగిలి నానాశైశవక్రీడలన్‌.
64
వ. ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దనమహాసత్త్వంబునం జేసి దమియించుచున్న యాతనిం జూచి యాశ్చర్యం బంది యందులమునులెల్ల నాతనికి సర్వదమనుం డను నామంబుఁ జేసిరి; కణ్వమహామునియు నక్కుమారు నుదార తేజోరూప విక్రమ గుణంబులకు సంతసిల్లి ‘వీఁ డఖిల భువన యౌవరాజ్యంబునకు సమర్థుం డగు సమయం బరుగుదెంచె’ నని విచారించి యొక్కనాఁడు కూఁతున కి ట్లనియె. 65
ఆ. ఎట్టిసాధ్వులకును బుట్టిన యిండ్లను | బెద్దకాల మునికి తద్ద తగదు;
పతులకడన యునికి సతులకు ధర్మువు; | సతుల కేడుగడయుఁ బతుల చూవె.
66
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )