ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
భరతవంశక్రమము (సం. 1-90-34)
వ. మఱియు నతీతానాగతు లైన నిజవంశంబున రాజులకెల్ల వంశకర్త యయ్యె; నట్టి భరతునకుఁ గైకేయి యైన సునందకు భుమన్యుండు పుట్టె; వానికి దాశార్హపుత్త్రి యైన విజయకు సుహోత్రుండు పుట్టె; వానికి నిక్ష్వాకు కన్యయైన సువర్ణకు హస్తి పుట్టె; నతనిపేరం గౌరవ్య రాజధాని యైన నగరంబు హస్తిపురంబునాఁ బరఁగె; నట్టి హస్తికిం ద్రిగర్తరాజపుత్త్రి యైన యశోధరకు వికుంఠనుండు పుట్టె; వానికి దాశార్హపుత్త్రి యైన వసుదేవకు నజమీఢుండు పుట్టె; నయ్యజమీఢునకుఁ గైకేయియు గాంధారియు ఋక్షయు నను మువ్వురు స్త్రీలకు. 111
క. బలయుతులు నూటయిరువది | నలువురు సుతు లుద్భవిల్లి నానాదేశం
బులకుఁ బతు లైరి; మఱి వా | రలలో సంవరణుఁ డఖిలరాజ్యోన్నతుఁ డై.
112
క. అనఘుఁడు పౌరవకుల వ | ర్ధనుఁ డద్దిననాథ తనయఁ దపతి వివాహం
బొనరఁగ నయ్యె; నిరువుర | కును వంశకరుండు పుట్టెఁ గురుఁ డున్నతుఁడై.
113
వ. వానిపేరం గురుక్షేత్రంబునాఁ బరఁగె; నట్టి కురునకు దాశార్హియైన శుభాంగికిని విధూరథుండు పుట్టె; వానికి మాగధి యయిన సంప్రియకు ననశ్వుండు పుట్టె; నయ్యనశ్వునకు మాగధి యైన యమృతకుం బరీక్షితుండు పుట్టె; వానికి బహుదానసుత యైన సుయశకు భీమసేనుండు పుట్టె; వానికిం గైకేయి యైన కుమారికిఁ బ్రదీపుఁడు (బర్యశ్రవసుండు) పుట్టె; వానికిఁబ్రతీపుండు పుట్టెఁ; బ్రతీపునకు శిబిపుత్త్రియయిన సునందకు దేవాపి శంతనుబాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి; రందు దేవాపి బాల్యంబునంద తపోవనంబున కరిగిన శంతనుండు రాజయ్యె; వానికి గంగాదేవికి దేవవ్రతుం డైన భీష్ముండు పుట్టె; మఱియు శంతనునకు యోజనగంధి యయిన సత్యవతికిం జిత్రాంగద విచిత్రవీర్యు లనంగా నిద్దఱుగొడుకులు పుట్టి; రందుఁ జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుండయిన, వానికింగొండుకవానివిచిత్రవీర్యురాజ్యాభిషిక్తుంజేసి భీష్ముండు కాశీరాజదుహితల నంబికాంబాలిక లనువారి నిద్దఱ విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన. 114
చ. అతిశయరూపయౌవన గుణాధిక సుందర మైన యాసతీ
ద్వితయమునందు సంతతరతిన్‌ వివశుం డయి రాజకృత్యముల్‌
మతి నొకనాఁడుఁ జేయ కహిమద్యుతితేజుఁడు రాజయక్ష్మబా
ధితుఁడయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్రవీర్యుఁడున్‌.
115
వ. అంత దౌష్యంతి సంతానవిచ్ఛేదంబు గావచ్చిన సత్యవతీనియుక్తుండై సకలధర్మమూర్తి కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబికయందు ధృతరాష్ట్రుని, నంబాలికయందుఁ బాండురాజును నంబికాపరిచారిక యందు విదురునిం బుట్టించిన; నందు ధృతరాష్ట్రునకు గాంధారికి వ్యాసవరప్రసాదంబున దుర్యోధనుండాదిగా నూర్వురు గొడుకులు పుట్టిరి. పాండురాజు నియోగంబునఁ గుంతీమాద్రులకు ధర్మానిలశక్రాశ్వినుల ప్రసాదంబున ధర్మజభీమార్జున నకులసహదేవు లనంగా నేవురుకొడుకులు పుట్టి; రయ్యేవురకుం బాంచాలి ధర్మపత్నియయ్యె;దానియందు ధర్మరాజునకుఁబ్రతివింధ్యుండును, భీమసేనునకు శుత్రసోముండును, నర్జునునకు శ్రుతకీర్తియు, నకులునకు శతానీకుండును, సహదేవునకు శ్రుతసేనుండును ననఁ బంచోపపాండవులు పుట్టిరి; మఱి ధర్మరాజునకు స్వయంవర లబ్ధ యైన దేవికయనుదానికి యౌధేయుండు పుట్టె; భీమసేనునకు జరంధరకు సర్వగుండు పుట్టె; నర్జునునకు సుభద్రకు నభిమన్యుండు పుట్టె; నకులునకుఁ జైద్యయయిన కరేణుమతికి నిరమిత్రుండు పుట్టె; సహదేవునకు స్వయంవరలబ్ధయైన విజయకు సుహోత్రుండు పుట్టె; మఱియుభీమసేనునకు హిడింబకుఘటోత్కచుండు పుట్టె; నిప్పాటంబాండవ పుత్త్రులైన పదునొక్కండ్రయందును వంశకరుం డైన యభిమన్యునకు విరాటపుత్త్రి యయిన యుత్తరకుం బరీక్షితుండు పుట్టె. 116
క. అతనికి ననంత పుణ్యా | న్విత యనఁదగు మాద్రవతికి నీ వఖిలజగ
న్నుత! జనమేజయ! పుట్టితి | ధృతిఁ బాండవవంశమునకుఁ దేజం బెసఁగన్‌.
117
వ. మఱియు నీకును వపుష్టమకును శతానీక శంకుకర్ణులుపుట్టి; రందు శతానీకునకువైదేహికి నశ్వమేధదత్తుండు పుట్టె. 118
క. వీ రైలులుఁ బౌరవులును | భారతులును గౌరవులును బాండవులు ననన్‌
వీరు లయి పరఁగి; రిది నయ | పారగ! భవదీయవంశ పరిపాటి మహిన్‌.
119
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 120
క. నరవరుఁ డగు శంతనున క | మరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డె ట్ల | య్యిరువురకును బుట్టె? దీని నెఱిఁగింపు మొగిన్‌.
121
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )