ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
దివ్యవాణి నాకర్ణించి దుష్యంతుఁడు శకుంతలను గ్రహించుట (సం. 1-69-28)
చ. ‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు; సే
కొని భరియింపు మీతని; శకుంతల సత్యము వల్కె,సాధ్వి, స
ద్వినుత, మహాపతివ్రత వివేకముతో’ నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మందఁగఁ దత్సభాసదుల్‌.
105
వ. ఇ ట్లెల్లవారలకు నతిహర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియుఁ బ్రశంసించు వేలుపుల పలుకు లతివ్యక్తంబు లయి యాకాశంబువలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు విన ని ట్లనియె. 106
తే. ఏను నీ యింతియును గాని యెఱుఁగ రన్యు | లర్థిఁ గణ్వమహాముని యాశ్రమంబు
నందు గాంధర్వవిధి వివాహమునఁ గరము | నెమ్మిఁ జేసిన దీని పాణిగ్రహణము.
107
తే. అన్యు లెఱుఁగమిఁ జేసి లోకాపవాద | భీతి నెఱిఁగియు నిత్తన్విఁ బ్రీతి దప్పి
యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు డెఱుఁగఁ | జెప్పె నాకాశవాణి యచ్చెరువు గాఁగ.
108
వ. అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెసఁగ నాలింగనంబు సేసి, శకుంతలా మహాదేవి నతిప్రణయగౌరవంబునసంభావించి, యౌవరాజ్యంబునకు భరతు నభిషిక్తుంజేసి. పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభవించి, తన రాజ్యభారం బంతయు భరతుం బూన్చి, దుష్యంతుండు తపోవనంబున కరిగిన. 109
చ. భరతుఁ డశేష భూభువనభార ధురంధరుఁ డై వసుంధరం
బరఁగి, యనేక యాగములఁ బాయక భాస్కర జహ్నుకన్యకా
సురుచిర తీరదేశముల సువ్రతుఁడై యొనరించి, భూరిభూ
సురులకు నిచ్చె దక్షిణలు శుద్ధసువర్ణ గవాశ్వహస్తులన్‌.
110
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )