ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
కుపిత యైన శకుంతల దుష్యంతునకు ధర్మప్రబోధ మొనరించుట (సం. 1-68-22)
ఆ. ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ | వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి;
యేన కాని దీని నెఱుఁగ రిం దొరు లని | తప్పఁబలుక నగునె ధార్మికులకు!
79
చ. విమలయశోనిధీ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్‌
యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు న న్మహాపదా
ర్థము లివి యుండఁగా నరుఁడు దక్కొననేర్చునె తన్ను మ్రుచ్చిలన్‌.
80
క. నా యెఱిఁగినట్ల యిన్నియు | నీ యిచ్చిన వరము ధారుణీవర! యెఱుఁగున్‌
నాయందుఁ దొంటియట్టుల | చేయు మనుగ్రహ; మవజ్ఞ సేయం దగునే!
81
క. సతియును గుణవతియుఁ బ్రజా | వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిఁ జూచు నతి దు | ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁ బరికింపన్‌.
82
క. సంతతగృహమేధి ఫలం | బంతయుఁ బడయంగ నోపు ననుగుణభార్యా
వంతుం డగువాఁడు క్రియా | వంతుఁడు దాంతుండుఁ బుత్త్రవంతుండు నగున్‌.
83
వ. మఱియును. 84
సీ. ధర్మార్థకామసాధన కుపకరణంబు | గృహనీతివిద్యకు గృహము, విమల
చారిత్రశిక్ష కాచార్యకం, బన్వయ | స్థితికి మూలంబు, సద్గతికి నూఁత,
గౌరవంబున కేకకారణం, బున్నత | స్థిరగుణమణుల కాకరము, హృదయ
సంతోషమునకు సంజనకంబు భార్యయ | చూవె భర్తకు, నొండ్లు గావు ప్రియము,
 
ఆ. లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను | నెట్టితీఱములను ముట్టఁబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను | నొనరఁ జూడఁగనిన జనుల కెందు.
85
వ. మఱియు భార్య పురుషునం దర్ధం బగుటంజేసి పురుషునకు మున్న పరేత యైన పతివ్రత పరలోకంబునం దనపురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుం; బురుషుండు మున్న పరేతుం డైనఁ బదంపడి తానును బరేత యై తనపురుషుం గూడ నరుగునట్టి భార్య నవమానించుట ధర్మవిరోధంబు; మఱియునుం బురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున ‘నఙ్గా దఙ్గా త్సమ్భవసి’ యనునది యాదిగాఁగల వేదవచనంబులయందును జనకుండునుఁ బుత్త్రుండును ననుభేదంబు లేదు. 86
క. విను గార్హపత్య మను న | య్యనలము విహరింపఁబడి తదాహవనీయం
బున వెలుఁగునట్ల వెలుఁగును | జనకుఁడు దాఁ బుత్త్రుఁడై నిజద్యుతితోడన్‌.
87
క. తాన తననీడ నీళ్ళు ల | లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత! త
త్సూను జనకుండు సూచి మ | హానందముఁ బొందు నతిశయప్రీతిమెయిన్‌.
88
వ. ‘పున్నామ్నో నరకాత్త్రాయత ఇతి పుత్త్ర’ యను వేదవచనంబు గలదు గావునఁ బుణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షంబులవారి నుద్ధరించుఁ; గావున. 89
క. నీ పుణ్యతనువు వలనన | యీపుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్‌
దీపంబువలన నొండొక | దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్‌.
90
మ. విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా
త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా
త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే.
91
క. అనఘుఁడు వంశకరుండై | పెనుపున నీసుతుఁడు వాజపేయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి | వినిచె మునులు వినఁగ నాకు వినువీథిదెసన్‌.
92
క. భూరిగుణు నిట్టి కులవి | స్తారకు దారకు నుదారధర్మప్రియ! ని
ష్కారణమ తప్పఁజూడఁగ | సారమతీ! చనునె నాఁటి సత్యము గలుగన్‌.
93
చ. నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కస
త్క్రతువది మేలు; తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్‌.
94
క. వెలయంగ నశ్వమేధం | బులు వేయును నొక్కసత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము | వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్‌.
95
తే. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద | సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
ఎఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద | యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన మునులు.
96
క. కావున సత్యము మిక్కిలి | గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ | గావింపుము; గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్‌.
97
క. క్షత్త్రవరుఁ డైన విశ్వా | మిత్త్రునకుఁ బవిత్ర యైన మేనకకున్‌ స
త్పుత్త్రి నయి బొంకు వలుకఁగ | ధాత్రీతలనాథ! యంత ధర్మేతరనే?
98
వ. అనిన శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డి ట్లనియె. 99
క. ఏ నెట? నీ వెట? సుతుఁ డెట? | యే నెన్నఁడు తొల్లి చూచి యెఱుఁగను నిన్నున్‌;
మానిను లసత్యవచనలు | నా నిట్టు లసత్యభాషణం బుచితంబే?
100
క. పొడవునఁ బ్రాయంబునఁ గడుఁ | గడిఁది బలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు | నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగఁగన్‌.
101
వ. ‘ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు; మయుక్తంబు లయిన పలుకులు పలుకక నీయాశ్రమంబునకుం బొ’ మ్మనిన శకుంతల యత్యంతసంతాపితాంతఃకరణ యై. 102
మధ్యాక్కర. ‘తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ
బడితి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ!
నుడువులు వేయు నిం కేల? యిప్పాటినోములు తొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి’ యనుచును గందె డెందమున.
103
వ. ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁదొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు ‘నింక దైవంబ కాని యొండు శరణంబు లేదని యప్పరమ పతివ్రత తనయుందోడ్కొనిక్రమ్మఱిపోవ నున్న యవసరంబున. 104
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )