ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
కణ్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట (సం. 1-68-10)
వ. ‘కావున నీ విక్కుమారునిం దోడ్కొని నీపతిపాలికి నరుగు’ మని మహాతపోధను లైన తన శిష్యులం గొందఱఁ దోడువంచిన, శకుంతలయు దౌష్యంతిం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంతమంత్రిపురోహిత ప్రధానపౌరజనపరివృతుండై యున్న యారాజుం గనుంగొని. 67
క. గురునాశ్రమంబునను ము | న్నరుదుగఁ బతివలనఁ గనిన యనురాగము నా
దరణము ననుగ్రహంబును | గరుణయు సంభ్రమము నపుడు గానక యెడలోన్‌.
68
క. ఎఱుఁగ డొకొ నన్ను; నెఱిఁగియు | నెఱుఁగని యట్లుండునొక్కొ; యెడ దవ్వగుడున్‌
మఱచెనొకొ! ముగ్ధు లధిపులు | మఱవరె బహుకార్యభారమగ్నులు కారే.
69
చ. తలఁపఁగ నాఁడు పల్కినవిధం బెడఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో?
కలయఁగఁ బల్కరించి రుపకారులు నై రని నమ్మియుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాథులన్‌.
70
వ. అని తలంచి చింతాక్రాంత యై శకుంతల వెండియు నాత్మగతంబున. 71
క. మఱచినఁ దలఁపింపఁగ నగు; | నెఱుఁగని నాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్‌;
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని | కఱటిం దెలుపంగఁ గమలగర్భుని వశమే.
72
వ. అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నాపూర్వవృత్తాంతంబెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు’ నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కి ట్లనియె. 73
క. జననాథ! వేఁట నెపమున | గొనకొని కణ్వాశ్రమమునకున్‌ వచ్చి ముదం
బున నందు నాకు నీయి | చ్చిన వరము దలంపవలయుఁ జిత్తములోనన్‌.
74
క. బాలార్కతేజుఁ డగు నీ | బాలుఁడు నీకొడుకు వీనిఁ బౌరవకుల ర
త్నాలంకారు నుదార గు | ణాలయు యువరాజుఁ జేయు మభిషేకముతోన్‌.
75
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )